కేసీఆర్ దీక్ష ఏ రైతుల కోసం ?

కేసీఆర్ దీక్ష ఏ రైతుల కోసం ?

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన..  కేసీఆర్ దీక్ష చేయడానికి, ప్రధాని మోడీ సాగు చట్టాలు రద్దు చేయడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా ? అని బండి ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల కోసమే కేసీఆర్ ధర్నా చేశారని ఆరోపించారు. ఫాంహౌస్‌లో ఉన్న సీఎంను బటయకు రప్పించింది బీజేపీనే అన్నారు బండి సంజయ్. 

‘ఒకసారి ధాన్యం కొనేది లేదంటడు... ఇంకోసారి కేంద్రమే కొనాలంటడు... ఇప్పుడేమో ప్రతి గింజా నేనే కొంటానంటున్నడు..  అసలేమైంది మా అంకుల్ కు?....గజనీలా మారిపోయిండు. అపరిచితుడిలా ప్రవర్తిస్తుండు.. ఆయనను అట్లా వదిలేయకండయ్యా.... మంచి డాక్టర్ కు చూపించండి’ అంటూ బండి సంజయ్ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు అడిగితే బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర కేసీఆర్ ది అంటూ విమర్శించారు. ఆయనకు  నిజంగా రైతులపట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ప్రకటించి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు బండి. 

 గిరిజనులు పోడు భూముల్లో సాగు చేసుకుంటుంటే...మహిళలు, బాలింతలు, పసిపిల్లలని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించి...తిండి పెట్టకుండా జైల్లో పెట్టించిన నీచుడు కేసీఆర్.అని విమర్శించారు. అలాంటి వ్యక్తి గిరిజన రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు బండి సంజయ్.  కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు భేష్.... రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే విధానం బాగుందని కితాబు ఇచ్చిన కేసీఆర్...ఇయాళ మా ధర్నా వల్లే ఆ చట్టాలను రద్దు చేశారని చెప్పుకోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.  ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. కేసీఆర్ దీ, ఆయన గురువు చంద్రబాబుది అదే పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు.

ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ అదే ధర్నా చౌక్‌లో కూర్చున్నారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే రైతులు, బీజేపీ నేతలపై రాళ్ల దాడి చేయించారని సంజయ్ మండిపడ్డారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్పిందా ? లేదా అంటూ ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.