సర్వేలులోని గురుకులం నా జీవితాన్ని మలుపుతిప్పింది

సర్వేలులోని గురుకులం నా జీవితాన్ని మలుపుతిప్పింది

సంస్థాన్ నారాయణపురం వెలుగు : తన జీవితాన్ని మలుపు తిప్పింది సర్వేలు గురుకుల పాఠశాలనేనని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి అన్నారు. తన జీవితంలో జరిగిన ప్రతి మంచి సర్వేలు గురుకుల పాఠశాల పుణ్యమేనని గుర్తు చేశారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. మహేందర్​రెడ్డి చీఫ్ ​గెస్ట్​గా హాజరై.. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన అంగన్​వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పీవీ నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో మూడు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. తాను ఏడో తరగతి వరకు ఖమ్మం జిల్లా కూసుమంచిలో చదివానని, తర్వాత సర్వేలు గురుకుల స్కూల్​లో సీటు సంపాదించానన్నారు. తనతోపాటు తన ఊరిలో చదువుకున్న స్నేహితులంతా వ్యవసాయం చేసుకుంటున్నారని, సర్వేలు గురుకుల పాఠశాలలో సీటు పొంది ఉండకపోతే తాను కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడినన్నారు. ఈ నెలలోనే తన రిటైర్మెంట్ ఉన్నదని అంతకు ముందు ఈ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో సమయం గడపాలనే తన కోరిక తీరిందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్​భగవత్, భువనగిరి డీసీపీ కె నారాయణ రెడ్డి, షీ టీం డీసీపీ సలీమా, వడ్లమాని సతీశ్, దివీస్​మేనేజర్ సుధాకర్, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి పాల్గొన్నారు.