హౌసింగ్ భూములపై సర్వే.. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు  

హౌసింగ్ భూములపై సర్వే.. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు  
  • కబ్జా భూముల స్వాధీనానికి సర్కారు నిర్ణయం
  • సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు
  • రాష్ట్రంలో 2,500 ఎకరాలపైనే హౌసింగ్ భూములు 
  • సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికీ చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్) భూములపై సర్వే చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. రెవెన్యూ శాఖలోని సర్వేయర్ల సహకారంతో హౌసింగ్ డిపార్ట్​మెంట్ ఈ సర్వేను చేపట్టనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఎంపీ ఎన్నికల కోడ్ ముగిసే నాటికి ఈ సర్వేను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు ఈ అంశంపై లేఖ రాసినట్లు తెలుస్తోంది.

కొన్ని చోట్ల ప్రభుత్వ సర్వేయర్లతో, మరికొన్ని చోట్ల ప్రైవేట్ సర్వేయర్లతో ఈ సర్వే చేయించనున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో సర్వేయర్ల కొరత ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్ల సహకారాన్ని తీసుకోనున్నారు. సర్వే తర్వాత భూములకు సంబంధించి నాలుగు వైపులా హద్దులతో మ్యాప్​లు ఇవ్వనున్నారు. వీటి ద్వారా కోర్టు కేసులను పరిష్కరించుకోవచ్చని.. ఇది తమ భూమి అని ప్రైవేట్ వ్యక్తులు వాదించినా మ్యాప్ లు చూపించి స్వాధీనం చేసుకునేందుకు పెద్దగా ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ సర్వే చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

సవాల్​గా మారిన కబ్జాలు 

రాష్ట్రంలో భూముల ధరలు బాగా ఉన్నందున సర్కారు భూములను కాపాడటం అన్ని శాఖలకు సవాల్ గా మారింది. హౌసింగ్ తో పాటు ఎండో మెంట్ డిపార్ట్​మెంట్​కు వేల ఎకరాల భూములు ఉన్నాయి. కబ్జాకు గురైన దేవాదాయ శాఖ భూముల్లో ఇప్పటివరకూ సుమారు 10 వేల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలు పెరుగుతుండటం, వందల ఎకరాల భూముల ఓనర్ షిప్ అంశంపై కోర్టు కేసులు పెండింగ్​లో ఉండటంతో సర్వే చేపించి వాటికి హద్దులు ఖరారు చేయాలని సర్కారు నిర్ణయించింది. 

హౌసింగ్ ల్యాండ్స్ 2,500 ఎకరాలు  

హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (దిల్)కు రాష్ర్ట వ్యాప్తంగా 2,500 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దిల్ పరిధిలోనే 1,950  ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ర్టం నుంచి వస్తున్న హౌసింగ్ బోర్డుకు, రాజీవ్ స్వగృహకు హైదరాబాద్, రంగారెడ్డితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల్లో ల్యాండ్స్ ఉన్నాయి.

హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో హెచ్ఎండీఏ పరిధిలో ఉండగా జిల్లాల్లో హౌసింగ్ బోర్డు పరిధిలోనే ఉన్నాయి. వీటిని గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు వేలం వేసినప్పటికీ ఇంకా భూములు ఉన్నాయి. జిల్లాల్లో ఎకరా కనీసం రూ.3 కోట్లకు పైనే ఉందని అధికారులు చెబుతున్నారు. వీటికి హద్దులు ఖరారు చేస్తే ప్రభుత్వానికి క్లారిటీ రావటంతోపాటు రానున్న రోజుల్లో వేలం వేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. మరోవైపు సర్వే పూర్తి చేసి మ్యాప్ లు వచ్చాక కోర్టు కేసుల్లో ఉన్న భూములపై కూడా వివాదాలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు ల్యాండ్ కొరత 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీంకు తొలి దశలో సొంత జాగా ఉన్న వారికే ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. తర్వాత దశలో జాగా లేని వారికి జాగా ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం కూడా చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటే గ్రామాలతో పాటు అర్బన్ ఏరియాల్లో ఈ భూములు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉపయోగ పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.