నవంబర్ 15లోగా హెల్త్‌‌‌‌కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి 

నవంబర్ 15లోగా హెల్త్‌‌‌‌కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి 
  • కార్పొరేట్ దవాఖాన్లలో ఫ్రీగా వైద్యం అందేలా ఒప్పందాలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 15లోగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీములోని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెల్త్‌‌‌‌కార్డుల సమస్యపై తానే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి, అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స అందేలా ఒప్పందాలు కుదుర్చుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బుధవారం టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఎన్నికైన పీఆర్‌‌‌‌టీయూ( ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్) రాష్ట్ర కార్యవర్గం సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యింది. దాదాపు గంటకు పైగా సాగిన చర్చల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

డిఎస్సీ 2003 టీచర్లకు ఓపీఎస్ , గిరిజన పాఠశాలల్లోనూ అక్రిడేషన్, సీపీఎస్ రద్దు తదితర అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఎంపీ వేం నరేందర్‌‌‌‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీల అప్‌‌‌‌గ్రేడేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, వారం రోజుల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎంవో ప్రత్యేక అధికారి వేముల శ్రీనివాస్‌‌‌‌ను సీఎం అక్కడికక్కడే ఆదేశించారు. 

బిల్లుల చెల్లింపుపై త్వరలోనే నిర్ణయం

సర్వశిక్షా పరిధిలోని ఐఈఆర్‌‌‌‌పీలకు కనీస పే-స్కేల్ అమలు, కోర్టు ఉత్తర్వుల అమలు అంశాన్ని తదుపరి విద్యాశాఖ సమీక్షా సమావేశం ఎజెండాలో చేర్చాలని అధికారులను సీఎం  ఆదేశించారు. కొత్త పీఆర్సీ నివేదికను తెప్పించుకుని ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన మంచి ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో అమలు చేస్తామని, పెండింగ్‌‌‌‌లో ఉన్న డీఏలు, వివిధ రకాల బిల్లుల చెల్లింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సీపీఎస్ రద్దుపై నిపుణుల కమిటీ నియామకం, జీవో 25 సవరణ, బీఎడ్ అర్హత ఉన్న ఎస్జీటీలకు పీఎస్ హెచ్‌‌‌‌ఎం పదోన్నతులు కల్పించాలని, వచ్చే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని నేతలు కోరగా.. అన్నింటిపై సీఎం సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేతలు తెలిపారు. ఈ భేటీలో పీఆర్‌‌‌‌టీయూ నేతలు మధుసూదన్ రెడ్డి, బిక్షం గౌడ్, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పేరి వెంకట్ రెడ్డి, బి. జగన్మోహన్ గుప్తా పాల్గొన్నారు.