బసవతారక నగర్​ కబ్జాకు మై హోం యత్నం

బసవతారక నగర్​ కబ్జాకు మై హోం యత్నం
  • కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే పేదల ఇండ్ల కూల్చివేత
  • సీఎం కేసీఆర్, ప్రభుత్వ అధికారుపై అటెంప్ట్​ టు మర్డర్ ​కేసులు పెట్టాలె
  • బీజేపీ నేత తీన్మార్ మల్లన్న  

గచ్చిబౌలి, వెలుగు: టీఆర్​ఎస్​ ప్రభుత్వ పాలనతో రాష్ర్టంలో పేదలెవరూ బాగుపడే పరిస్థితి లేదని బీజేపీ నేత తీన్మార్ ​మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజవకర్గంలో ప్రభుత్వ భూముల దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. గచ్చిబౌలి పరిధి గౌలిదొడ్డిలోని సర్వే నం. 37లోని ప్రభుత్వ స్థలాన్ని మైహోం సంస్థ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  సీఎం కేసీఆర్​ డబుల్​ బెడ్రూమ్ ఇండ్లను కట్టియ్యడని, ప్రస్తుతం పేదలు ఉండే స్థలాలను వారికే కేటాయించి, పట్టాలు అందజేయాలని కోరారు. సోమవారం  గౌలిదొడ్డిలోని బసవతారక ​నగర్​లో అధికారులు కూల్చివేసిన పేదల ఇండ్లను  ఆయన స్థానిక కార్పొరేటర్ ​గంగాధర్​ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 300 మంది పేదల ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసి, ప్రజలను రోడ్డున పడేశారన్నారు.

సీఎం కేసీఆర్​, ప్రభుత్వ అధికారులపై హత్యాయత్నం కేసులు పెట్టాలని, రెవెన్యూ, పోలీసుల తీరు చూస్తుంటే రజాకార్ల తీరును గుర్తుకు తెస్తోందని మల్లన్న అన్నారు. బీజేపీ పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తన సెగ్మెంట్​ పరిధిలోని 300 కుటుంబాలు రోడ్డున పడితే పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. రియల్​ ఎస్టేట్​ దందాలో ఎమ్మెల్యే గాంధీ బీజీగా ఉన్నాడని, అందుకే పేదల ఇండ్ల విషయంలో నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.