స్కీమ్​లకు, ఎమ్మెల్యేలకు లింక్ వద్దు!

స్కీమ్​లకు, ఎమ్మెల్యేలకు లింక్ వద్దు!
  • అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే అప్పగించాలని ప్రభుత్వ నిర్ణయం 
  • ప్రజాపాలన అప్లికేషన్లు, రేషన్ కార్డులే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక
  • పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల భాగస్వామ్యం
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హుల ఎంపిక 
  • బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో వ్యతిరేకత 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాలకు, ఎమ్మెల్యేలకు లింక్​పెట్టొద్దని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అర్హుల ఎంపిక బాధ్యత పూర్తిగా అధికారులకే అప్పగించాలని భావిస్తున్నది. వివిధ స్కీమ్ లను నిజమైన​ అర్హులకు అందించేందుకు ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే మహిళా సంఘాల సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరి పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించొద్దని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని చెప్పినట్టు సమాచారం. 

ఇప్పటి వరకు అమలు చేసిన గ్యారంటీలకు అర్హులను ప్రజాప్రతినిధుల ద్వారా ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్, ఇతర సబ్సిడీ పథకాల అమలుకు క్షేత్రస్థాయిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

వాళ్లను కేవలం పంపిణీ కార్యక్రమాలకే పరిమితం చేయాలని ఆలోచిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పథకాలకు అర్హుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హుల ఎంపిక బాధ్యత అధికారులకే ఇస్తే ప్రభుత్వానికి పేరు రావడంతో పాటు నిజమైన అర్హులకే మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారని, వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. అందుకే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.  

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అనేక స్కీములను ఎమ్మెల్యేలకు లింక్​ చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం వంటి వాటన్నింటికీ అర్హుల ఎంపికను ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో తమను అర్హులుగా చేర్చాలంటూ నియోజకవర్గాల్లో వేలాది మంది జనం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యే పేరు రాసిస్తేనే వారికి స్కీమ్ అందేది. 

ఈ క్రమంలో నిజమైన అర్హులకు కాకుండా.. పార్టీ కార్యకర్తలు, లీడర్లు, వాళ్ల బంధువులను ఎమ్మెల్యేలు ఎంపిక చేశారు. పైగా ఆ పథకాల అమలుకు గత ప్రభుత్వం అరకొర నిధులు ఇచ్చి మమ అనిపించింది. దీంతో నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పథకాల అమలులో ఎలాంటి పురోగతి లేకపోవడం, కొద్దిమంది కార్యకర్తలకే మేలు చేయడం, కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు అమలులో కమీషన్లు తీసుకోవడం లాంటివి బీఆర్ఎస్ కు చెడ్డ పేరు తెచ్చాయి. 

అప్పట్లో దళితబంధు విషయంలో స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సిఫార్సు ఉండాలని చెప్పి అప్లికేషన్లను జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా అర్హుల ఎంపిక జరగాలని చెప్పింది. కానీ ఇవేవీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.

అప్లికేషన్ల ఆధారంగా ఎంపిక.. 

ప్రజాపాలనలో ఐదు గ్యారంటీలకు తీసుకున్న దరఖాస్తులు, రేషన్​కార్డులను ఆధారంగా చేసుకుని స్కీమ్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హుల ఎంపిక మొత్తం అధికారులతోనే పూర్తి చేయించనుంది. నిరుపేదలు, పేదలకు మొదటి దశలో ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్​ సిలిండర్​ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. 

వీటిలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందజేస్తున్నది. ఈ నెల 11న ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను కూడా త్వరలో క్షేత్రస్థాయిలో అమలు చేయనుంది. ప్రజాపాలన అప్లికేషన్ల ఆధారంగా అధికారులే గ్రామాల్లో నిజమైన అర్హులను గుర్తించి పథకాన్ని అందించేలా విధివిధానాలు రూపొందిస్తున్నది. భవిష్యత్తులోనూ అమలు చేయనున్న పథకాలకు కూడా ఆఫీసర్ల లిస్టుతోనే ముందుకెళ్లనుంది. 

కాగా, 2014 కంటే ముందు పథకాల కోసం ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్ ఆఫీసుల్లో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉండేది. ఆ అప్లికేషన్​ఆధారంగా అర్హతలుంటే స్కీమ్ అందించేవారు. అయితే 2014లో బీఆర్ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను పక్కనపెట్టి, అర్హుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. డబుల్​బెడ్రూమ్ ఇండ్లు, దళితబంధు, బీసీలకు ఆర్థిక సాయం, ఆగ్రోస్​సెంటర్లు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌లు, ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు పొందాలన్నా, రేషన్‌‌‌‌‌‌‌‌ షాపులు ఏర్పాటు చేయాలన్నా అప్పట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా కావాల్సి వచ్చేది. 

ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల సహకారంతో.. 

ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో అధికారులతో పని చేసి అర్హులను గుర్తించేందుకు సహకరిస్తాయని అనుకుంటున్నది. ఈ కమిటీల ఏర్పాటుపై  ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఇక మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్​ చేస్తున్న ప్రభుత్వం.. పథకాల అమలులోనూ వారిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.