నీ లెక్క.. గుట్టలు మాయం చేశానా?, భూకబ్జాలు చేశానా?: బండి సంజయ్ ఫైర్

నీ లెక్క..  గుట్టలు మాయం చేశానా?, భూకబ్జాలు చేశానా?: బండి సంజయ్ ఫైర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గంగుల.. నీ లెక్క గుట్టలు మాయం చేశానా?. భూకబ్జాలు చేశానా?.. పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా? అని ఫైర్ అయ్యారు. 

తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగులనేనని దయ్యబట్టారు. అవినీతిలో కరీంనగర్ టాప్ అని నిఘా నివేదికలే చెబుతున్నా.. సోయి లేదా? అని మండిపడ్డారు. అందుకే గంగులను కరీంనగర్ కే పరిమితం చేసి..  బీఫాం ఇవ్వకుండా సతాయించింది నిజం కాదా? అని అన్నారు. తాను అధికారంలోనే లేనని.. నిరంతరం పోరాటాలే చేశానన్నారు బండి సంజయ్. అధికారంలో లేని తాను  ఎట్లా అవినీతికి పాల్పడతా?...సోయిండే మాట్లాడుతున్నవా? అంటూ మండిపడ్డారు.

తాను అవినీతిపరుడినైతే.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఎట్లా ఇచ్చి గౌరవిస్తారు? అని అన్నారు. హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయిస్తున్న సంగతి తెల్వదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు  కరీంనగర్ ప్రజలకు గంగుల ఒరగబెట్టిందేమిటి? అని,  రేషన్ కార్డులు ఇచ్చే అధికారం ఉన్నా.. ఎందుకివ్వలేదు? అని,  వడ్ల కొనుగోలులో అక్రమాలను ఎందుకు ఆపలేదు? అని ప్రశ్నించారు. బీసీ మంత్రి అయిన గంగుల.. ఎంతమంది బీసీలకు సాయం చేశారని?.. తనకు అధ్యక్ష పదవిస్తే.. నిరంతరం ప్రజల కోసం పోరాడానన్నారు. ఫాం హౌజ్ నుండి సీఎంను ధర్నా చౌక్ కు గుంజుకొచ్చానని.. జనం కోసం ఒక్కరోజైనా పోరాడి జైలుకు పోయానని సంజయ్ అన్నారు.