విద్యుత్‌‌ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

విద్యుత్‌‌ అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో గత పదేండ్లలో విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో జరిగిన అవకతవకలపై, అక్రమాలపై న్యాయ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. చత్తీస్‌‌‌‌గడ్​ విద్యుత్ కొనుగోలుకు గత రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లోని ఉద్దేశాలను వెలికి తీయడానికి దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. దీంతోపాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కూడా న్యాయ విచారణ జరిపిస్తామని, ఇందు కోసం అసెంబ్లీ సభ ద్వారా అధికారులను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అప్పటి విద్యుత్ మంత్రి జగదీశ్​రెడ్డి న్యాయ విచారణను కోరుతున్నారని, దానికి తగ్గట్టుగానే దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీస్తామన్నారు. 

గురువారం అసెంబ్లీలో విద్యుత్​పై వైట్​ పేపర్​ రిలీజ్, దానిపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.  తమ ప్రభుత్వంపై ప్రస్తుత ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని విద్యుత్​ శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. తప్పులు జరిగినట్టు భావిస్తే  జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాల్ చేశారు. దీనిపై సీఎం  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యుడే స్వయంగా డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడీషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ‘‘అసెంబ్లీ వేదికగా చెపుతున్నా.. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యుత్ రంగంలో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేసినం. కరెంట్ అనే సెంటిమెంట్ ను ఆర్థిక అవసరాలకు గత ప్రభుత్వం వాడుకుంది. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది. చత్తీస్​గడ్​ విద్యుత్​ కొనుగోళ్లు, భద్రాద్రి పవర్​ ప్రాజెక్టు, యాదాద్రి  పవర్ ప్రాజెక్టుపై నూటికి నూరు శాతం న్యాయ విచారణకు ఆదేశిస్తున్నం” అని ప్రకటించారు. 

చత్తీస్‌‌‌‌గడ్​ ఒప్పందంతో ఆర్థిక భారం 

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో చత్తీస్‌‌‌‌గఢ్ తో జరిగిన విద్యుత్‌‌‌‌ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘1,000 మెగావాట్ల కొనుగోళ్ల ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నయ్. ప్రజాధనం వృథా అయింది.  ఈ ఒప్పందంతో ప్రభుత్వంపై రూ.1,362.42 కోట్ల భారం పడింది. కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నా...  ఎలాంటి టెండర్లు లేకుండా అధిక ధరకు చత్తీస్ గడ్​ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు గత 2014లో నవంబర్​ 3న అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. చత్తీస్ గడ్​ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై గతంలో ఈఆర్‌‌‌‌సీలోనూ మా వాదనలు వినిపించాం. ఆనాడు అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే..  మార్షల్స్ చేత బయటకు గెంటేయించారు” అని ఆయన గుర్తుచేశారు. 

ఆ ఒప్పందం మంచిదికాదన్న ఉద్యోగిని బదిలీ చేశారు

చత్తీస్‌‌‌‌ గడ్​ ఒప్పందం రాష్ట్రానికి ఆర్థికంగా భారమని నిజాలు చెప్పి, నివేదిక ఇవ్వడంతో పాటు ఈఆర్‌‌‌‌సీలో వాదనలు వినిపించినందుకు ఓ విద్యుత్​ ఉద్యోగిని అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం మారుమూల ప్రాంతానికి బదిలీ చేసిందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అధికారిని ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుందని అన్నందుకు ఆయనను ఎక్కడికో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసిన్రు. కక్ష సాధింపుగా ఆయన హోదాను తగ్గించి, చిన్న ఉద్యోగంలో నియమించిన్రు. ఆ అధికారి తెలంగాణ విద్యుత్ జేఏసీ నిపుణుడిగా సేవలు అందించారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సదరు అధికారికి స్వరాష్ట్రంలో ప్రమోషన్‌‌‌‌ ఇవ్వకపోగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసి డిమోషన్‌‌‌‌ ఇచ్చి చిన్న ఉద్యోగంలో పెట్టారు. ఎందుకు ఇట్ల చేశారో, అప్పటి ప్రభుత్వ ఉద్దేశాలు ఏమిటో విచారణలో బయటకు వస్తయ్​” అని పేర్కొన్నారు. చత్తీస్ గడ్​ నుంచి కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, నిర్లక్ష్యంపై కేసులు నడుస్తున్నాయని.. ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌, వేరియబుల్‌‌‌‌ చార్జీలకు సంబంధించి చత్తీస్‌‌‌‌గడ్‌‌‌‌ ఈఆర్‌‌‌‌సీలో కేసు నడుస్తున్నది ఆయన తెలిపారు. 

