తెలంగాణలో సర్కార్ భూములు కొన్నోళ్లు పైసలు కడ్తలెరూ

తెలంగాణలో సర్కార్ భూములు కొన్నోళ్లు పైసలు కడ్తలెరూ
  • టైం కావాలని అడుగుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు
  • 20 రోజుల్లోపు కట్టాలంటూ అధికారుల ద్వారా సర్కార్ ఒత్తిడి
  • ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు:  సర్కార్ భూములను వేలంలో అమ్మిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. హాట్ కేకుల్లా ఎకరాల కొద్దీ ల్యాండ్స్‌‌ను కోట్ల రూపాయలకు అమ్ముతున్నా.. ఆ పైసలను వసూలు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నది. పైసలు కట్టాలంటూ భూములు తీసుకున్నోళ్లను అడుగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం చెబితే రియల్​ బూమ్ పెంచేలా రూ.వందల కోట్లు పెట్టి కొన్నామని.. ఇప్పుడు కాస్త టైం కావాలని అడుగుతుంటే ఇవ్వడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. అసలే ఎలక్షన్ టైం కావడం, అమలు చేస్తున్న స్కీములకు నిధుల కొరత వెంటాడుతుండటంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. 

నిజానికి రుణమాఫీ, ఇతర ముఖ్యమైన పథకాలకు నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం భూముల అమ్మకాన్ని స్పీడప్ చేసింది. ఎలక్షన్ షెడ్యూల్ కంటే ముందే ఈ తతంగం పూర్తి చేసి ప్రభుత్వం తరపున స్కీముల రూపంలో నిధులు గుప్పించాలని ప్లాన్ చేసింది. కానీ కోకాపేట, బుద్వేల్, మోకిల వంటి ప్రైమ్ లొకేషన్లలో వేలం వేసిన భూములకు సంబంధించిన పైసలు ఇంకా ప్రభుత్వానికి జమ కాలేదు. ఈ రెండు నెలల్లో 190 ఎకరాల భూముల వేలంతో దాదాపు రూ.8 వేల కోట్లు రావాల్సి ఉంది. ఇందులో రూ.వెయ్యి కోట్ల వరకే సొమ్మును జమ చేసినట్లు తెలిసింది. మిగతా మొత్తం రాబట్టేందుకు ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. వేలంపాటలో హైదరాబాద్‌‌‌‌తో పాటు దేశంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలు కూడా పోటీపడ్డాయి.  

ప్రీలాంచ్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్!

భూములు కొన్న కంపెనీలు ఇంకో 20 రోజుల్లోపు పైసలు పూర్తిగా జమ చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారుల ద్వారా సదరు కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంకో రూ.7 వేల కోట్లు వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఖజానాలో చేరేలా చూస్తున్నారు. ఇందుకోసం ప్రీలాంచ్​ కూడా చేసుకోవచ్చని అనధికారికంగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి, ఇతర కమర్షియల్ అవసరాలకు తగిన అనుమతులను కూడా ఏమి పట్టించుకోకుండానే ప్రభుత్వం ఇస్తున్నది. 

ఫలితంగా ఆయా భూములు కొనుగోలు చేసిన వాళ్లు ముందస్తు బిజినెస్ చేసుకుని, డబ్బును ప్రభుత్వానికి జమ చేసేలా సహకరిస్తున్నది. వాస్తవానికి ప్రీలాంచ్‌‌‌‌లతో అనేక చోట్ల జనాలు మోసపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకు సర్కారే దీన్ని ప్రోత్సహించడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కొనుగోలుదారుల విషయాలను కూడా ప్రభుత్వం దాస్తూ వస్తున్నది. గతంలో భూముల వేలం నిర్వహించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడిస్తూ వచ్చింది. కోకాపేట భూముల వేలం తర్వాత ఆ సమాచారం రిలీజ్ చేయడం లేదు. 

కోకాపేటలో ఒక ఎకరా గరిష్టంగా వంద కోట్ల రూపాయలు పలికింది. దీంతో అంత పెట్టి ఎవరు కొనుగోలు చేశారోనని అందరూ ఆసక్తిగా చూశారు. ప్రభుత్వానికి దగ్గర ఉన్నోళ్లే కొన్నారనే ప్రచారం రావడంతో.. వేలంపాటలో భూములను దక్కించుకున్నోళ్ల వివరాలు వెల్లడించడం ఆపేసింది. కోకాపేటలో మూడు ప్లాట్లను అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కంపెనీ, మరో ఎమ్మెల్సీ పార్టనర్ గా ఉన్న కంపెనీ, ఒక మంత్రి బంధువు కంపెనీ భూములను దక్కించుకున్నాయి.

సర్కారుకు నిధుల టెన్షన్

రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌కు నిధుల టెన్షన్ పట్టుకున్నది. ఫండ్స్‌‌‌‌ లేకపోవడంతో స్కీములకు ఇబ్బంది అవుతుందని, దాని ఫలితం ఎలక్షన్లపై పడే ప్రమాదం ఉందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతు న్నారు. సమయానికి నిధులు రాకపోతే రుణమాఫీతో పాటు బీసీలకు రూ.లక్ష సాయం, దళిత బంధు, రెండో విడత రైతుబంధుపై ఎఫెక్ట్​ పడుతుందని పరేషాన్ అవుతున్నారు. కోకాపేటలో 45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్ల రెవెన్యూ వచ్చింది. తర్వాత బుద్వేల్‌‌‌‌లో మొత్తం 100 ఎకరాలను 14 ప్లాట్లుగా డివైడ్ చేసి వేలం వేస్తే రూ.3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. వీటికి తోడు మోకిల, షాబాద్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లోనూ భూములను వేలంలో అమ్మింది. ఇవన్నీ కలిపితే రూ.8 వేల కోట్లు అవుతోంది. ఇందులో ఇప్పటి దాకా ప్రభుత్వానికి వచ్చింది రూ.వెయ్యి కోట్లు మాత్రమే.