అలంపూర్ బీఆర్ఎస్ లో ముసలం..! ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే

అలంపూర్ బీఆర్ఎస్ లో ముసలం..! ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే
  • అబ్రహంకు టికెట్ క్యాన్సిల్ చేయాలని ఒత్తిడి
  •  ఎమ్మెల్యేకు  వ్యతిరేకంగా, అనుకూలంగా నిరసనలు

గద్వాల, వెలుగు:  అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో ముసలం రాజుకుంటుంది. బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే అబ్రహంకు టిక్కెట్ కన్ఫామ్ చేయడంతో  అసమ్మతి రచ్చకెక్కుతోంది. టికెట్ కోసం ఐదుగురు ప్రయత్నాలు చేశారు. కానీ  అధిష్టానం  సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం వైపే మొగ్గు చూపింది. దీంతో అసంతృప్తుతో ఉన్నా నాయకులు నిరసనలు, ర్యాలీలు, మీటింగులు నిర్వహిస్తున్నారు. మరోవైపు హైకమాండ్​ నిర్ణయానికి అందరూ కట్టుబడాలని ఎమ్మెల్యే వర్గం చెప్తోంది.  

 ఎమ్మెల్సీ చల్లా అనుచరులుగా చెప్పుకునే ఐజ జడ్పీటీసీ పుష్పమ్మ భర్త నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం ఐజ లో సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు మీటింగ్ నిర్వహించి ఎమ్మెల్యే అబ్రహంను మార్చకపోతే పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఇటిక్యాల మండలంలో   బీఆర్ఎస్ లీడర్ కిషోర్ ర్యాలీ నిర్వహించారు. మానవపాడు, వడ్డేపల్లి మండలాల బీఆర్ఎస్ లీడర్లు క్యాండిడేట్​ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.  ఐజ టౌన్ లోని కొందరు కౌన్సిలర్లు అబ్రహం అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ మీటింగ్ నిర్వహించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రెండు వర్గాలు రచ్చకెక్కుతున్నాయి.

కథ అడ్డం తిరిగింది ఇక్కడే..?

ఆలంపూరు బీఆర్ఎస్  టికెట్ కోసం మాజీ ఎంపీటీసీ విజయ్ పేరును ఎమ్మెల్సీ సూచించారని పార్టీలో చర్చ జరుగుతున్నది.హైకమాండ్ చేసిన  సర్వేలో విజయ్​ కు సానుకూలత వ్యక్తం కాకపోవడంతో సిట్టింగ్​ ఎమ్మెల్యేనే ఖరారు చేశారు. ఎమ్మెల్యే స్థాయి లేని నేతను ఎమ్మెల్యే చల్లా సూచించడం ఏంటని జిల్లా మంత్రులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

పంతం నెగ్గించుకునేందుకు నిరసనలు

ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ తమ వర్గానికే కేటాయించుకుని పంతం నెగ్గించుకునేందుకు ఎమ్మెల్సీ వర్గం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా ఒక్కో రోజు ఒక మండలం నుంచి ఎమ్మెల్యే  అబ్రహంకు  వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. మొదటి రోజు ఐజ మండలానికి చెందిన జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఇతర ముఖ్య బీఆర్ఎస్ లీడర్లు రహస్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఒకవేళ ఆయనని కంటిన్యూ చేస్తే పార్టీకి పనిచేసే ముచ్చటే లేదని తెగేసి చెబుతున్నారు.

తెరపైకి మాజీ ఎంపీపీ పేరు

మాజీ ఎంపీటీసీ విజయ్ పేరుపై విమర్శలు రావడంతో వెంటనే మాజీ ఎంపీపీని ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా వర్గం ముందుకు  తెచ్చినట్లు తెలుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో  టికెట్ తీసుకొచ్చి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకుని బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి గట్టిగా ప్రయత్నం చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు.

హామీ మేరకు టికెట్ ఇవ్వాలి

కాంగ్రెస్ లో ఉన్న చల్ల వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు తాను సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే షరతులు పెట్టారని ఆయన వర్గం వాదిస్తోంది. ఇప్పుడు చల్లా చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం పట్టుబడుతున్నది. లేకపోతే ఎమ్మెల్యే అబ్రహం కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని  చెబుతున్నారు. చల్ల  సూచించిన వ్యక్తికే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అబ్రాహంకు అనుకోకుండా టికెట్ వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.