కవ్వాల్కు మహారాష్ట్ర పులులు!.. త్వరలో తాడోబా నుంచి తరలింపు

కవ్వాల్కు మహారాష్ట్ర పులులు!.. త్వరలో తాడోబా నుంచి తరలింపు
  • రెండు ఆడ, ఒక మగపులి కావాలని మహారాష్ట్రను కోరిన తెలంగాణ 
  • అటవీ శాఖ ప్రతిపాదనకు పొరుగు రాష్ట్రం అంగీకారం
  • త్వరలో కవ్వాల్​కు ఎన్టీసీఏ బృందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కవ్వాల్​ టైగర్​ రిజర్వ్​ ఫారెస్టులో పులులు లేకపోవడంతో మహారాష్ట్రలోని తాడోబా నుంచి వాటిని  తీసుకొచ్చేందుకు తెలంగాణ అటవీ శాఖ కసరత్తు చేస్తున్నది. తాడోబా, తిప్పేశ్వర్, కదంబా వంటి రిజర్వ్‌‌  ఫారెస్టుల నుంచి పులులు కవ్వాల్, ఆసిఫాబాద్​ అడవికి అప్పుడప్పుడు వచ్చిపోతున్నా.. స్థిరంగా ఉండడం లేదు. 

దీంతో కవ్వాల్‌‌లో పులుల సంతతి పెంచడంతోపాటు శాశ్వత ఆవాసంగా మార్చేందుకు తాడోబా నుంచి రెండు ఆడపులులు, ఒక మగపులిని తీసుకురావాలని రాష్ట్ర అటవీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అటవీ శాఖ చీఫ్ వైల్డ్ లైఫ్  వార్డెన్  ఏలూసింగ్  మేరు.. మహారాష్ట్ర చీఫ్  వైల్డ్​లైఫ్​ వార్డెన్ కు ప్రతిపాదనలు పంపించగా.. అందుకు  మహారాష్ట్ర సర్కారు​అంగీకారం తెలిపింది. 

దీంతో పులుల రీలోకేషన్​ ప్రక్రియకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ‘నేషనల్ టై గర్  కన్సర్వేషన్  అథారిటీ’ (ఎన్‌‌టీసీఏ) కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించారు. తర్వలోనే ఎన్టీసీఏ బృందం కవ్వాల్ లో పర్యటించనున్నట్లు తెలిసింది. రిజర్వ్ ​ఫారెస్టులో పులుల సంచారానికి అనుకూలతలు, ఆహారం, ఆవాస సామర్థ్యం, నీటి వసతి, పర్యావరణం, జన్యురీత్యా ఏర్పడే ప్రభావాలు తదితర అంశాలను పరిశీలించిన తర్వాత ఎన్టీసీఏ అనుమతులు మంజూరు చేస్తుంది.

 మహారాష్ట్ర నుంచి కాగజ్​నగర్  కారిడార్​ వైపు వచ్చిపోతున్న పులులను సైతం  కవ్వాల్ రిజర్వ్​కు తరలించేలా అటవీశాఖ ప్రణాళికలు రచిస్తోంది. కవ్వాల్  వన్యప్రాణుల అభయారణ్యంను 2012లో టైగర్  రిజర్వ్‌‌  ఫారెస్ట్​గా ప్రకటించారు.ఇది గోదావరి పరీవాహక ప్రాంతంలో మొత్తం 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ ​ జిల్లాలో విస్తరించింది.

కవ్వాల్ కోర్  ఏరియా నుంచి మైసంపేట, రాంపూర్  గ్రామాల ప్రజలను ఇప్పటికే వేరే ప్రాంతానికి తరలించి, పులుల ఆవాసానికి అనుకూల వాతావరణం కల్పించారు. పులుల ఆహారం కోసం  జింకలు, సాంబార్, నీల్ గాయి వంటి వన్యప్రాణులను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నుంచి తెచ్చిన పులులకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. 

పులుల సంతతి పెరిగే చాన్స్​

తాడోబా టైగర్  రిజర్వ్​లో 40 నుంచి 50 వరకు, ఇంద్రావతి నేషనల్  పార్కులో 20 నుంచి 35 వరకు పులులు ఉన్నాయి. అక్కడ పెద్దపులుల సంఖ్య భారీగా పెరగడం, టెరిటరీ కోసం ఆధిపత్య పోరుతో  కాగజ్​నగర్​ కారిడార్​ వైపు కొన్ని పులులు వలస వస్తున్నాయి. ఇలా వస్తున్న పులులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో వాటిని కవ్వాల్  రిజర్వ్​ ఫారెస్ట్​కు మళ్లీస్తే ఆవాసం కల్పించి, కాపాడడంతోపాటు అటవీ సంపదను కూడా పరిరక్షించే అవకాశం ఉంటుంది. కాగా, రీలోకేషన్​ ప్రక్రియ విజయవంతమైతే కవ్వాల్ టైగర్ రిజర్వ్‌‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  

పన్నాలో రీలొకేషన్​ విజయవంతం

 అడవిలో ఎక్కువగా పులులు ఉంటే వాటిని మరో ఫారెస్ట్​కు తరలించడాన్ని ‘టైగర్‌‌  రీలొకేషన్‌‌ ’ అంటారు. దీంతో పులుల సంతతి పెరిగే అవకాశం ఉంది.  గతంలో మధ్యప్రదేశ్‌‌లోని పన్నా టైగర్‌‌  రిజర్వ్​లో రీలొకేషన్​ విధానం అవలంబించగా.. అది విజయవంతమైంది. 

అక్కడి టైగర్​ రిజర్వ్​లో 2009 నాటికి ఒక్క పెద్దపులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలోని అడవుల నుంచి పన్నా రిజర్వ్​ ఫారెస్ట్​కు 4 పులులను తరలించారు.  ప్రస్తుతం పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50కి చేరడం విశేషం. ఇప్పుడు పన్నా టైగర్​రిజర్వ్​ ప్రయోగాన్నే కవ్వాల్ లో అమలు చేస్తున్నారు.