కాంగ్రెస్లో 80 సీట్లపై క్లారిటీ.. మహేశ్వరం..ఇబ్రహీంపట్నం నుంచి కొత్తవారికి ఛాన్స్

కాంగ్రెస్లో 80 సీట్లపై క్లారిటీ.. మహేశ్వరం..ఇబ్రహీంపట్నం నుంచి కొత్తవారికి ఛాన్స్

న్యూఢిల్లీ, వెలుగు:రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను సుమారు 80 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదిరింది. గత మూడు రోజులుగా ఢిల్లీలో సుమా రు 13 గంటలు విస్తృతంగా చర్చించిన కమిటీ వివాదాలు లేని సీట్లపై క్లారిటీకి వచ్చింది. సిట్టింగ్ లు, ఒక్కరే పోటీపడుతున్న సీట్లతోపాటు ఇద్దరు బరిలో ఉన్న చాలా స్థానాల్లో వడపోతను పూర్తి చేసి.. నియోజక వర్గాల వారీగా లిస్ట్ ను రూపొందించింది. ముఖ్యంగా సర్వేలు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల వడపోత చేసినట్లు నేతలు చెప్తున్నారు. అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేసి కాంగ్రెస్ హైకమాండ్​కు కమిటీ పంపినట్లు తెలిసింది. దీంతో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటివారంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది. 

మూడోసారి ఐదు గంటలు భేటీ

శుక్రవారం జీఆర్జీ రోడ్ లోని కాంగ్రెస్ వార్ రూంలో మూడో సారి స్ర్కీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు బాబా సిద్ధిఖీ, జిగ్నేష్ మేవాని, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్​చార్జ్​ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ సెక్రటరీలు పీసీ విష్ణునాథ్​, మన్సూర్ అలీఖాన్, రోహిత్ చౌదరి, స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు  పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు  ప్రారంభమైన సమావేశం.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈ భేటీలో 80కి  పైగా స్థానాల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. తొలిరోజు దాదాపు గంట పాటు భేటీ అయిన కమిటీలోని కీలక నేతలు.. అభ్యర్థుల వడపోత ఎలా చేయాలన్న దానిపై చర్చించినట్లు తెలిసింది. దీని ఆధారంగా గురువారం సుదీర్ఘంగా(ఏడు గంటలు) జరిగిన భేటీలో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒకే అప్లికేషన్ అందిన ముఖ్య స్థానాలు, ఎలాంటి వివాదాలకు చోటివ్వని సీట్లపై చర్చించారు. అలాగే ఏమాత్రం ప్రజాధరణ లేని, నియోజకవర్గాల్లో ప్రభావితం చూపని నేతల పేర్లను లిస్ట్ నుంచి తొలగించినట్లు తెలిసింది. 

ఫస్ట్​ లిస్టు భారీగానే..!

సాధ్యమైనంత మేరకు ఫస్ట్ జాబితాలోనే పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించాలని కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. పలు దఫాల్లో జాబితాలను రిలీజ్ చేయడం వల్ల అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నది. అందువల్ల ఒకే సారి భారీ లిస్ట్ రిలీజ్​తో అసంతృప్తుల  ఆందోళనకు చెక్ పెట్టవచ్చని.. సీనియర్​ లీడర్లు, పార్టీ మారి వచ్చిన వారికి సర్ధుబాటు చేస్తామని బుజ్జగించవచ్చని యోచిస్తున్నది.  పీసీసీ చీఫ్​, సీఎల్పీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్ల పేర్లు ఫస్ట్ జాబితాలో ఉండనున్నాయి. అదేవిధంగా సర్వేలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నేతల పేర్లు కూడా ఉండే చాన్స్ కనిపిస్తున్నది. 

జూబ్లీహిల్స్​పై ప్రతిష్టంభన

జూబ్లీహిల్స్ సీటుకు మాజీ ఎమ్మెల్యే విష్ణు, సీనియర్ లీడర్ అజహరుద్దీన్ పోటీ పడుతుండడంతో ఈ సీట్​పై కూడా కాంగ్రెస్​ స్క్రీనింగ్​ కమిటీ ఒక స్పష్టతకు రానట్లు తెలిసింది. కమిటీ సభ్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు సమాచారం. మల్కాజ్ గిరి, తుంగతుర్తి, నకిరేకల్ స్థానాల విషయంలో స్పష్టత రాలేదు. 

హాట్ సీట్​గా ఇల్లందు

ఇల్లందులో పోటీ చేసేందుకు అత్యధికంగా 32 మంది కాంగ్రెస్​కు అప్లయ్​ చేసుకోవడంతో ఇప్పుడు ఆ సీటు హాట్ సీట్​గా మారింది. లంబాడా సామాజిక వర్గానికి ఇక్కడ పట్టు ఉండడంతో ఆ వర్గానికి చెందిన నేతలు బెల్లయ్య నాయక్, అజ్మీరా శంకర్, బానోత్ విజయలక్ష్మి, లక్ష్మణ్ నాయక్  తదితరులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యకు టికెట్​ ఇవ్వాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. పొంగులేటితో పాటు కనకయ్య కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఈ స్థానంపై క్లారిటీ రాలేదు. ఇక సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకోవడంతో దాదాపు 20 ఎస్టీ, ఎస్సీ, బీసీ స్థానాలపై కమిటీ స్పష్టతకు రాలేకపోయింది.  

మీడియాతో నో కామెంట్స్​

సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని కాంగ్రెస్​ హైకమాండ్ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో గత 3 రోజులుగా ఈ అంశంపై నేతలెవరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. గురు, శుక్రవారాల్లో కమిటీ సుదీర్ఘంగా భేటీ అయినప్పటికీ... ఏ ఒక్కరూ మీడియా ముందుకు రాలేదు. 

ఏయే స్థానాల్లో ఎవరు?

ప్రస్తుతానికి సీఎల్పీ నేత భట్టి (మధిర), పీసీసీ చీఫ్ రేవంత్ (కొడంగల్), సీతక్క (ములుగు), శ్రీధర్ బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి), పొదెం వీరయ్య (భద్రాచలం ) పేర్లపై స్క్రీనింగ్​ కమిటీలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. ఉత్తమ్ (హుజూర్ నగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ) పేర్లను పరిశీలన లోకి తీసుకున్నట్లు సమాచారం. బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాతకు సర్వే లో మంచి మార్కులు రావడంతో మహేశ్వరం నుంచి ఆమెను బరిలో దింపాలని కమిటీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వికారాబాద్ స్థానా నికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పేరు ఖరారైనట్లు, చేవెళ్ల నుంచి ముగ్గురు పోటీలో ఉన్నా ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ మెంబర్ భూపతిగళ్ల మహిపాల్ కే కమిటీ మార్కులు వేసినట్లు ఆ వర్గాలు అంటు న్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ల్లో క్యాండిడేట్లకు ఇబ్బంది లేకపోయినా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్ పరిధి లోని సీట్లలో ఎంపిక కాస్త సవాల్​గా మారినట్లు సమాచారం.