దేశవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు

దేశవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేడుకలు చేపట్టింది. ‘ఏక్ భారత్–శ్రేష్ట్ భారత్’ నినాదంతో దేశమంతా ఒక్కటే అని చెప్పేందుకు అన్ని రాజ్​భవన్​లలో ‘తెలంగాణ ఆవిర్భావ వేడుకలు’ నిర్వహించాలని పోయిన నెల 30న కేంద్రం లేఖలు పంపింది. ఏపీ, తమిళనాడు, యూపీ, బెంగాల్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్​గఢ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, పుదుచ్చేరి, లడఖ్, అస్సాం, జమ్మూ–కాశ్మీర్, గోవా, మిజోరాం, మణిపూర్, మేఘాలయ రాజ్​భవన్​లలో వేడుకలు చేపట్టింది.

ఢిల్లీ తెలంగాణ భవన్​లో వేడుకలు

ఢిల్లీలోనూ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో వేడుకలు నిర్వహించారు. ఢిల్లీలోని ఫ్రాన్స్ ఎంబసీ ప్రతినిధి లారెంట్ ట్రిపోనే చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఉదయం ఢిల్లీలో రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి(ఎస్ఆర్) మందా జగన్నాథం జాతీయ జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. తర్వాత కేఎం సాహ్ని, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్ జాజుల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.ఢిల్లీలోని రాజ్​నివాస్​లో జరిగిన వేడుకల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పాల్గొన్నారు.