ఆడబిడ్డలే మా బలం బలగం .. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం 

ఆడబిడ్డలే మా బలం బలగం .. మహిళా శక్తి సదస్సులో సీఎం ప్రసంగం 
  • ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం: రేవంత్ రెడ్డి 
  • కేసీఆర్​కు ఆడబిడ్డ అంటే కవిత తప్ప ఎవరూ కన్పించలే 
  • ఆడబిడ్డల ఉసురు తగిలే ఫామ్​హౌస్​​కు పోయిండు   
  • అడ్డంపడితే బస్సు ఎక్కించైనా ఫ్రీ బస్ కొనసాగిస్తం 
  • త్వరలో 10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు 
  • పడగొడ్తామనేటోళ్లు వస్తే పొర్కటలు తిరగేసి కొట్టాలె 
  • ప్రభుత్వం వైపు  కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడాలె

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సంఘాలలో 63 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని.. కోటి మంది కావాలన్నారు. తమ బలం, బలగం, సైన్యం అంతా ఆడబిడ్డలేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా మహిళా శక్తి చేతిలోనే ఉందన్నారు. ‘‘కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన బిడ్డను తప్ప ఇంకే ఆడబిడ్డనూ పట్టించుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వద్దని కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవిత అంటున్నరు. ఎవరొచ్చినా సరే..

ఆడబిడ్డలకు అడ్డంపడితే వారి మీదకు ఆర్టీసీ బస్సు ఎక్కించి అయినా సరే ఫ్రీ బస్ జర్నీ స్కీంను కొనసాగిస్తం” అని సీఎం తేల్చిచెప్పారు.  మంగళవారం సికింద్రాబాద్ లో జరిగిన మహిళా శక్తి సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆడబిడ్డలు గెలిపించిన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ వన్నీ చీకటి ఒప్పందాలు, చీకటి వ్యవహారాలేనని ఆరోపించారు. రాబోయే కొద్దిరోజుల్లో10 లక్షల మంది ఆడబిడ్డలతో కవాతు చేయించి..

కోటి మంది ఆడబిడ్డలు కాంగ్రెస్​తో ఉన్నారని రాష్ట్రం మొత్తం చాటుతామన్నారు. ఆ ఆడబిడ్డలే  కంచె వేసి ప్రభుత్వాన్ని కాపాడతారన్నారు. కరెంట్ వైర్లలాగా కాంగ్రెస్ వైపు నిలబడి.. తమవైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటారని హెచ్చరించారు.  ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. నెల రోజుల్లో శిల్పారామం పక్కన స్వయం సహాయక సంఘాల మహిళలకు 100 స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. 

‘‘మీరు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తాం. టాటా బిర్లా, అదానీ అంబానీలతో పోటీ పడేలా సౌలతులు కల్పిస్తాం” అని చెప్పారు. రాష్ట్రంలో14 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలించాలని కోరారు. 

అప్పుడు అన్నీ కవితనే..

తెలంగాణ వచ్చిన తర్వాత పదేండ్లలో కేసీఆర్ తన బిడ్డ కవితను తప్ప ఇంకే ఆడబిడ్డనూ పట్టించుకోలేదని రేవంత్ విమర్శించారు. ‘‘బతుకమ్మ ఆడితే ఆమెనే ఆడాలి. ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి. ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి. ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకెవరి దిక్కైనా చూసిండా. ఆయన బిడ్డ ఆయనకు ఎంత ముద్దో మా అక్కలు చెల్లెల్లు మాకు అంత ముద్దు కాదా? మా అక్కలు చెల్లెల్లు బాగుండాలని కోరుకుంటే తప్పా?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘ఆడబిడ్డలు ఎట్లున్నరని ఆ నాటి సీఎం కేసీఆర్ అడగలేదు.

మహాలక్ష్మి గ్రూప్​ల పరిస్థితి చూడలేదు. పావలా వడ్డీ ఇయ్యలేదని.. సున్నా వడ్డీ గురించి మాట్లాడకుండా సంఘాలను దివాలా తీయించారు. మహిళల ఉసురు తలిగింది కాబట్టే ఇయ్యాల ఉద్యోగం ఊడిపోయి ఫాంహౌజ్​లో పడుకున్నారు” అని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలను దివాలా తీయించిన కేసీఆర్ ను ఆడబిడ్డలు బండకేసి కొట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని సీఎం రేవంత్ తెలిపారు. 92 రోజుల్లో 25 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. ‘‘భద్రాచలం గుడి, సమ్మక్క సారలమ్మ దైవదర్శనం, యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహా స్వామి, జోగులాంబ దర్శనం కావొచ్చు అదే కాదు.. ఇంటి ఆయన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే తల్లిగారి ఇంటికి పోవడానికి కూడా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు” అని అన్నారు. 

