బాలికలకు హెల్త్ కిట్లపై మాట మార్చిన సర్కారు

బాలికలకు హెల్త్ కిట్లపై మాట మార్చిన సర్కారు
  • 2 లక్షల మంది అమ్మాయిలకు మొండిచేయి
  • గతంలో హెల్త్ కిట్ లో 13 వస్తువులు, ఇప్పుడు మూడే
  • విద్యార్థినుల ఆరోగ్యాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: చదువుకునే అమ్మాయిల ఆరోగ్యం, రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న సర్కారు.. ఆచరణలో మాత్రం మాట తప్పుతోంది. గతంలో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకూ హెల్త్ అండ్ హైజీన్ కిట్లు ఇవ్వగా, ఇప్పుడు ఎనిమిదో తరగతి నుంచి హెల్త్ కిట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సర్కారు విద్యా సంస్థల్లో ఏడో తరగతిలో ఉన్న 2 లక్షల మంది పేద విద్యార్థినులకు కిట్లు అందకుండా పోతున్నాయి. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న11 లక్షల మంది బాలికలకు ఉచితంగా శానిటరీ హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను ఈ ఏడాది నుంచి ఇస్తామని సర్కారు ప్రకటించింది. దీనికి సంబంధించి బడ్జెట్​ను రిలీజ్ చేస్తూ శుక్రవారం జీవోనూ విడుదల చేసింది. ఏటా రెండుసార్లు కిట్ అందిస్తామని, కిట్​లో 6  శానిటరీ న్యాప్కిన్  ప్యాక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్ ఉంటాయని తెలిపింది.

ఈ ఏడాది మాత్రం ఒక్కసారే ఇస్తామని జీవోలో పేర్కొన్నది. అయితే ఈ ఏడాది బడ్జెట్​లో పేర్కొన్నట్లు ఈ స్కీమ్  అమలు చేస్తున్నామని సర్కారు పెద్దలు చెప్తున్నారు. 2022–23 బడ్జెట్​ స్పీచ్ కాపీ 184 పాయింట్ లో  “సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తది”అని పేర్కొన్నారు.

కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు 8వ తరగతి నుంచి దీన్ని అమలు చేయనుంది. దీంతో ఏడో తరగతి చదివే సుమారు రెండు లక్షల మంది బాలికలకు హెల్త్ కిట్లు అందే అవకాశం లేకుండా పోయింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం 15–24 ఏండ్ల మధ్య యువతుల్లో సుమారు 32 శాతం మంది క్లాత్ ను న్యాప్ కిన్ లాగా వాడుతున్నారని తేలింది. దీంతో వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్కారు లెక్కలే చెప్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ సర్కారు ఈ ఏడాది నుంచి ఇస్తామని చెప్పేహెల్త్ కిట్లలోని మూడు వస్తువుల్లో  న్యాప్కిన్ ప్యాక్స్ తప్ప మిగిలిన వాటర్ బాటిల్, జిప్పర్ బ్యాగ్ (కవర్) రెండూ చిన్నవే. వాటినీ ఓ వస్తువులుగా సర్కారు ప్రకటించుకోవడం గమనార్హం. 

గతంలో 13 వస్తువులు ఇచ్చి... 

సర్కారు విద్యా సంస్థల్లో ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే బాలికల ఆరోగ్యం కోసం 2018లో ‘బాలికల ఆరోగ్య రక్ష కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద హెల్త్ అండ్ హైజీన్ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా శానిటరీ నాప్కిన్స్, సబ్బులు, కొబ్బరినూనె, షాంపూ బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ తదితర 13 రకాల వస్తువులు ఇచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి ఈ కిట్​ను అందించారు. కానీ ఒక్క ఏడాదికే ఈ స్కీమ్ ఎత్తేశారు.

ఎంతో మంది పేద విద్యార్థినులకు ఉపయోగకరంగా మారిన ఈ స్కీమ్ పై సర్కారు పెద్దలెవ్వరూ మాట్లాడలేదు. తాజాగా ఈ ఏడాది నేషనల్ హెల్త్ స్కీమ్ కింద న్యాప్కిన్ ప్యాక్స్ ఇస్తామని సర్కారు ప్రకటించింది. అయితే గతంలో మాదిరి 13 రకాల వస్తువులను, ఏడాదిలో నాలుగు సార్లు అందించాలని స్టూడెంట్లు, పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క బడ్జెట్ లో ప్రకటించినట్టు ఏడో తరగతి నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.