ఈ ఏడాది వందే మెట్రో రైళ్లు తెస్తం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఈ ఏడాది వందే మెట్రో రైళ్లు తెస్తం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • కాజీపేటలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు
  • టెండర్ ​ప్రక్రియ కంప్లీట్.. ఫ్యాక్టరీ నిర్మాణం త్వరగా పూర్తి చేస్తం
  • తెలంగాణలో 39 స్టేషన్లను వరల్డ్ క్లాస్ గా డెవలప్​ చేస్తం
  • ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని ఆరోపణ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్ర బడ్జెట్​లో రూ.4,418 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు రైల్వే ప్రాజెక్టులకు రూ.886 కోట్లే ఇచ్చారని, కానీ, తమ ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగా కాజీపేటలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే ఫ్యాక్టరీ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రికార్టు స్థాయిలో నిధులు కేటాయించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు.

ఎంఎంటీఎస్ విస్తరణకు 600 కోట్లు

విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎంటీఎస్ విస్తరణ పనులను వేగవంతంగా కేంద్రం చేపడుతోందని, ఇందుకోసం బడ్జెట్ లో రూ.600 కోట్లను కేంద్రం కేటాయించిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. కానీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదన్నారు. కేంద్రమే సహకరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ విమర్శలను కొట్టిపారేశారు. కాజీపేటలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, టెండర్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఫీజిబిలిటీ స్టడీ చేశామన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వ్యాగన్ ఓవర్ హాలింగ్ కు దేశంలో డిమాండ్ ఉందని చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఓవర్ హాలింగ్ లకు పెద్ద తేడా లేదని, అందువల్ల కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని అప్ గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఇందులోనే పీరియాడిక్ ఓవర్ హాలింగ్, రిపేర్, మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయన్నారు.

కొత్త రూట్లలో వందే భారత్​ ట్రైన్లు ప్రారంభిస్తం

హైదాబాద్– విశాఖ వందే భారత్ ట్రైన్ కు మంచి స్పందన వస్తోందని, ఈ ట్రై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ అక్యుపెన్సీ రేటు 120 శాతంగా ఉందని రైల్వే మంత్రి చెప్పారు. ఆత్మనిర్భర్​ భారత్ లో భాగంగా తెచ్చిన వందే భారత్ ట్రైన్స్ సక్సెస్​ కావడంతో ఈ ఏడాదే వందే మెట్రో కాన్సెప్ట్ ను ప్రారంభిస్తామని చెప్పారు. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో దగ్గరి ప్రయాణాలకు రీజినల్ షటిల్ ట్రైన్స్ గా వీటిని తీసుకొస్తున్నామన్నారు. రీజినల్ ట్రైన్స్ తక్కువ స్పీడ్​తో నడుస్తాయని, భిన్నమైన సీటింగ్, టాయిలెట్స్​ ఉంటాయని చెప్పారు. 60‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–70 కి.మీ దూరంలో ఉన్న రెండు పట్టణాలను కలిపేలా ఈ ట్రైన్స్ తీసుకురాబోతున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా చాలా రూట్లలో కొత్తగా వందే భారత్ ట్రైన్లను ప్రారంభిస్తామన్నారు. 

రెండు రాష్ట్రాలకు రూ.12 వేల కోట్లు

తెలంగాణలో39, ఏపీలో 72 రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. అలాగే రైల్వే ప్రాజెక్ట్ ల కోసం భూసేకరణ, ఇతర అంశాల్లో ఏపీ నుంచి మంచి సహకారం దక్కుతోందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.12 వేల కోట్లను కేంద్రం కేటాయించిందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఈసారి వన్ స్టేషన్, వన్ ప్రొడక్ట్స్(ఓఎస్ఓపీ) అమలు చేయబోతున్నామన్నారు. ఈ ఏడాది 750 ఓఎస్ఓపీ స్టాల్స్ ప్రారంభిస్తామన్నారు. 

కేంద్ర బడ్జెట్​పై నేడు బీజేపీ సదస్సు

కేంద్ర బడ్జెట్​పై బీజేపీ రాష్ట్ర శాఖ శనివారం హైదరాబాద్ లో సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడలోని ఓ హోటల్ లో ఈ కార్యక్రమం ఉంటుంది.