చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి స్వామిని శుక్రవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకున్నారు. ఆయనకు టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు క్యాబినెట్ హోదాతో పదవి కట్టబెట్టారని, బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు.
పదవులను అప్పర్ క్యాస్ట్ కు కట్టబెడుతూ, బీసీల తరపున ఫేక్ ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ లో పదవులు వస్తాయో? రావోనని భయంతో బీసీ సమాజం చూస్తుందన్నారు. క్యాబినెట్ హోదాతో బీసీలకు న్యాయం చేయాల్సి ఉండగా, అప్పర్ క్యాస్ట్ కు పదవులు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మిగిలిన రెండు మంత్రి పదవులను బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో బీసీ ద్రోహిగా కాంగ్రెస్ కు ముద్ర పడుతుందన్నారు.
