
- పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాలని నిర్ణయం
- సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా రిజర్వేషన్లు
- ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా..
- జడ్పీ చైర్పర్సన్లకు స్టేట్ యూనిట్‌గా అమలు
- కొత్తగా ఎమిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ వర్సిటీలు
- ఎమిటీ వర్సిటీలో 50% సీట్లు తెలంగాణవాసులకే
- గోశాలల ఏర్పాటు, నిర్వహణపై సీఎస్ నేతృత్వంలో కమిటీ
- సీఎం రేవంత్ అధ్యక్షతన నాలుగు గంటలు చర్చించిన కేబినెట్
- గత కేబినెట్ సమావేశాల్లోని నిర్ణయాల అమలు తీరుపై తాజాగా రివ్యూ
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలం యూనిట్ గా.. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్ గా.. జెడ్పీ చైర్పర్సన్లకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది.
దాదాపు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. గత 18 కేబినెట్సమావేశాల్లో 23 శాఖలకు సంబంధించి చర్చించిన 327 అంశాల పురోగతిపై రివ్యూ చేశారు. రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇందులో ఎమిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎమిటీ వర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం అడ్మిషన్లు కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.
రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి మీడియాకు వివరించారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను గత మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి కదలికలేదు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కుల గణన చేపట్టింది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటాను పరిగణనలోకి తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్‌సమావేశంలో వీటన్నింటిపై చర్చించిన కేబినెట్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్, లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంది.
గోశాలలపై కమిటీ
రాష్ట్రంలో అధునాతన గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు విధించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. హైదరాబాద్‌లోని ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ తోపాటు, వేములవాడ, యాదగిరిగుట్ట క్షేత్రాల్లో అత్యాధునిక గోశాలలు నిర్మించాలని కేబినెట్నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని అధికారులను ఆదేశించింది.
కేబినెట్లో కొత్త సంప్రదాయం
కేబినేట్ భేటీలకు సంబంధించి ఈసారి రాష్ట్ర మంత్రివర్గం కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరిపింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. గురువారం జరిగింది19వ కేబినెట్భేటీ. గత సమావేశాల్లో చర్చించిన 327 అంశాల అమలు పురోగతిపై రివ్యూ చేసింది. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడ్డ జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు కేబినెట్ఓకే చెప్పింది.
ఇతర పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి: పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే లోకల్‌బాడీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘కేబినెట్ తీసుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా నిలిచి, కుల గణన ద్వారా సమగ్ర డేటాను సేకరించింది. కోర్టులు అనేక సందర్భాల్లో స్థానిక పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సూచించాయి” అని వివరించారు.
తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 17 వేల ఉద్యోగాలు ప్రాసెస్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్తగా 22వేల ఉద్యోగాల భర్తీపైనా చర్చించినట్లు వివరించారు. వచ్చే మార్చి లోపు లక్ష ఉద్యోగాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆఫీసర్స్ కమిటీని నియమించి, వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.
అత్యాధునిక గోశాలలు: వాకిటి శ్రీహరి
హైదరాబాద్‌లోని ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించనున్నట్లు స్పష్టంచేశారు.
కొత్తగా 22 వేల సర్కార్ కొలువులు
ఏడాదిన్నర కాలంలో వివిధ శాఖల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇవి కాకుండా కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వడంపై కేబినెట్ భేటీలో చర్చించారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రతి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఉన్నతాధికారులకు సూచించింది. ఇప్పటికే నియమించిన కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని స్పష్టం చేసింది. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.
కావాలనే కేంద్రం ఆలస్యం చేస్తున్నది: పొంగులేటి
కులగణన సర్వే ఆధారంగా 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేబినెట్ మీటింగ్‌కు అడ్వకేట్ జనరల్‌ను కూడా పిలిచి చర్చించామన్నారు. భవిష్యత్‌లో న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ ప్రభుత్వం కేవలం మాటలతో కాకుండా, చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లను అమలుచేయబోతున్నదని పొంగులేటి తెలిపారు.
న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా అడ్వకేట్ జనరల్ వంటి అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకొని ముందుకుపోతున్నామన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీసీ బిల్లులను ఆమోదించుకుని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఆయన గుర్తుచే శారు. సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రిజర్వేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో, కేంద్ర మంత్రులతో చర్చించారని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కావాలనే ఆలస్యం చేస్తుస్తున్నదని ఆయన ఆరోపించారు.