పోలింగ్​ 70.66% .. మునుగోడు టాప్.. యాకత్​పురా లాస్ట్

పోలింగ్​ 70.66% ..  మునుగోడు టాప్.. యాకత్​పురా లాస్ట్

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు తప్ప రాష్ట్రవ్యాప్తంగా సజావుగా సాగింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉండగా.. 5 గంటలలోపు క్యూలైన్​లో ఉన్నవారికి మరికొంత టైమ్​ను ఎన్నికల కమిషన్​ కేటాయించింది. ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్​ రూమ్​లకు చేర్చారు. ఆదివారం ఓట్లను లెక్కించనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 65% పోలింగ్‌‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అయితే ఓటింగ్​​సమయం (సాయంత్రం 5 గంటలు) ముగిసే కంటే ముందు పోలింగ్​ కేంద్రాల్లోకి వచ్చి క్యూ లైన్​లో ఉన్న వాళ్లకు ఓటేసే అవకాశం ఇవ్వడంతో పలు కేంద్రాల్లో రాత్రి 7 గంటల వరకు కూడా పోలింగ్​ జరిగింది. మొత్తంగా 70.66% పోలింగ్​ నమోదైనట్లు రాత్రి 11 గంటలకు ఎన్నికల కమిషన్​ తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 73.74% పోలింగ్​ నమోదు కాగా.. ఇప్పుడు 3.08% తగ్గింది. ఈ సారి అత్యధికంగా మునుగోడు సెగ్మెంట్​లో 91.51%.. అత్యల్పంగా యాకత్​పురా సెగ్మెంట్​లో 39.69% ఓట్లు పడ్డాయి. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌‌ ముగించారు.  మిగిలిన 106 నియోజకవర్గాల్లో.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్​కు అవకాశం ఇచ్చారు. ఉదయం ఐదున్నర గంటలకు మాక్​ పోలింగ్​ నిర్వహించి.. ఏడు గంటలకు ఓటింగ్​ మొదలుపెట్టారు. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే అలర్టయిన టెక్నికల్ బృందాలు సమస్యను పరిష్కరించారు. 

119 సెగ్మెంట్లు.. 2,290 మంది అభ్యర్థులు

మొత్తం 119 నియోజకవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా.. ఒక ట్రాన్స్​జెండర్ ఉన్నారు. బీఆర్​ఎస్​ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా.. 118 చోట్ల కాంగ్రెస్, దాని మిత్ర పక్షం సీపీఐ ఒక చోట..  111 చోట్ల బీజేపీ, దాని మిత్రపక్షం జనసేన 8 చోట్ల పోటీ చేశాయి. తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం బరిలోకి దిగింది. సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 108 స్థానాల్లో పోటీ చేసింది. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌‌లో 48 మంది బరిలో ఉండగా..  అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున బరిలో నిలిచారు. 

644 మోడల్​ పోలింగ్​ కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏండ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు స్థానిక సంస్కృతిని చాటేలా 644 మోడల్ పోలింగ్‌‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు, 119 కేంద్రాలను పూర్తిగా యువ ఉద్యోగులే నిర్వహించారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల 433 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో 12,570 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.  

స్ట్రాంగ్​ రూమ్​ల్లో భద్రంగా ఈవీఎంలు

పోలింగ్ ముగిసిన తర్వాత అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల , వీవీప్యాట్లకు అధికారులు సీల్​ వేశారు. వాటిని స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియోలో రికార్డ్ చేశారు. ఇక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్​ రూమ్​ల వద్ద  24 గంటలూ పోలీసులు కాపలా కాయనున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మధ్యాహ్నం తర్వాత క్యూ లైన్లు 

ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా.. 9 గంటల వరకు 7.78 శాతం రికార్డయింది. ఆ తర్వాత ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేసేందుకు రాగా 11 గంటల వరకు 20.64 శాతం నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ ఊపందుకుంది. భారీగా క్యూ లైన్లు కనిపించాయి. పల్లెల్లో ఓటర్లు బారులు తీరారు. హైదరాబాద్‌‌లో ఓటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. చివరి నిమిషంలో ఎక్కువ మంది పోలింగ్​ బూత్​లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68 శాతం, 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఈసీ  వెల్లడించింది.