కాకతీయ నృత్యకళ: ‘పేరిణి’ మళ్లీ గజ్జె కట్టింది

కాకతీయ నృత్యకళ: ‘పేరిణి’ మళ్లీ గజ్జె కట్టింది

కాకతీయ నృత్య కళ ‘పేరిణి’ గడపగడపకూ చేరుతోంది. వందల ఏళ్లపాటు మరుగునపడిన ఈకళ నలభై ఏళ్ల క్రితం తిరిగి జీవం పోసుకుంది. ఒకప్పుడు మగవాళ్లకు మాత్రమే పరిమితమైన ఈనృత్యాన్ని కొన్నేళ్లుగా ఆడవాళ్లు కూడా నేర్చుకుంటున్నారు. ఈ నృత్యాన్ని ఆసక్తి ఉన్నవాళ్లందరికీ నేర్పేందుకు శిక్షణ ఇస్తున్నారు. అందుకు పేరిణి పుట్టినిల్లయిన ఓరుగల్లు వేదికగా మారింది.

వరంగల్‍, వెలుగు: పేరిణి నృత్యంలో పూర్తి స్థాయిలో ప్రావీణ్యం సాధించాలంటే కనీసం ఐదేళ్ల పాటు సాధనచేయాలి. అందుకే నేర్చుకునేందుకు చాలాతక్కువ మంది ముందుకొస్తారు. ఈ కారణంవల్లే పేరిణిని ఎక్కువ మందికి పరిచయంచేసేందుకు ‘నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ’ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటుచేసింది. వరంగల్ లో పేరిణి నృత్య పరిచయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముప్పై నుంచి నలభై రోజుల్లో ఈ నృత్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు, కీలకమైన నృత్యభంగిమలు నేర్పుతున్నారు. పేరిణిపై ఆసక్తికలిగిన వాళ్లు పూర్తి స్థాయిలో ఈ నృత్యాన్నినేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడాఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.

కాకతీయుల నాటి నృత్యం
శివుడిని ఆరాధిస్తూ చేసే నృత్యం పేరిణి.సాధారణ నాట్య కళలు లాలిత్యంగా,సుకుమారంగా ప్రేమను ఒలకబోసినట్టు గా ఉంటాయి. పేరిణి నృత్యంలో అందుకుభిన్నంగా రౌద్ర, వీర రసాలు ప్రధానంగా ఉంటాయి. కాకతీయుల కాలంలో యుద్ధానికిముందు సైనికుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఈనృత్యాన్ని ప్రదర్శించేవాళ్లు. కాకతీయ సేనా ని‘జాయప’ రాసిన ‘నృత్తరత్నావళీ’ గ్రంథంలోపేరిణి నృత్య రీతుల గురించి వివరించాడు. కాకతీయుల కాలంలో ఇంతటి పేరు గాంచిన‘పేరిణి’ తర్వాత కాలంలో కనుమరగయ్యే స్థితికివచ్చింది. కాకతీయుల తర్వాతి పాలకులు పేరిణిని ఆదరించలేదు. కానీ.. డెబ్భైవదశకంలో నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యాన్నితిరిగి వెలుగులోకి తీసుకొచ్చారు. రామప్పఆలయంలో ఉన్న పేరిణి నృత్య భంగిమల ఆధారంగా తిరిగి ఈ నృత్యానికి జీవం పోశారు.అప్పటినుంచి నటరాజ రామకృష్ణ శిష్యపరంపర ఈ నృత్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

తెలంగాణలో
తెలంగాణ వచ్చిన తర్వాత పేరిణికి మంచిరోజులు వచ్చాయి. ఈ కళను మరింత మందికి చేరువ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ సంగీత, నృత్య కాలేజీల్లో 2016 నుంచి పేరిణి డిప్లొమో కోర్సుగా అందుబాటులోకి వచ్చింది.తర్వాత ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా పేరిణి నృత్యాన్ని ఆర్స్ట్ కోర్సుగా ప్రవేశపెట్టేప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా పేరిణికి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వరంగల్ లో వేసవిశిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు.