అరణ్య భవన్లో టైగర్ సెల్.. పులులు, చిరుతలు జనావాసాల్లోకి రాకుండా చర్యలు

అరణ్య భవన్లో టైగర్ సెల్.. పులులు, చిరుతలు జనావాసాల్లోకి రాకుండా చర్యలు
  • ఏర్పాటుకు అటవీ శాఖ నిర్ణయం..  పులులు, చిరుతలు జనావాసాల్లో రాకుండా చర్యలు
  • వన్య మృగాల కదలికలపై నిరంతరం పర్యవేక్షణ
  • వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేలా ప్రణాళిక 
  • చీఫ్  వైల్డ్  లైఫ్  వార్డెన్ ఆధ్వర్యంలో ఐఎఫ్​ఎస్ అధికారులతో కమిటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులులు, చిరుతల సంచారం పెరిగిన నేపథ్యంలో అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది.  హైదరాబాద్‌‌‌‌లోని అరణ్య భవన్‌‌‌‌లో టైగర్  సెల్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  తర్వలో టైగర్​సెల్​ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కమిటీని కూడా నియమించేలా ప్రణాళికలు రూపొందించారు. మనుషులు, వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడంతో పాటు పులులు, చిరుతలు జనావాసాల్లోకి రాకుండా నియంత్రించడం, వేటగాళ్ల నుంచి వాటిని రక్షించడం, వన్య ప్రాణుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కోసం టైగర్​ సెల్​ను ఏర్పాటు చేస్తున్నారు.

 పులుల డీఎన్ఏ, చారల నమూనాలు, జనాభా గణాంకాలు సేకరించడంలో ఈ సెల్​ కీలకంగా పనిచేస్తుంది. చీఫ్  వైల్డ్  లైఫ్  వార్డెన్  ఏలూ సింగ్​ మేరు ఆధ్వర్యంలో సెల్  ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఇండియన్  ఫారెస్ట్  సర్వీస్ (ఐఎఫ్‌‌‌‌ఎస్) అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ పులులు, చిరుతల కదలికలను నిశితంగా పరిశీలించి, వాటి సంరక్షణ కోసం అవసరమైన చర్యలను తీసుకోనుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే..  అమ్రాబాద్, కవ్వాల్​ టైగర్ రిజర్వ్​ల్లోనూ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. టైగర్  రిజర్వ్‌‌‌‌లున్న మధ్యప్రదేశ్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం, తదితర రాష్ట్రాల్లో వన్యప్రాణి సంరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి మానిటరింగ్​ చేస్తున్నారు. 

వన్య ప్రాణులకు వేటగాళ్ల నుంచి రక్షణ

వన్య ప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమ వేట, వన్య ప్రాణుల అవయవాల రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్థానిక పోలీసు అధికారులతో కలిసి వేటగాళ్లపై నిఘా పెంచింది. అటవీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచడంతో పాటు స్థానిక గిరిజనులతో సమన్వయం చేసుకుంటోంది. అంతేకాకుండా పులులు, చిరుతలు గ్రామీణ ప్రాంతాలు, జనావాసాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. సీసీ కెమెరాలు, డ్రోన్‌‌‌‌లు, జీపీఎస్  ట్రాకింగ్  వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించి వన్యప్రాణుల అడుగుజాడలు తెలుసుకోనున్నది. పులులు, చిరుతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎటువైపు వెళ్తున్నాయి? ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి?  ఇలాంటి అంశాలపై టైగర్​ సెల్‌‌‌‌ అధికారులు​ప్రధానంగా ఫోకస్  పెట్టనున్నారు.

మహారాష్ట్ర నుంచి పులుల వలసలు.. 

మహారాష్ట్రలోని తాడోబా, నవేగావ్, మెల్ఘాట్  వంటి టైగర్  రిజర్వ్‌‌‌‌ల నుంచి పులులు తెలంగాణ సరిహద్దుల్లోకి వలస వస్తున్నాయి. మహారాష్ట్రలోని అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరగడం, ఆవాసం కోసం ఆధిపత్యం పెరగడం వలసలకు కారణమవుతున్నాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 

ఈ పులులు ఆహారం, నీరు, ఆవాసం  కోసం వలస వస్తున్నట్లు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని కొమరంభీం ఆసిఫాబాద్, కవ్వాల్  టైగర్  రిజర్వ్ తోపాటు పలు ప్రాంతాలకు మహారాష్ట్ర నుంచి టైగర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. దీంతో పులులకు సరైన ఆవాసం కల్పించడంతో పాటు ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

పెరిగిన పులుల సంఖ్య 

ప్రస్తుతం రాష్ట్రంలో 45 వరకు పులులు, 187 వరకు చిరుతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో చిరుతల సంచారం  బాగా పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్,  మహబూబ్‌‌‌‌నగర్  జిల్లాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతలు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి గొర్రెలు, మేకలు, కుక్కలపై దాడి చేశాయి. ఇలాంటి పరిస్థితిని అదుపు చేయడానికి టైగర్  సెల్  ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిరుతలను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు.