రాష్ట్రంలో రూ. 80 కోట్లతో కొత్త నర్సరీలు : సునీత ఎం. భగవత్

రాష్ట్రంలో రూ. 80 కోట్లతో కొత్త నర్సరీలు : సునీత ఎం. భగవత్
  • రాష్ట్ర అటవీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ సునీత ఎం. భగవత్

సత్తుపల్లి,వెలుగు: రాష్ట్రంలో రూ. 80 కోట్ల నిధులతో కొత్త నర్సరీల ఏర్పాటు , 1,783 హెక్టార్లలో కొత్త ప్లాంటేషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ అటవీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీత ఎం. భగవత్ తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్తగా శాండల్ ఉడ్, సీతాఫలం, రెడ్ శాండల్ వంటి ఆదాయాన్నిచ్చే మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలోని పలు నర్సరీల్లో శాండల్ ఉడ్, సోప్ నట్స్ మొక్కల పెంపకం ప్రారంభించామని చెప్పారు. 

ఉత్పత్తి, డిమాండ్ ఆధారంగా కొత్త నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చినట్లు తెలిపారు. గతేడాది ఎకో టూరిజం, బ్యాంబో యూకలిప్టస్, జీడి మామిడి అమ్మకం ద్వారా కార్పొరేషన్ కు రూ.310 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కార్పొరేషన్ అభివృద్ధి, నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.  సత్తుపల్లి పరిధిలోని కనకగిరి గుట్టల్లో ఎకో టూరిజం ఏర్పాటు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు.  ప్రస్తుతం బ్యాంబో యూకలిప్టస్, జీడిమామిడి మాత్రమే కార్పొరేషన్ స్థలాల్లో పెంచుతున్నామన్నారు. 

 ఉత్పత్తి పెరగటం, డిమాండ్ తగ్గడంతో బ్యాంబో డిపోల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయిందన్నారు. బ్యాంబోకు చెద పట్టడం మూలంగా సంస్థకు నష్టాలు వస్తున్నాయనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. కార్పొరేషన్ అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో టూరిజం డెవలప్ మెంట్ పై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు.  ఆమె వెంట చీఫ్ జనరల్ మేనేజర్ డీవీ రెడ్డి, డీఎం గణేశ్​ సిబ్బంది ఉన్నారు.