పాత టీడీపీ బ్యాచ్​పై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

పాత టీడీపీ బ్యాచ్​పై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్
  • తనకున్న పరిచయాలతో మంతనాలు జరుపుతున్న రేవంత్
  • ఇప్పటికే సీతా దయాకర్​రెడ్డి, తుమ్మలతో సంప్రదింపులు
  • అధికార పార్టీలోని అసంతృప్తులతోనూ చర్చలు
  • ఆ లీడర్ల విషయంలో బీఆర్ఎస్​లో  టెన్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాత టీడీపీ లీడర్లపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వివిధ నియోజకవర్గాల్లో అప్పట్లో టీడీపీలో యాక్టివ్​గా పనిచేసి.. ఆ తరువాత బీఆర్ఎస్, ఇతర పార్టీల్లో జాయిన్ అయినవాళ్లందరినీ కాంగ్రెస్​లోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకున్న పరిచయాలతో ఈ ప్రయత్నాలు ఇప్పటికే వేగవంతం చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు నాయుడు సర్కిల్​ను కూడా వాడుకుంటున్నారని తెలిసింది. 

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన తరువాత ఎవరెవరు అసంతృప్తులు ఉన్నారో తెలుసుకొని, వాళ్లని పార్టీలోకి లాగేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్లు వేసి అమలు చేస్తోంది.  బీఆర్ఎస్​లో ప్రాధాన్యం ఉండి.. టికెట్ దక్కని వాళ్లను పార్టీలో చేర్చుకోవడంతో పాటు.. టీడీపీ క్యాడర్​ను తమవైపునకు తిప్పుకుంటే ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ  సీఎం కేసీఆర్ టికెట్లు ఇవ్వడానికి కారణం కూడా వారు కాంగ్రెస్ వైపు వెళ్లకూడదనే ఆలోచనలో భాగమేనని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. 

లైన్లోకి తుమ్మల, సీతా దయాకర్ రెడ్డి

టీడీపీ మహిళా నేత, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డిని పార్టీలోకి రావాలని కాంగ్రెస్‌ ఆహ్వానించింది. పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు ఆమె నివాసానికి వెళ్లి  పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత వాళ్లు పీసీసీ చీఫ్​తో భేటీ అయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు రాజకీయాల్లో సుపరిచితుడు. టీడీపీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరి సుదీర్ఘకాలం పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్​లో చేరి 2016లో పాలేరు ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో అదే సెగ్మెంట్ ​నుంచి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో తుమ్మలను కూడా కాంగ్రెస్​లోకి తీసుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఆయన కూడా కాంగ్రెస్​లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి మరో సీనియర్​ నేత మండవ వెంకటేశ్వరరావును కూడా పార్టీలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అధికార పార్టీలోని అసంతృప్తులతోనూ చర్చలు

ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న గ్రేటర్​ హైదరాబాద్​కు చెందిన పాత టీడీపీ లీడర్లను కూడా కాంగ్రెస్​ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ప్రకటించిన సీట్లలో సిట్టింగులందరికీ టికెట్​ఇచ్చారు. దీంతో టీడీపీ నుంచి బీఆర్​ఎస్​లోకి వెళ్లి టికెట్లు ఆశించిన కొందరు లీడర్లు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. వాళ్లతో కూడా కాంగ్రెస్​ నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిసింది. 

ముషీరాబాద్​ నుంచి ఎంఎన్​ శ్రీనివాస్​, సనత్​ నగర్ నుంచి టికెట్​ఆశించిన కూన వెంకటేశం గౌడ్​తో పాటు కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్​ టచ్​ చేసింది. మైనంపల్లి హన్మంత్​ రావు కూడా బీఆర్​ఎస్​నుంచి బయటకు వస్తే.. కాంగ్రెస్​లోకి ఆహ్వానించేందుకు రెడీగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇలా  ద్వితీయ శ్రేణిలో బ‌లంగా ఉన్న టీడీపీ నాయ‌కులు ఎవరెవరైతే బీఆర్​ఎస్​లోకి వెళ్లారో వాళ్లందరినీ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్​ లో కలిపేసుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.  దీంతో ఆ లీడర్ల విషయంలో బీఆర్ఎస్ లో  టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.