
- రైతుభరోసా స్కీమ్‌పై రైతుల మనోగతం
- కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి
- సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం
- సన్న, చిన్నకారు, కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి
- గతంలో మాదిరి గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్‌కు ఇవ్వొద్దు
- దుబారాను అరికట్టాలి.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
- గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది.. ఆ తప్పులు రిపీట్ కావొద్దు
- సబ్సిడీలను కొనసాగించాలని సూచన
- ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ
ఖమ్మం, వెలుగు: సాగులో ఉన్న భూమికే రైతుభరోసా స్కీమ్ అమలు చేయాలని, పంట పెట్టుబడి సాయాన్ని ఐదు నుంచి పదెకరాలలోపే పరిమితం చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. రైతు భరోసా సన్న, చిన్నకారు రైతులను, కౌలుదారులను ఆదుకునేలా ఉండాలి తప్ప భూస్వాముల కోసం కాదని స్పష్టంచేశారు.
గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఉత్తపుణ్యానికి రైతుబంధు ఇచ్చినట్లు ఇప్పుడు ఇవ్వొద్దని, దుబారాను తగ్గించాలని సూచించారు. రైతుబంధు పేరు చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు సబ్సిడీలన్నింటినీ ఎత్తేసిందని, దాని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అలాంటి తప్పులు రిపీట్ కావొద్దని అన్నారు. ‘రైతు భరోసా’పై బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో అభిప్రాయ సేకరణ జరిగింది.
కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పలువురు రైతులు, రైతుసంఘాల నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, పలు పార్టీల నేతలు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో కేబినెట్ కమిటీ సభ్యులు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
రైతుల సూచనలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ నోట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చినట్లు రాళ్లు, రప్పలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వొద్దని తేల్చిచెప్పారు. రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చుపెట్టారని.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసాకు 10 ఎకరాల వరకు సీలింగ్ విధించాలని కొందరు.. 5 ఎకరాలకే పరిమితం చేయాలని ఇంకొందరు సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో పట్టాలులేని రైతులకు కూడా రైతు భరోసా అందించాలన్నారు.
ఐటీ చెల్లించెటోళ్లకు వద్దు
కౌలు రైతులే ఎక్కువ నష్టపోతున్నారని, వారికి ఏదోరకంగా రైతుభరోసా సాయం అందించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని అవసరమైతే పునరుద్ధరించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని సూచించారు. పట్టా రైతులకు రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తే కౌలు రైతులకు బోనస్ ఇవ్వాలని ఇంకొందరు సలహా ఇచ్చారు. 2014 ముందు ఇచ్చినట్లు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, వివిధ రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
రైతుబంధు పేరు చెప్పి గత ప్రభుత్వం తమకు రావాల్సిన సబ్సిడీలను ఎత్తివేసిందని.. దీంతో చాలా నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కోతుల బెడదను నివారించాలన్నారు. అసలు భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ భూములు పంచాలని ఇంకొందరు రిక్వెస్ట్ చేశారు. గొర్రెలు, బర్రెల పథకాన్ని పేదలకు అమలు చేసి, గడ్డి కోసం బీడు భూములను వారి కేటాయించడం వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గిపోయే అవకాశం ఉందని ఇంకొందరు సూచించారు. తెల్ల రేషన్ కార్డుతో రైతు భరోసా కు లింకు పెట్టొద్దని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను రైతు భరోసా నుంచి మినహాయించాలని స్పష్టంచేశారు.
భూస్వాములకు ఇవ్వొద్దు
రైతు భరోసా స్కీమ్‌ను చిన్న, సన్నకారు రైతులకే పరిమితం చేయాలి. భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు, శ్రీమంతులకు రద్దు చేయాలి. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే రైతుభరోసాకు ఎంపిక చేయాలి.
- నాగమణి, ఎం.వెంకటాయపాలెం, ఖమ్మం జిల్లా
రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు
రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్చిచ్చుపెట్టిండు. కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లనే ఆయన ఓడిపోయిండు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్నీ తొలగించిండు. రైతుల భూమిలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు. కానీ, కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి.
- సాయిని రామారావు, కౌలు రైతు, ఖమ్మం జిల్లా
అన్ని పంటలకు బోనస్ ఇస్తేనే న్యాయం
రైతు బంధు, రైతు భరోసా పథకాలను పూర్తిగా తొలగించి.. అన్ని పంటలకు ప్రభుత్వం బోనస్ ఇస్తే ఆ పంటలను సాగు చేసిన రైతులకు, కౌలుదారులకు సరైన న్యాయం జరుగుతుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసాను అందించాలి. గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పడావు పడ్డ భూములకు భరోసా ఇవ్వొద్దు. కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఒక్క గుంట కూడా భూమి లేని కౌలు రైతులకు రైతు బీమా కూడా వర్తించడం లేదు. వారికి న్యాయం చేయాలి.
– బొంతు రాంబాబు, రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
సబ్సిడీలు కొనసాగించాలి
రైతుబంధు సర్వ రోగ నివారిణి అని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. ఆ పేరుతో మిగిలిన అన్ని పథకాలను బంద్ పెట్టింది. విత్తన సబ్సిడీ, ఇన్ పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ సబ్సిడీలను తొలగించింది. పంటలకు బీమాను కూడా తీసేసింది. వీలైనంత త్వరగా పంటలకు ఇన్సూరెన్స్ కల్పించాలి. రైతులకు ఉపయోగపడేలా సబ్సిడీలను కొనసాగించాలి. కాలేజీలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వొద్దు.
రాష్ట్రంలో 40 శాతం మంది కౌలు రైతులున్నారు. ఆత్మహత్య చేసుకునే వారిలో కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారు. కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలివ్వాలి. వరితో పాటు ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలి. రైతులకున్న సాగు భూముల విస్తీర్ణాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజిస్తూ ఆర్బీఐ నిబంధనలున్నాయి. వాటి ప్రకారం ఎన్ని ఎకరాలకు రైతు భరోసా సీలింగ్ విధించాలనే దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. – బాగం హేమంతరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
సాగులో లేని వాటికి ఇవ్వొద్దు
సాగులో లేని భూములకు రైతుభరోసా ఇవ్వొద్దు. భూమి యజమానులు అనుమ తిస్తే, కౌలు రైతులకు రైతు భరోసాను అం దించవచ్చు. కౌలు రైతులకు సబ్సిడీ పథకా లను వర్తింపజేయాలి. గత ప్రభుత్వ హయాంలో రైతులకు చేయూతనిచ్చే పథ కాలన్నింటిని రద్దుచేశారు. డ్రిప్‌పై సబ్సిడీ ని ఇటీవల పునరుద్ధరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.
- జొన్నలగడ్డ రవి, కాంగ్రెస్ నేత, కూసుమంచి
సాగులో ఉన్న భూములకే ఇవ్వాలి
వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేసిన భూములను రైతుభరోసా పథకం నుంచి తప్పించాలి. సేద్యం చేస్తున్న భూమి ఎంత ఉన్నా పరిమితి లేకుండా రైతు భరోసాను అందించాలి. రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, వారు పంటల సాగుతో నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
- మౌలానా, రైతు ఖమ్మం రూరల్ మండలం
గత ప్రభుత్వంలోని తప్పులు రిపీట్ కావొద్దు
రైతు బంధుపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈసారి రిపీట్ చేయొద్దు. భూస్వాములను తప్పించి, పదెకరాల్లోపు అది కూడా సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వాలి. మిగిలిన డబ్బులను కౌలు రైతులకు యాంత్రీకరణ పథకంపై సబ్సిడీ ద్వారా అందించాలి.
- దేవల రామకృష్ణ, రైతు, తల్లాడ