గద్వాల టికెట్ కోసం బిగ్ ఫైట్

గద్వాల టికెట్ కోసం బిగ్ ఫైట్
  •     గాంధీభవన్ లో రెండు సామాజిక వర్గాల బల ప్రదర్శన
  •     టికెట్​ తమకే ఇవ్వాలని వాల్మీకి బోయ, కురువ నేతల పైరవీలు
  •     కొత్త, పాత నేతల మధ్య కొనసాగుతున్న పంచాయితీ

గద్వాల, వెలుగు : గద్వాల కాంగ్రెస్  పార్టీ టికెట్ కోసం బిగ్  ఫైట్  నడుస్తోంది. కొత్త, పాత కాంగ్రెస్  లీడర్లతోపాటు గద్వాల నియోజకవర్గంలోని రెండు సామాజిక వర్గాలు టికెట్ తమకు కావాలంటే తమకు కావాలంటూ పట్టుబడుతున్నాయి. ఇరువర్గాల లీడర్లను సంతృప్తి పరిచేందుకు హైకమాండ్ తంటాలు పడుతోంది. టికెట్​ తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని వాల్మీకి బోయ, కురువ నేతలు పోటాపోటీగా గాంధీభవన్ లో ఇటీవల బల ప్రదర్శన నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కొత్తగా పార్టీలో జాయిన్  అయిన వారికి టికెట్ ఇవ్వొద్దంటూ మరోసారి డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పాత లీడర్లు కంప్లైంట్ చేశారు. రెండు సామాజిక వర్గాలు, కొత్త, పాత లీడర్లకు నచ్చ జెప్పడం హై కమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఏ సామాజిక వర్గాన్ని కాదన్నా ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. ఇక టికెట్  పంచాయితీతో కాంగ్రెస్  క్యాడర్  అయోమయానికి గురవుతోంది. 

ఇరు వర్గాలకు పెద్దల సపోర్ట్..

కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత కాంగ్రెస్  వర్గాలకు పార్టీలోని పెద్దలు సపోర్ట్  చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాత వర్గానికి భట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డి సపోర్ట్  చేస్తుండగా, కొత్త వర్గానికి టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సపోర్ట్  చేస్తున్నారనే టాక్​ వినిపిస్తోంది. కొత్త, పాత నేతలు టికెట్​ కోసం ఎవరికివారు పైరవీలు చేసుకుంటున్నారు. అయితే పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గం నేతలు, బీఆర్ఎస్  పార్టీలోని మరో సామాజిక వర్గానికి చెందిన లీడర్లు కూడా గాంధీభవన్​కు తరలివెళ్లి టికెట్  ఇవ్వాలని అడగడం గద్వాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో హైకమాండ్ తీవ్రంగా ఆలోచించి ఓ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీతో పాటు బీఆర్ఎస్ లోని ముఖ్య లీడర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి బీఆర్ఎస్  పార్టీ అన్యాయం చేసిందని, తాము న్యాయం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినా వారు టికెట్ విషయంలో రాజీకి రాలేదనే చర్చ కొనసాగుతోంది.

టికెట్​ ఎవరికో?

గద్వాల్  నియోజకవర్గంలో కాంగ్రెస్  పార్టీ టికెట్  ఎవరికి వస్తుందోననే చర్చ జరుగుతోంది. కొత్తగా చేరిన కురువ సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్ పర్సన్ సరితకు వస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతుండగా, మరోవైపు ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి విజయ్ కుమార్, రాజీవ్ రెడ్డి, మీరు బాబు, బలిగెర నారాయణరెడ్డి టికెట్​ కోసం పోటీ పడుతున్నారు.

వీరితో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చే బీఆర్ఎస్  పార్టీకి చెందిన జడ్పీటీసీకి టికెట్  ఇచ్చి ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్  పార్టీలో చేరిన జడ్పీ చైర్ పర్సన్  సరితకు టికెట్ ఇవ్వద్దని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి విజయకుమార్  ఆధ్వర్యంలో పార్టీ స్క్రీనింగ్  కమిటీ మెంబర్ మురళీధన్ కు మంగళవారం మరోసారి కంప్లైంట్ చేశారు. 

సయోధ్య కోసం తంటాలు..

రెండు సామాజిక వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్  హైకమాండ్ తంటాలు పడుతోంది. ఒక వర్గానికి ఎమ్మెల్సీ ఆఫర్  చేసినా ఒప్పుకోకుండా, ఎమ్మెల్యే టికెట్  ఇస్తే కాంగ్రెస్  పార్టీని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో అర్థం కాక తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.