తెలంగాణ అప్పులు.. ఏటా కిస్తీలు, వడ్డీలకే 62 వేల కోట్లు!

తెలంగాణ అప్పులు..  ఏటా కిస్తీలు, వడ్డీలకే 62 వేల కోట్లు!

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీల భారం రూ. 62 వేల కోట్లు ఉందని తేలింది. కొత్త ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024 – -25) బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఏకంగా రూ.62 వేల కోట్ల మేర కిస్తీలకు, వడ్డీలకు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇందులో వడ్డీలే సగం అంటే రూ.32,502 కోట్లు ఉన్నాయి. బడ్జెట్​లో మెజార్టీ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై అంచనాలు వేసుకోగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో పాటు కిస్తీలు, వడ్డీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఈ రెండు కలిపితే ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు చేరుతున్నది. అంటే బడ్జెట్​లో సింహభాగం వీటికే కేటాయించాల్సి వస్తోంది.

తీసుకున్న అప్పులకు క్రమం తప్పకుండా కిస్తీలు, వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. అలా కడితేనే భవిష్యత్ అప్పులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో వీటి చెల్లింపులకు కచ్చితంగా కేటాయింపులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో బడ్జెట్​లో చూపేవి ఎంత? బడ్జెట్ వెలుపల కట్టాల్సింది ఎంత? అనేదానిపై అధికారులు లెక్కలు కడుతున్నారు. వడ్డీల విషయానికొస్తే ఈ ఆర్థిక సంవత్సరం రూ.22 వేల 407 కోట్లు కట్టనున్నట్లు అంచనా వేశారు. ఇందులో నవంబర్ నాటికి రూ.14 వేల కోట్లు కట్టారు. మిగతా మొత్తం మార్చి ఆఖరు నాటికి చెల్లిస్తారు. ఇక కిస్తీల కింద రూ.12,606 కోట్లు కడుతున్నారు. ఇదంతా బడ్జెట్​లో పెట్టుకున్న దాంట్లో నుంచి చెల్లించారు. ఇవి కాకుండా బడ్జెటేతర కిస్తీలు, వడ్డీల కింద రూ.25,058 అదనంగా రాష్ట్ర ఖజానా నుంచే కడుతున్నారు. ఇదే పద్ధతిలో రూ.2024–25లో రూ.62,718 కోట్లు కట్టాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. ఇందులో బడ్జెట్ నుంచి రూ.38,245 కోట్లు, బడ్జెటేతర దాని నుంచి రూ.24,473 కోట్లు ఆర్​బీఐ, ఇతర ఆర్థిక సంస్థలకు కట్టాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

పెరుగుతున్న భారం

అప్పులు తీసుకోవడం, వాటికి వడ్డీలు చెల్లించడంలో గత మూడేండ్లుగా ప్రభుత్వం దూసుకుపోతున్నది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వడ్డీ కట్టింది. సరిగ్గా తొమ్మిదేండ్లలో ఇది ఏడింతలకు చేరువైంది. ప్రతి నెలా.. ప్రతి ఏడాది ఇలా కిస్తీలు, వడ్డీలు అంతకంతకు పెరుగుకుంటూ పోతున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న అప్పులతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడానికి కూడా అప్పులే కారణమని అంటున్నారు. 2015–16లో రూ.10,941 వేల కోట్లు కిస్తీలకు, వడ్డీలకు కడితే.. అదే 2023–24 నాటికి అది రూ.60 వేల కోట్లు దాటింది.

నవంబర్ నాటికి రాబడులు రూ.1.49 లక్షల కోట్లు

నవంబర్ చివరి నాటికి రాష్ట్రానికి అన్ని రకాలుగా వచ్చిన ఆదాయం రూ.1.49 లక్షల కోట్లు. అంచనాల ప్రకారం డిసెంబర్​తో కలిపి వచ్చే మార్చి చివరి నాటికి రూ.2.16 లక్షల కోట్లు రావాలి. ఈ మేరకు కాగ్ తన రిపోర్ట్​లో వెల్లడించింది. ఇందులో పన్ను ఆదాయం రూ.87,083 కోట్లుగా ఉన్నది. పన్ను రాబడిలో జీఎస్టీ ఆదాయం రూ.30,047 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూ.9354 కోట్లు, కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ.8177 కోట్లు, ఇతర టాక్స్​లు రూ.5304 కోట్లు వచ్చింది. నాన్ టాక్స్ రెవెన్యూ 19,524  కోట్లు వచ్చింది. గ్రాంట్ ఇన్​ ఎయిడ్ కంట్రిబ్యూషన్ కింద రూ.4532  కోట్లు వచ్చింది. ఇక అప్పులను గత ప్రభుత్వం నవంబర్​ నాటికే పూర్తిగా తీసుకున్నట్లు కాగ్​ స్పష్టం చేసింది. ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన రూ.38,175 కోట్ల అప్పు పూర్తయింది.