కాళేశ్వరం పిల్లర్లు కుంగినట్లే... బీఆర్ఎస్​ను పాతరేయాలె : జేపీ నడ్డా

కాళేశ్వరం పిల్లర్లు కుంగినట్లే...  బీఆర్ఎస్​ను పాతరేయాలె :  జేపీ నడ్డా

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​కుంగిపోయినట్టే బీఆర్ఎస్ సర్కారును మళ్లీ లేవకుండా పాతరేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. సోమవారం ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో సకల జనుల సంకల్ప సభలో ప్రసంగించారు. జగిత్యాలలో రోడ్​షోలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన అవినీతి సొమ్మును కక్కించి జైలుకు పంపుతామన్నారు. పేదల భూములు గుంజుకోవడానికి ధరణి తెచ్చారని విమర్శించారు. విలువైన మియాపూర్ భూములను కబ్జా చేశారని అన్నారు. మైనార్టీలను సంతోషపెట్టడమే కేసీఆర్ విధానంగా మారిందన్నారు. బీఆర్ఎస్​కు ఓటేయకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వమని బీఆర్ఎస్ లీడర్లు  దమ్కీ  ఇస్తున్నారని, అలాంటి వాటికి భయపడొద్దన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని, ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసు లాంటివని నడ్డా అన్నారు. బీఆర్ఎస్‌ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని, కాంగ్రెస్ అంటే కరప్షన్ అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పాలకులు భూమి, ఆకాశం, సముద్రం దేన్నీ వదల్లేదని విమర్శించారు. కామన్​వెల్త్ కుంభకోణంతో ప్రపంచంలో పరువుతీశారన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధికి చిహ్నం అని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం, వందే భారత్ రైళ్లతో దూసుకెళ్తున్నామన్నారు. మరోసారి మోదీ గెలిస్తే ప్రపంచంలో భారత్ మూడో బలమైన ఆర్థిక శక్తిగా తయారవుతుందన్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్త ఉన్నత స్థానానికి చేరతారని. అందుకు మోదీ నిదర్శనమన్నారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్​లను ఎన్నికల్లో చిత్తు చేయాలన్నారు. బీజేపీ సర్కారు వస్తే వడ్లకు రూ.3,100 రేటు ఇస్తుందని, పెట్రోల్, డీజిల్ పై టాక్స్ తగ్గిస్తామన్నారు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని, ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్, బోగ శ్రావణి, రాకేశ్​రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, అరుణతార తదితరులు పాల్గొన్నారు.