ఏటీసీల్లో నయా కోర్సులు..పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ట్రేడ్లు

ఏటీసీల్లో నయా కోర్సులు..పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త ట్రేడ్లు
  • 11 మందితో హైలెవల్ కమిటీ
  • 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మార్చే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐటీఐలను అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్  టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీ) తీర్చిదిద్దుతున్న సర్కారు.. ఇప్పుడు అక్కడ పరిశ్రమల డిమాండ్‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా కొత్త కోర్సులను  ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ఏటీసీల్లో ప్రస్తుతం ఉన్న 6 లాంగ్ టర్మ్  ట్రేడ్లకు అదనంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కొత్త కోర్సులను సిఫార్సు చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్  మంగళవారం జీవో ఆర్టీ నంబర్ 474 జారీ చేశారు.  

యువతకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ.. వచ్చే రెండు నెలల్లోగా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జీవోలో స్పష్టం చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్  తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కమిటీ..

అధికారులే కాకుండా నేరుగా పరిశ్రమ వర్గాల నుంచే సలహాలు తీసుకునేలా ఈ కమిటీ కూర్పు ఉండటం విశేషం. మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహికత శాఖ  రీజినల్  డైరెక్టర్  చైర్మన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తారు. టీమ్  కాంపోజిట్ సీఈవో వైస్ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉంటారు. 

కమిటీ సభ్యులుగా టాటా ఏరో స్పేస్, టాటా టెక్నాలజీస్, ఈసీఐఎల్, సైయెంట్, కాన్ఫెడరేషన్  ఆఫ్  ఇండియన్  ఇండస్ట్రీ, క్రెడాయ్, లైఫ్ సైన్సెస్, సాన్విబయోజెన్  వంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులకు చోటు కల్పించారు. 

కమిటీ బాధ్యతలు ఇవే..

ప్రస్తుత జాబ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఏ కోర్సులకు డిమాండ్  ఉందో పరిశ్రమల వర్గాలతో సంప్రదింపులు జరపాలి. నేషనల్  స్కిల్  క్వాలిఫికేషన్  ఫ్రేంవర్క్   ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కోర్సులను సిఫార్సు చేయాలి. ఒకవేళ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌క్యూఎఫ్  పరిధిలో లేని కోర్సులైతే.. వాటికి సంబంధించిన సిలబస్, శిక్షణా పద్ధతులను కూడా కమిటీయే రూపొందించి సూచించాలి.