- హెచ్‌సీఏ టీజీ20 లీగ్ లోగో లాంచ్
హైదరాబాద్, వెలుగు: దేశం గర్వించదగ్గ ఎంతో మంది క్రికెటర్లను టీమిండియాకు అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు దక్కుతుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. ఇప్పుడు తెలంగాణ నుంచి మరింత మంది క్రికెటర్లు నేషనల్ టీమ్‌కు ఆడాలని అతను ఆకాక్షించాడు. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో రాబోతున్న టీజీ టీ20 లీగ్ అందుకు క్రియాశీల పాత్ర పోషించాలన్నాడు. ఎనిమిది ఫ్రాంచైజీ జట్లతో జూన్‌లో జరగబోతున్న ఈ లీగ్ లోగోను రాయుడు బుధవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా కెరీర్‌ను తీర్చిదిద్దిన ఇక్కడి సెలెక్టర్లు, అధికారులకు థ్యాంక్స్. మరో 8 ఏండ్లలో వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న హెచ్‌సీఏ నుంచి ఇకపై రెట్టింపు సంఖ్యలో ఆటగాళ్లు దేశానికి ఆడాలని కోరుకుంటున్నా. టీఎన్‌పీఎల్, కేపీఎల్ వంటి లీగ్స్ ద్వారా క్రికెటర్లకు ఐపీఎల్‌లో చాన్స్ లభించడం చూస్తున్నాం.
సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ మన లోకల్ ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న టాలెంట్‌ను గుర్తించి, సాన బట్టేందుకు టీజీ20 లీగ్ అద్భుతమైన ప్లాట్‌ఫామ్ అవుతుంది’ అని రాయుడు పేర్కొన్నాడు. రూరల్ క్రికెటర్లను కనెక్ట్ చేసి వారిని నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లే వేదికగా ఈ లీగ్ పని చేస్తుందని హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో ఉన్న అద్భుతమైన ప్రతిభకు సరైన వేదిక లేని లోటును టీజీ 20 లీగ్ భర్తీ చేస్తుందని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ వి. ఆగం రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త డీజీపీ సీవీ ఆనంద్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వర్ నాథ్, హీరో వెంకటేశ్ హెచ్‌సీఏ మెంబర్లు పాల్గొన్నారు.
ఫ్రాంచైజీలకు భారీ పోటీ
టీజీ 20 లీగ్‌లో టీమ్స్‌ను దక్కించుకునేందుకు సిటీకి చెందిన రియల్ ఎస్టేట్, మీడియా, సినీ రంగాలకు చెందిన మేటి కంపెనీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. 8 టీమ్స్ కోసం ఇప్పటికే 40కి పైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. మే 2వ తేదీ వరకూ అవకాశం ఉండటంతో పోటీదారుల సంఖ్య 50 దాటనుంది. బిడ్డింగ్ ద్వారా ఫ్రాంచైజీలను కేటాయించనున్నారు.

