ఇయ్యాల్టి నుంచి గ్రామసభల్లో అభయహస్తం అప్లికేషన్లు

ఇయ్యాల్టి నుంచి గ్రామసభల్లో అభయహస్తం అప్లికేషన్లు
  • ఆ తర్వాత కూడా ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో ఇవ్వొచ్చు 
  • రేషన్ కార్డు తప్పనిసరి.. అది లేకున్నా అప్లై చేసుకోవచ్చు
  • రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంటం
  • వచ్చే ఏడాది డిసెంబర్​లోగా 2 లక్షల ఉద్యోగాలిస్తం
  • మేడిగడ్డపై విచారణ జరుగుతున్నదని వెల్లడి
  • ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్, అప్లికేషన్ ఫారమ్ విడుదల

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉండి ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డు గోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు. అందుకు ప్రజావాణిలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే ఉదాహరణ. గతంలో గడీల మధ్యనే పాలన నడిచింది. మేం ఇప్పుడు ఆ గడీల గోడలు దాటి ప్రజల వద్దకు వెళ్తున్నాం. నిస్సహాయులకు సహాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. తండాలు, గూడేలలో ఉన్న నిరుపేదలకు పథకాలు అందించేందుకు ప్రజా పాలన గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నం” అని తెలిపారు. 

హైదరాబాద్ లోని సెక్రటేరియెట్, ప్రజాభవన్ కు ప్రజలు రావాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రజా పాలన సభలతో ప్రజలకు తమ ప్రభుత్వంపై మరింత విశ్వాసం కలుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సెక్రటేరియెట్ లో ‘ప్రజాపాలన అభయహస్తం’ ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారమ్​ను డిప్యూటీ సీఎం, మంత్రులతో కలిసి రేవంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ‘‘ఈ నెల 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌వార్డుల్లో ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటం. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేనివాళ్లు జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లోనూ అందజేయవచ్చు. ఆ తర్వాత కూడా ఎమ్మార్వో, ఎంపీడీఓ ఆఫీసుల్లో అభయహస్తం అప్లికేషన్లు తీసుకుంటారు” అని తెలిపారు. 

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ.. 

రేషన్‌ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రేషన్ కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వాళ్లను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ‘‘గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్లు ఇవ్వొచ్చు. త్వరలోనే రేషన్‌ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ” అని చెప్పారు. రైతుబంధుకు సీలింగ్ పెట్టడంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇకా ఆరో గ్యారంటీ అయిన యువ వికాసం పథకం అప్లికేషన్లు వచ్చే అకడమిక్ ఇయర్ లో కాలేజీల్లో తీసుకుంటామని వెల్లడించారు. ‘‘ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు. గ్రూప్- 2 నిర్వహణలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటం. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. కమిషన్ చైర్మన్, కొందరు సభ్యులు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వీటిపై నాలుగైదు రోజుల్లో గవర్నర్​ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం” అని తెలిపారు.  

కేటీఆర్ దోచుకున్న లక్ష కోట్లు కక్కిస్తం.. 

కేటీఆర్ దోచుకున్న రూ.లక్ష కోట్లు కక్కిస్తామని రేవంత్ అన్నారు. ‘‘ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు ఆయన రూ. లక్ష సాయం అందించారు. ఈ లెక్కన ప్రజావాణి పని చేస్తున్నట్లే. అధికారంలో ఉండగా కేటీఆర్‌ దోచుకున్న లక్ష కోట్లలో లక్ష రూపాయలు కక్కించాం. అందుకు సంతోషంగా ఉంది. ఆయన దగ్గర నుంచి మిగిలిన మొత్తాన్ని కూడా కక్కించి పేదలకు పంచాల్సి ఉన్నది. ఆ పరిస్థితులు కూడా వస్తాయి”  అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.

లంకె బిందెలు అనుకుంటే.. ఖాళీ బిందెలె 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని, దాన్ని సెట్ రైట్ చేయాల్సి ఉందని రేవంత్ అన్నారు. తాము లంకె బిందెలు అనుకుని వస్తే, అన్ని ఖాళీ బిందెలె కనిపిస్తున్నాయని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ రూ.6.71లక్షల కోట్లు అప్పులు చేసింది. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లింది. గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తున్నాం. అందుకే కేంద్రం దగ్గరకు వెళ్లాం. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరాం” అని తెలిపారు. పదేండ్ల పాటు కేటీఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని మండిపడ్డారు. ప్రజల రక్తమాంసాలతో రూ.లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. ‘‘ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు. అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా బావాబామ్మర్దులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదు. అందుకే బయట చెబుతున్నారు” అని విమర్శించారు. 

మేడిగడ్డపై విచారణ జరుగుతున్నది.. 

బీఆర్ఎస్ హయాంలో డిసెంబర్ 20 నుంచి మార్చి 30 వరకు విడతల వారీగా రైతుబంధు డబ్బులు జమ చేస్తూ వచ్చారని.. మరి ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు పథకం డబ్బులు జమవుతాయని స్పష్టం చేశారు. గతేడాది డిసెంబర్ 28న రైతుబంధు జమ మొదలుపెడితే.. ఈసారి డిసెంబర్ 20 నుంచే జమ చేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతుబంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విధించలేదని.. సీలింగ్ పై  అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి న్యాయ విచారణ జరుగుతోందని.. విచారణ తర్వాత ఎల్‌అండ్‌ టీ ప్రతినిధులు, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందన్నారు. ‘‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించాం. వాళ్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటాం. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోగపడతాయి” అని అన్నారు. ‘‘గతంలో సెక్రటేరియెట్ లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా? ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుంది. మంత్రులు ఏవైనా వివరాలు చెప్పాలంటే ఇక్కడే చెబుతారు” అని పేర్కొన్నారు.