ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చూసీచూడనట్టు రాష్ట్ర సర్కారు

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చూసీచూడనట్టు రాష్ట్ర సర్కారు
  • 70 శాతం నీళ్లు వాడుకుంటున్న ఏపీ
  • శ్రీశైలం కరెంట్‌‌ ఉత్పత్తిపై మరోసారి కేంద్రానికి జగన్‌‌ కంప్లైంట్‌‌
  • దీన్నే బూచిగా చూపి సంగమేశ్వరానికి పర్మిషన్‌‌లు ఇవ్వాలని వినతి

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నీళ్లన్నీ మళ్లించుకుంటూనే తెలంగాణపై ఏపీ అక్కసు వెళ్లగక్కుతోంది. 70 శాతం, అంతకన్నా ఎక్కువ నీటిని ఏటా తరలించుకుపోతూనే తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తి, ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లలో కరెంట్‌‌ ఉత్పత్తిపై ఏపీ సీఎం జగన్‌‌ మరోసారి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌‌కు తెలంగాణ ప్రాజెక్టులు, కరెంట్‌‌ ఉత్పత్తిపై తప్పుడు సమాచారంతో కంప్లైంట్‌‌ చేశారు. శ్రీశైలంలో తెలంగాణ కరెంట్‌‌ ఉత్పత్తిని బూచీగా చూపించి తమ అక్ర మ ప్రాజెక్టు సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీంకు దొడ్డిదారిన పర్మిషన్‌‌లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనే కాదు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా నీటి వినియోగంలో మన పరిస్థితి ఇసుమంతైనా మెరుగుపడలేదు. మనకు 34% కోటా ఉన్నా ఏ ఒక్క సంవత్సరం కూడా 30%  నీళ్లనూ వినియోగించుకోలేదు. ఏపీ కేటాయింపులకు మించి నీళ్లను తరలించుకుపోతుంది. శ్రీశైలం కరెంటు ఉత్పత్తిపై లేని రూల్స్ ను పేర్కొంటూ జగన్‌‌.. కేంద్ర మంత్రికి తెలంగాణపై ఫిర్యాదు చేశారు. శ్రీశైలంలో 834 అడుగులకు దిగువన కరెంట్‌‌ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పిన ఏపీ సీఎం తమ ప్రాంత అవసరాల కోసం 790 అడుగుల లెవల్‌‌లోనూ కరెంట్‌‌ ఉత్పత్తి చేసిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని, కరువు పీడిత రాయలసీమకు సాగు, తాగునీటి అవసరాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, చెన్నై నగరాని కి తాగునీటిని అందించడం సాధ్యం కాదని తెలి పారు. 854 అడుగుల నీటి మట్టం ఉన్నా 14 వెం ట్‌‌ల నుంచి 7టీఎంసీలు తరలించే చాన్స్​ ఉందనే విషయాన్ని బహిర్గతం చేయడం లేదు. శ్రీశైలం నుంచి ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీ ద్వారా హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి నీటిని లిఫ్ట్‌‌ చేసే అవకాశముంది. ఈ నిజాన్ని తొక్కిపెట్టి శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోసేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని, తెలంగాణ అనుసరిస్తున్న అనుచిత వైఖరితో తాము వేగంగా రాయలసీమ ఎత్తిపోతలు నిర్మించుకోవడం మినహా మరో మార్గం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పర్మిషన్‌‌ల కోసం లాబీయింగ్‌‌

సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీంను ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టి ఎర్త్‌‌ వర్క్‌‌ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుమతుల కోసం లాబీయింగ్‌‌ చేస్తోంది. అక్రమంగా అనుమతులు పొందేందుకు తెలంగాణ ప్రాజెక్టులనే బూచీగా చూపిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టు అని చెప్తూ.. మన కరెంట్‌‌ ఉత్పత్తి కూడా అక్రమమని పేర్కొంటూ తమ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. కుట్రపూరితంగా నిర్మిస్తోన్న సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం పనులపై మన సర్కారు మొదట్లో నోరే మెదపలేదు. ‘వీ6 వెలుగు’ ఈ అక్రమ ప్రాజెక్టు బండారం బయట పెట్టడం, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చివరకు అని వార్య పరిస్థితుల్లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

నీళ్లల్లో అధిక భాగం ఏపీకే..

కృష్ణా నీళ్లల్లో అధికం ఏపీనే తరలించుకుపోతుంది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నీళ్లల్లో ఏపీకి 63 శాతం, తెలంగాణ 37 శాతం నీళ్లు పంచుకునేలా కేంద్రం వద్ద ఒప్పందం చేసుకున్నారు. రెండు రాష్ట్రాలు కృష్ణా నీళ్లను సమర్థంగా ఉపయోగించుకునేందుకు ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లో భాగంగా కృష్ణా, గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డులు ఏర్పాటు చేశారు. మొదటి మూడేళ్లు 63 : 37 నిష్పత్తిలో నీటి వినియోగం చేసుకోలేకపోయారు. ఏపీ 70 శాతానికి పైగా నీళ్లు తరలించుకుపోతుంటే తెలంగాణ కేటాయింపుల కన్నా తక్కువ నీటిని తీసుకుంటోందని, తద్వారా కేఆర్‌‌ఎంబీ ఏర్పాటు స్ఫూర్తి దెబ్బతింటోందని చెప్తూ నీటి వాటాలు 66 : 34 నిష్పత్తికి సవరించారు. 3 శాతం నీటి వాటా కోల్పోవడానికి తెలంగాణ అంగీకారం తెలిపింది. అయినా ఏ ఒక్క ఏడాది కూడా 30 శాతం నీటిని వినియోగించుకోవడం లేదు. నీటి వినియోగాన్ని పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కనీసం ప్రయత్నించడం లేదు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ఎస్‌‌ఎల్బీసీని పూర్తిగా పక్కన పెట్టింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కృష్ణా నీళ్లన్నీ ఏపీ వైపే పరుగులు పెడుతున్నాయి. అయినా ఏపీ ప్రభుత్వం తెలంగాణపై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది.