
- 12 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- మృతుల్లో అత్తా కోడలు, బస్సు డ్రైవర్, క్లీనర్
- మహబూబ్నగర్ జిల్లా మాచారం వద్ద హైవేపై ఘటన
జడ్చర్ల, వెలుగు: ఓల్వో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు. మృతుల్లో అత్తా కోడలు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ఈ ప్రమాదం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గురువారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయల్దేరిన ఓల్వో బస్సు మాచారం సమీపంలో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు లక్ష్మీదేవి (65), గుర్రం రాధిక (49)తోపాటు బస్సు డ్రైవర్ బస్సుపాక నర్సింహ (50) అక్కడికక్కడే మృతి చెందారు.
బస్సు క్లీనర్ నర్సింహ(35) మహబూబ్నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన 12 మందిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో అదే హైవేపై ప్రయాణిస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన కాన్వాయ్‌ను ఆపి బాధితులను పలు వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఫోన్లో ఆదేశించారు.
పెళ్లికి హాజరై తిరిగి వస్తూ..
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన లక్ష్మీదేవి, రాధిక వరుసకు అత్తాకోడళ్లు. వీరిద్దరు కడప జిల్లాలో బంధువుల ఇంట్లో పెండ్లికి హాజరై గురువారం రాత్రి హైదరాబాద్‌కు బయల్దేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ చనిపోవడంతో వారి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. రాధిక భర్త రామకృష్ణ ఫిర్యాదు మేరకు జడ్చర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, టౌన్‌సీఐ కమలాకర్ పరిశీలించారు.