యాదాద్రి పవర్‌‌‌‌ ప్లాంట్​ను 24 నెలలు పూర్తి చేస్తామన్నరు

నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్​ను 24 నెలల్లో పూర్తి చేస్తామని గత బీఆర్​ఎస్​ సర్కార్​ చెప్పి ఎనిమిదేండ్లయినా పూర్తి చేయ లేదని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘మూడో అంశంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశిస్తున్నం. ప్రభుత్వ రంగ సంస్థ అంటూ బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌కు  2015 జూన్‌‌‌‌ 1న నామినేషన్‌‌‌‌పై ఈ ప్రాజెక్టును కేటాయించారు. ఇదే బీహెచ్‌‌‌‌ఈఎల్‌‌‌‌ సంస్థ జార్ఖండ్‌‌‌‌లో ఇక్కడి కంటే 18 శాతం లెస్‌‌‌‌కు కోట్‌‌‌‌ చేసింది. 

24 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పటికీ పూర్తి కాలేదు.. వచ్చే ఏడాదిలో కూడా పూర్తవుతుందో లేదో” అని అన్నారు. మెగావాట్‌‌‌‌కు రూ. 6.27కోట్లకు నిర్మాణం కావాల్సింది మెగావాట్‌‌‌‌కు రూ.9 కోట్లకు చేరుకుందని తెలిపారు. అనుకున్నటైమ్​కు యాదాద్రి పవర్​ ప్లాంట్​ పూర్తికాకపోవడంతో అంచనా వ్యయం భారీగా పెరిగిపోయిందని అన్నారు. దీనిపై విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు. పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ల స్థాపిత సామర్థ్యం పెంచినట్లు గొప్పలుచెప్తున్నారు తప్ప సొంతంగా పవర్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌లు కట్టి పూర్తి చేసింది ఏవని బీఆర్​ఎస్​ను సీఎం ప్రకటించారు. 74 మెగావాట్ల నుంచి 5,600 మెగావాట్ల సోలార్‌‌‌‌ స్థాపిక సామర్థ్యం పెంచినట్లు  గొప్పలు చెప్పారని, ఇందులో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ ఒక్క మెగావాట్‌‌‌‌ మాత్రమేనని, మిగతా అంతా ప్రైవేటు వారే నిర్మించుకున్నారని తెలిపారు.  

వ్యవసాయానికి 24 గంటల కరెంట్​పై అఖిలపక్షంతో కమిటీ

వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌‌‌‌ సరఫరా చేసినట్లు గత బీఆర్​ఎస్​ పాలకులు చెప్తున్నారని, దీనిపై నిజనిర్ధారణకు అఖిల పక్షంతో  కమిటీ వేద్దామని సీఎం అన్నారు. ‘‘24 గంటలు సరఫరా కాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి వాస్తవాలు చెప్తుంటే.. బీఆర్​ఎస్​ సభ్యులు దబాయింపుగా మాట్లాడుతున్నరు. అలాంటప్పుడు సబ్‌‌‌‌ స్టేషన్లలో ఉండాల్సిన లాగ్‌‌‌‌ బుక్‌‌‌‌లు హైదరాబాద్‌‌‌‌కు ఎందుకు తెప్పించుకున్నరు? వ్యవసాయానికి అవసరమయ్యే త్రీ ఫేజ్‌‌‌‌ ఇవ్వకుండా సింగిల్‌‌‌‌ ఫేజ్‌‌‌‌ ఇచ్చి 24గంటలు ఇచ్చినట్లు చెప్పుకున్నరు. దీనిపై అఖిలపక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేసి అప్పటి మంత్రిని కూడా ఇందులో సభ్యుడిగా నియమిస్తం” అని ప్రకటించారు. హెల్త్‌‌‌‌ చెకప్‌‌‌‌ చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తెలిసి ఆ సమస్యలు పరిష్కరించుకోవచ్చని, విద్యుత్‌‌‌‌ వ్యవస్థల తీరు పారదర్శకంగా ఉండాలని, ఇక్కడ చర్చించి సభ్యులు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో శ్వేతపత్రం విడుదల చేసినట్లు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు.

భద్రాద్రి ప్లాంట్‌‌‌‌లో భారీ నష్టం

భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కూడా వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘1,080 మెగావాట్ల భద్రాద్రి ప్రాజెక్ట్‌‌‌‌ను వేగంగా నిర్మాణం చేస్తామని చెప్పి.. అప్పటికే మెగావాట్‌‌‌‌కు రూ. 6.75 కోట్లకు అందుబాటులో ఉన్నా కొత్త టెక్నాలజీని పక్కన పెట్టి  మెగావాట్‌‌‌‌కు రూ. 7 కోట్ల అంచనా వ్యయంతో కాలం చెల్లిన సబ్‌‌‌‌ క్రిటికల్‌‌‌‌  టెక్నాలజీని వినియోగించారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం సబ్‌‌‌‌ క్రిటికల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్లు కట్టొద్దని ఆదేశించినా వినకుండా రెండేండ్లలో పూర్తి చేస్తమని చెప్పి ఏడేండ్లకు కట్టారు. ఏడేండ్లలో మెగావాట్‌‌‌‌కు రూ. 9.74 కోట్లకు చేరింది. వాటితో ఇండియా బుల్స్‌‌‌‌ కంపెనీకి లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారు’’ అని రేవంత్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు. భద్రాద్రి పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో వేలకోట్ల దోపిడీ జరిగిందని, న్యాయ విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు.