
మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరి భేటీ 30 నిమిషాలపాటు సాగింది. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి.. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేశారు పీఎం మోదీ.. ఆ తర్వాత రాష్ట్ర పరిస్థితులను వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వాటాలు, గ్రాంట్ కు సంబంధించి నివేదిక ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని వివరించటంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టులకు అనుమతి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని విజ్ణప్తి చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేంద్రం రావాల్సిన నిధులను రాబట్టలేకపోయిందన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా ఇవ్వాలని ప్రధానిని కోరామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామని భట్టి అన్నారు. వెనకబడిన ప్రాంతాలను నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరామన్నారు భట్టి. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించకుండా చూడాలని కోరామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలకోసం తొలిసారి ప్రధానిని కలిశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
తెలంగాణను కొట్లాడి తెచ్చుకుండే నీళ్లు, నిధులు, నియామకాలకోసం.. అలాంటిది గత ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలపై నిర్లక్ష్యం చేసిందన్నారు. 10ఏళ్లు పాలించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు భట్టి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామన్నారు.