సీఎం సీట్లో దొరలే కూర్చోవాల్నా? 

వ్యవసాయం చేసుకునేటోళ్ల పిలగాడు సీఎం అయితే వాళ్ల కడుపుల ఒకటే మంటగా ఉందని సీఎం రేవంత్ అన్నారు. సీఎం కుర్చీల దొరలే కూర్చోవాల్నా? ఆ కుర్చీలో వ్యవసాయం చేసుకునేటోళ్ల పిల్లలు కూర్చోవద్దా? అని ప్రశ్నించారు. ప్రజలు తమకు తీర్పునిచ్చారని.. 93 లక్షల మంది ఆశీర్వదించి కుర్చీలో కూర్చుండబెట్టారన్నారు. ‘‘అయ్య పేరు చెప్పి కూసున్నానా.. విరాసత్​లో ఎవరైనా పుణ్యానికి ఇచ్చిండ్రా. ఎవరి ఇంట్లనైనా ఉంటే రాత్రిపూట పోయి దొంగతనం చేసినమా? మీరే చెప్పుండ్రి అక్క’’ అని సీఎం అన్నారు. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సరిదిద్దుతూ ముందుకు వెళ్తున్నామన్నారు.  

రాష్ట్రాన్ని దివాలా తీయించిన్రు 

గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించారని రేవంత్ అన్నారు. రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, ఇప్పట్లో ఏమీ చేయలేనని అనుకున్నానని చెప్పారు. కానీ అన్ని చిక్కుముళ్లను విప్పుకుంటూ.. ఒక్కోటి సక్కదిద్దుకుంటూ పరిష్కరిస్తున్నామన్నారు. ఎన్నికల కంటే ముందే పేదవారికి ఇండ్లు ఇవ్వాలని.. ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి పట్టుబట్టి భద్రాచలంలో ప్రకటన చేయించారన్నారు. ముందుగా 4.50 లక్షల ఇండ్లకు రూ.22,500 కోట్లు కేటాయిస్తామన్నారు. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్ల ఆశ చూపి అబద్ధాలతో కాలం గడిపారన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. ఆడబిడ్డల కష్టం చూడలేక దీపం పథకం కింద 400కే గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత మోదీ, కేసీఆర్ కలిసి సిలిండర్ ధరను రూ. 1200కు పెంచారని.. దీంతో ఆడబిడ్డలు మళ్లీ కట్టెలపొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ తాము రూ. 500కే సిలిండర్, ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు. 

కలిసి వస్తున్నరు.. కాల్చి వాత పెట్టండి 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతామని చెప్పి ఫాంహౌజ్​లో చిందులు వేస్తున్నారని సీఎం రేవంత్​ఫైర్ అయ్యారు. అట్లాంటోళ్లను చూస్తూ ఊరుకుందామా? కాల్చి వాత పెడుదామా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడుతాం.. నష్టం చేకూరుస్తాం అనేటోళ్లు ఊర్లల్లకు వస్తే పొర్కటలు తిరిగేసి కొట్టాలన్నారు. ఓటు అడగానికి వస్తే అదే చేయి చాపమని చెప్పి సలాకీ కాల్చి వాతలు పెట్టాలన్నారు.

 ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్, ​ నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారన్నారు. పది ఏండ్ల నుంచి ప్రధానిగా మోదీని చూస్తున్నామని.. వడ్లు, కందులు, మొక్కజొన్న, మిర్చి పంట ఉత్పత్తులు కొన్నారా? అని ప్రశ్నించారు. ఏమి కొనకపోగా.. నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారన్నారు. ‘‘అందరికీ ఇండ్లు ఇస్తమన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నరు. వీటిలో ఒక్కటైనా పూర్తిగా చేశారా?” అని ప్రశ్నించారు. ‘‘ఇద్దరు కలిసి చీకట్లో ఒప్పందం చేసుకున్నరు. వాళ్లు 9 చోట్ల, వీళ్లు 4 చోట్ల ఎంపీ అభ్యర్థలను ప్రకటించారు. ఒకరు ప్రకటించిన దగ్గర ఇంకొకరు ప్రకటించలేదు. ఇద్దరు కలిసి కాంగ్రెస్​ను దెబ్బతీయాలని చూస్తున్నారు” అని రేవంత్ ఫైర్ అయ్యారు.   

