కాంగ్రెస్​ టార్గెట్..75 సీట్లు!

కాంగ్రెస్​ టార్గెట్..75 సీట్లు!
  • ఆయా సెగ్మెంట్లపై స్పెషల్​ ఫోకస్​
  • జాతీయ స్థాయి నేతలతో కార్యక్రమాలకు ప్రణాళిక
  • పక్కా గెలిచే సీట్లపై రిపోర్టు 
  • ఇచ్చిన సునీల్​ కనుగోలు
  • యాక్షన్​ ప్లాన్​ రెడీ 
  • చేసుకుంటున్న లీడర్లు
  • ఈ నెలాఖరు లేదా అక్టోబర్​ మొదటివారంలో ఫస్ట్ లిస్టు!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 75 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఆయా సెగ్మెంట్లలో ప్రత్యేక కార్యక్రమాల అమలుకు ప్లాన్​ చేస్తున్నది. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎట్ల ఉంది? పక్కాగా గెలిచే చాన్స్​ ఉన్న సెగ్మెంట్లు ఏమిటి?.. అనే దానిపై స్ట్రాటజిస్ట్​ సునీల్​ కనుగోలు ఓ రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.

ఆ రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్​ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నది. మరోవైపు ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటివారంలో అభ్యర్థుల ఫస్ట్​ లిస్టును రిలీజ్​ చేసే అవకాశాలున్నాయి. 119 సీట్లకు గాను 80 సీట్లలో అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో స్క్రీనింగ్  కమిటీ కసరత్తు పూర్తయింది. ఫస్ట్​ లిస్టులో వారందరి పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

ఆ ఉమ్మడి జిల్లాల్లో స్వీప్​ చేస్తామని ధీమా

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని నియోజకవర్గాలను కాంగ్రెస్​ పార్టీ దాదాపు స్వీప్​ చేస్తుందని సునీల్​ కనుగోలు రిపోర్ట్​ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు చేరికతో పార్టీ పతార బాగా పెరిగిందని, ఆ జిల్లాలోని రెడ్డి, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్​ పార్టీకి పోలవుతాయని లీడర్లు భావిస్తున్నారు. పోయినసారి ఖమ్మం జిల్లాలో బీఆర్​ఎస్​ పార్టీకి ఆ ఇద్దరు నేతల ఫాలోయింగ్​ కలిసి వచ్చిందని, ఇప్పుడు వాళ్లిద్దరూ తమ పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​ నేతలు చెప్తున్నారు.

ఇక, భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలంతోపాటు సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని రిపోర్టులో సునీల్​ కనుగోలు పేర్కొన్నట్లు నేతలు అంటున్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్​, నల్గొండ, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ, కోదాడ, హుజూర్​నగర్​, భువనగిరి, నకిరేకల్​, ఆలేరు, సూర్యాపేట, తుంగతుర్తిలోనూ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారని చెప్తున్నారు. ఈసారి నాగార్జునసాగర్​లో జానారెడ్డి కొడుకు జైవీర్​రెడ్డికి టికెట్​ఇస్తున్న నేపథ్యంలో.. జానారెడ్డికే టికెట్​ ఇస్తే బాగుంటుందని కనుగోలు తన రిపోర్ట్​లో సూచించినట్టు తెలిసింది. దీనికి తోడు హైకమాండ్​ ఆదేశిస్తే తాను పోటీ చేసేందుకు సిద్ధమని జానారెడ్డి చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్​ టికెట్​ తండ్రీ కొడుకుల్లో ఎవరికిస్తారన్న ఆసక్తి నెలకొంది. 

ఉత్తర తెలంగాణలోని సెగ్మెంట్లపైనా రిపోర్టు!

ఉత్తర తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్​ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సునీల్​ కనుగోలు తన రిపోర్టులో పేర్కొన్నట్లు   తెలిసింది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్​, ధర్మపురి, రామగుండం, సంగారెడ్డి, ఆందోల్​, నారాయణ్​ఖేడ్​, పటాన్​చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీకి మంచి పట్టు ఉందని రిపోర్టులో వివరించినట్లు సమాచారం. వాటితో పాటు ములుగు, వరంగల్​ ఈస్ట్​, హనుమకొండ (వరంగల్​వెస్ట్​), భూపాలపల్లి వంటి నియోజకవర్గాల్లోనూ పాజిటివ్​ టాక్​ ఉందని లీడర్లు భావిస్తున్నారు.  

ఇక, ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కొడంగల్​, ఆలంపూర్​, షాద్​నగర్​లోనూ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయని వారు అంటున్నారు. కాగా, హైదరాబాద్​ సిటీలోని నియోజకవర్గాల్లో పార్టీ వీక్​గా ఉందని స్క్రీనింగ్​ కమిటీకి సునీల్​ కనుగోలు తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది.

ప్రత్యేక కార్యక్రమాలు

గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నేతలతో తరచూ ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్​ భావిస్తున్నది. అందులో భాగంగానే షాద్​నగర్​లో వచ్చే నెల 10న బీసీ గర్జనను నిర్వహించాలని యోచిస్తున్నది. ఆ సభకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను  ఆహ్వానించనున్నారు. మరోవైపు మహిళా గర్జన సభనూ నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్​ పెద్దలున్నారు. ఆ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలనుకుంటున్నారు. అంతేకాకుండా రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలతోనూ వీలైనన్ని ఎక్కువసార్లు రాష్ట్రంలో సభలు నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు టాక్. 

ముదిరిన ఎల్బీ నగర్​ పంచాది

ఎల్బీనగర్​ పంచాది ముదిరింది. మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్​లో పోస్టర్లు వెలిసిన వివాదం మరువకముందే.. ఇప్పుడు మరో వివాదం రాజుకుంది. పోస్టర్ల వివాదాన్ని అటూ ఇటూ తిప్పి ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి వర్గంపైకి అప్పట్లో నెట్టేశారు. కానీ, ఇప్పుడు ఏకంగా మధుయాష్కీపై ఎల్బీ నగర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ నేతలు హైకమాండ్​కు ఫిర్యాదు చేశారు. స్క్రీనింగ్​ కమిటీలో సభ్యుడు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ అయిన ఆయనపై ఎల్బీనగర్​ ఆశావహులు జక్కడి ప్రభాకర్​ రెడ్డి, మల్​రెడ్డి రాంరెడ్డి, దర్పల్లి రాజశేఖర్​రెడ్డి గురువారం ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి మధుయాష్కీకి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఆయనకు టికెట్​ ఇస్తే సహకరించేది లేదని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో.. గాంధీభవన్​లో మధుయాష్కీకి వ్యతిరేకంగా పోస్టర్లను పార్టీలోని వాళ్లే వేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటి పార్టీ నేతలొచ్చి పార్టీ ఆఫీసులో ఎట్ల పోస్టర్లు వేస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధుయాష్కీకి వ్యతిరేకంగా ప్రచారం జరగడాన్ని పలువురు నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది బీసీ నేతల మీద దాడేనని, బీసీ నేతలను గెలిపించడం ఇష్టం లేకనే ఇట్ల ఫిర్యాదులు చేస్తున్నారన్న మండిపడుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూ కూడా ఢిల్లీ వరకు చేరింది. అక్కడ బీసీ నేత వర్సెస్​ వెలమ అన్నట్టుగా పరిస్థితి మారింది.