
- క్యాండిడేట్ల ప్రకటన తరువాత బీఆర్ఎస్ స్పీడప్
- కుల సంఘాల భవనాలు, దేవాలయాలకు నిధులు
- ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే ముగించేలా ప్లాన్
- ప్రభుత్వ ఖర్చులతో.. పార్టీకి ప్రచారం!
హైదరాబాద్, వెలుగు:అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. నేతలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త పనులకు శంకుస్థాపనలు చేయడం, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వ ఖర్చులో ప్రచారం చేసుకోవచ్చని ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. దీంతో పాటు ఏదో చేశాం.. చేస్తున్నాం అనే భావన జనాల్లో కల్పించినట్లు అవుతుందని, ఫలితంగా ఎలక్షన్లలో లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే రోజూ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తరువాత నుంచే శంకుస్థాపనల్లో స్పీడ్ పెంచారు.
పనులు పూర్తి కాకున్న ప్రారంభోత్సవాలు
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముందుగా గ్రామాల్లో కుల సంఘాలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే కుల సంఘాల వాళ్లకు బిల్డింగ్లు నిర్మించి ఇస్తామని హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన వెంటనే కొంత నగదు రూపంలో అందజేసి.. నిర్మాణ పనులు మొదలయ్యేలా చూస్తున్నారు. వాటి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యేలే హాజరవుతున్నారు. ఇక గ్రామాల్లో ముఖ్యమైన టెంపుల్స్ ఉంటే.. వాటికి కూడా నిధులు ఇస్తున్నారు. ఇందుకోసం స్పెషల్‌గా ముందుగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరం అనుకున్న చోట్ల అప్పటికప్పుడు డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు కూడా శాంక్షన్లు ఇప్పిస్తూ.. పనులు ప్రారంభిస్తున్నారు. ఇక గతంలో ప్రామిస్ చేసి మొదలుపెట్టిన మరికొన్నింటికి పూర్తి కాకున్నా.. ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎలక్షన్ల దాకా ఎట్లనో గట్ల జనాల్లో ఉండి.. నెగిటివ్‌ను తగ్గించుకునేందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
కోడ్ వచ్చేదాకా అంతే
- ఎలక్షన్ల షెడ్యూల్ వచ్చే దాకా శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలతోనే నియోజకవర్గాల్లో బిజీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చులతోనే చేయనున్నారు. ఒక్కసారి ఎలక్షన్ షెడ్యూల్ వస్తే.. అధికారికంగా కార్యక్రమాలు చేసేందుకు వీలుండదు. ఎలక్షన్ కోడ్ వస్తే.. ప్రతిదీ మానిటర్ అవుతుంది. దీంతో అప్పటి లోపే ఇవన్నీ పూర్తి చేస్తే.. తరువాత ప్రచారం చేసుకోవచ్చునని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
- వేల్పూర్ లోని మంత్రి క్యాంప్ కార్యాల యంలో భీంగల్, మోర్తాడ్, ముప్కాల్ మండలాలలో వివిధ గ్రామాలకు సుమారు రూ.1.08 కోట్లతో మంజూరైన వివిధ కులసంఘాల భవనాల నిర్మాణాల నిధుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి ప్రశాంత్ రెడ్డి అందజేశారు.
- మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజక వర్గం మొత్తం 100 గుళ్లకు రూ.5లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. వాటి కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
- గ్రామాల పర్యటన సమయంలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. నియోజకవర్గంలోని వివిధ దేవాలయాలకు రూ.2 నుంచి రూ.5లక్షల వరకు తన సొంత నిధులను అందజేస్తున్నారు.