సెర్ప్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల స్టాల్స్ 

పరేడ్ గ్రౌండ్​లో స్వశక్తి మహిళా సదస్సుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మొదటగా సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్​ను సందర్శించారు. స్వయం ఉపాధి కేంద్రాలతో మహిళలు రాణిస్తున్న తీరును అభినందించారు. వివిధ జిల్లాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను స్టాల్స్​లో ప్రదర్శించారు. మహిళలను మరింతగా ప్రోత్సహించి వారిని కోటీశ్వరులను చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

స్టాళ్లలో బంజారా ఉత్పత్తులు, సిషల్ ఆర్టికల్స్, నకాషి పెయింటింగ్స్, డర్రిస్, మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్కూల్ యూనిఫామ్స్, టస్సార్ శారీస్, హ్యాండ్లూమ్స్, టై అండ్ డై క్లాత్స్, గొల్లభామ చీరలు, లెదర్, చెక్కబొమ్మలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, పెంబర్తి బ్రాస్, మిల్లెట్ ఉత్పత్తులు, డిజి పే పాయింట్, వీఎల్ఈ పాయింట్, పశుమిత్ర, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఉడ్ క్రాఫ్ట్స్, హోమ్ ఫుడ్స్ కు సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి.  

మహిళలను కోటీశ్వరులుగా మారుస్తం: భట్టి

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగాచేయడమే కాంగ్రెస్​ సర్కారు లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ మరణిస్తే వారు చెల్లించాల్సిన రుణభారాన్ని కుటుంబం పై మోపకుండా ప్రభుత్వమే చెల్లించే విధంగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్ ప‌‌‌‌రేడ్ గ్రౌండ్‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో భ‌‌‌‌ట్టి విక్రమార్క ప్రసంగించారు.

రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా కోటి రూపాయల వరకు రుణాలను ఇవ్వబోతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో 64 ల‌‌‌‌క్షల మంది స్వయం స‌‌‌‌హాయ‌‌‌‌క సంఘాల సభ్యులకు  ఐదేండ్లలో ల‌‌‌‌క్ష కోట్ల రూపాయ‌‌‌‌ల రుణాలు ఇప్పించాల‌‌‌‌ని సర్కారు నిర్ణయించినట్టు చెప్పారు. తద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబ‌‌‌‌ర్ 7 నుంచి మ‌‌‌‌హిళ‌‌‌‌లు తీసుకున్న రుణాల‌‌‌‌కు వ‌‌‌‌డ్డీ క‌‌‌‌ట్టాల్సిన అవ‌‌‌‌స‌‌‌‌రం లేదని, ప్రభుత్వమే ఆ వ‌‌‌‌డ్డీని చెల్లిస్తుందని స్పష్టం చేశారు.

రాబోయే ఐదేండ్లపాటు మ‌‌‌‌హిళ‌‌‌‌లు తీసుకునే రుణాల‌‌‌‌కు ప్రభుత్వమే వ‌‌‌‌డ్డీ కడుతుందని స్పష్టం చేశారు. గ‌‌‌‌త బీఆర్ఎస్ సర్కారు​ చేసిన అప్పుల వ‌‌‌‌ల్ల రాష్ట్ర సర్కారు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ  మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌ను మ‌‌‌‌హాల‌‌‌‌క్ష్మిలుగా గౌర‌‌‌‌వించాల‌‌‌‌ని అధికారంలోకి వ‌‌‌‌చ్చిన రెండు రోజుల్లోనే  ఉచిత ఆర్టీసీ బ‌‌‌‌స్సు ర‌‌‌‌వాణా స‌‌‌‌దుపాయం క‌‌‌‌ల్పించామని గుర్తు చేశారు. 

రేవంత్ ను ఓడగొట్టాలి, పడగొట్టాలని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత అంటున్నరు.  ఏం పాపం చేసిన అక్క నేను. ఎవరి ఆస్తినైనా గుంజుకున్ననా. ఎవరైనా తల్లెల పెట్టుకుంటే ఏమైనా గుంజుకు తిన్ననా. వాళ్ల ఫామ్​హౌస్​​లో గుంట భూమి అడిగిన్నా. లేకపోతే దోచుకున్న సొమ్ములో వాటా అడిగిన్నా. జన్వాడ ఫామ్​హౌస్​​లో ఏమన్నా రెండు రూంలు అడిగిన్నా. నేనేం చేసిన? ఆడబిడ్డలను బలోపేతం చేసిన. ఆరోగ్యశ్రీ బీమాను రూ.10 లక్షలకు పెంచిన. సిలిండర్ రూ.500కు ఇచ్చిన. 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇచ్చిన. ఇండ్లు కట్టుకోనింకె రూ.5 లక్షలు ఇచ్చిన. మహిళా సంఘాల్లో ఆడబిడ్డలు కోటి మంది కండి.. కోటీశ్వరులను చేస్త అని చెప్పిన. ఇదేమైనా తప్పా. ఇదేమైనా మోసమా. ఇది ఎవరికైనా అన్యాయమా?

 సీఎం రేవంత్​ రెడ్డి