స్కీముల ప్రక్షాళన! అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు

స్కీముల ప్రక్షాళన! అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు

హైదరాబాద్, వెలుగు: స్కీముల్లో ప్రక్షాళన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్​ అయింది. గత ప్రభుత్వంలో ఉన్న మంచి స్కీములను కొనసాగించడంతోపాటు.. వాటిలోని లోటుపాట్లను సరిచేసే పనిలో పడింది. అక్రమాలకు తావు లేకుండా పథకాల అమలుకు పకడ్బందీగా విధివిధానాలు అమలు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే కొన్నింటిపై రాష్ట్ర సర్కార్​ కసరత్తు మొదలుపెటింది. 

ఏయే శాఖలో ఏమేమి ముఖ్యమైన స్కీములు ఇంప్లిమెంట్​ అవుతున్నాయి ? వాటికున్న విధివిధానాలు ఏమిటనే వివరాలు తెప్పించుకుంటున్నది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటిని తీసేసి.. అర్హులందరికీ లబ్ధి జరిగేందుకు ఎలాంటి మార్గదర్శకాలు అమలు చేయాలనే దానిపై చర్చలు జరుపుతున్నది. 

అందరి సలహాలతో..!

కేవలం స్కీములకే పరిమితం కాకుండా .. పాలసీలు, చట్టాల రూపకల్పన విషయంలోనూ పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమైన వాటి విషయంలో ప్రతిపక్షాలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఆహ్వానాలు పంపుతున్నది. ఇప్పటికే  రైతు భరోసా(రైతు బంధు)  విషయంలో నిబంధనలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

 అందులో భాగంగా మంత్రులతో కూడిన బృందం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచే ఒపెన్​ డిబెట్​లో సూచనలు తీసుకున్నది. రేషన్​, ఆరోగ్యశ్రీ కార్డులు విషయంలో కేబినెట్​ సబ్​ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి స్టడీ చేస్తున్నది. కల్యాణ లక్ష్మీ, దళితబంధు, ఇందిరమ్మ ఇండ్లు, ఆర్​ అండ్ ఆర్​, ఇతర వెల్ఫేర్​ స్కీములు, సబ్సిడీ సంబంధిత పథకాల్లోనూ మార్పులు తీసుకురావాలని చూస్తున్నది. 

స్కీముల్లో నిరంతరం లబ్ధిదారుల లిస్ట్​ అప్​డేట్ చేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.  నేరుగా ఎమ్మెల్యేలకు లింక్​ లేకుండా పథకాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నది. అర్హుల ఎంపిక అనేది పూర్తిగా అధికారుల స్థాయిలోనే జరిగేలా చూస్తున్నది. మహిళా సంఘాలను అన్ని రకాలుగా యాక్టివేట్​ చేస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల గుర్తింపులోనూ  వారికి భాగస్వామ్యం ఇవ్వాలని భావిస్తున్నది. 

దీంతోపాటు ఇండ్లు, పెన్షన్లు, సిలిండర్, గృహ జ్యోతి, మహాలక్ష్మీ, చేయూత, యువ వికాసం సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో అధికారులతో కలిసి నిజమైన అర్హులను గుర్తించేందుకు పనిచేస్తాయి.  

ఈ స్కీముల్లో మార్పులు చేయాల్సిందే !

గత బీఆర్ఎస్ సర్కార్ గొప్పగా ప్రకటించిన దళితులకు మూడెకరాలు, డబుల్​బెడ్రూం ఇండ్లు, గొర్రెల పంపిణీ, దళితబంధు లాంటి స్కీములు ఆశించిన స్థాయిలో సక్సెస్​ కాలేదు. ఇష్టారీతి మార్గదర్శకాలు, పద్ధతి లేని విధివిధానాలు, నిధుల కొరత, బీఆర్ఎస్ నేతల జోక్యం, క్షేత్రస్థాయిలో అవినీతి కారణంగా దళితబంధు లాంటి స్కీములు అనర్హులు, బీఆర్​ఎస్​ పార్టీ నేతలకే దక్కాయన్న విమర్శలు ఉన్నాయి. డీడీలు కట్టిన గొల్లకుర్మలకు చాలా చోట్ల గొర్రెలు పంపిణీ జరగలేదు.

 ఇలా గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పలు స్కీములు లబ్ధిదారులకు సక్రమంగా చేరలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, లబ్ధిదారుడికి మధ్య దళారుల బెడద లేకుండా ఎలాంటి విధానం అనుసరిస్తే బాగుంటుందో ఆ మార్గదర్శకాలు ఉండాలని, అందుకు తగిన మార్పులు చేయాలని అధికారులకు రాష్ట్ర సర్కార్​ స్పష్టం చేసింది. స్కీముల విషయంలో ప్రతిపక్షంలో ఉండగా తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఉన్నతాధికారులకు  సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వివరించారు. అందులో ప్రధానంగా ఏ స్కీముకైనా అర్హులను లబ్ధిదారులుగా చేర్చేందుకు నిరంతరం అవకాశం ఉండాలని చెప్పినట్లు తెలిసింది. 

    గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు స్కీమ్ కింద గుట్టలు, హైవేలు, వెంచర్లకు వేల కోట్లు ధారబోసిందని,  దీంతో ఆ స్కీమ్ అసలు ఉద్దేశం నేరవేరలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పైగా రైతుబంధు అమల్లోకి తెచ్చాక విత్తనాలు, ఎరువులపై సబ్సిడీలను గత సర్కార్​ ఎత్తేసింది. వ్యవసాయ పనిముట్లు, యంత్రాల పంపిణీ బంద్​పెట్టింది. 

ఈ తరుణంలో రైతుబంధులో దుర్వినియోగాన్ని తగ్గించడం ద్వారా మిగిలే సొమ్మును  విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల సబ్సిడీకి వినియోగిస్తే ఎలా  ఉంటుందని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 
    పశుసంవర్థక శాఖలో గొర్రెల పంపిణీ స్కీమ్ లో భారీగా అక్రమాలు జరిగాయి. డీడీలు కట్టిన గొల్లకుర్మలకు గొర్రెలు రాలేదు గానీ.. గొర్రెల రీసైక్లింగ్​ద్వారా దళారులు, అధికారులు కోట్లకు పడగెత్తారన్న ఆరోపణలు ఉన్నాయి. 

దీంతో ఇప్పుడు ఈ పథకాన్ని గొర్రెలు కాసుకునే గొల్ల, కురమలకు.. ఎంటర్​ప్రెన్యూర్స్​గా ఎదగాలనుకుంటున్న ఆ కమ్యూనిటీలకు చెందిన యువతకు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  
    వెల్ఫేర్​ స్కీములకు అప్లికేషన్లు తీసుకుని వాటిని క్షేత్రస్థాయిలో అధికారులతో స్ర్కూటిని చేయించి.. అత్యంత పేదరికంలో ఉన్నవాళ్లకు ముందుగా.. ఆ తర్వాత మిగతా అర్హులకు అందేలా నిబంధనలు తీసుకురాని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల్లోనూ సబ్సిడీ పథకాలను అమలు చేసేందుకు కొత్త పంథాలో నిబంధనలను రూపొందించాలని చూస్తున్నది. నిర్వాసితులకు ఆర్​ అండ్​ ఆర్​ విషయంలోనూ గత ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈసారి అలా ఉండకూడదని.. సరైన పరిహారం, నివాసంతో పాటు పూర్తి ప్యాకేజీని అందించేలా మార్పులు చేయనున్నారు. 

అప్లికేషన్లు.. కమిటీలు.. చర్చలు

పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నది. జనవరిలో ఆరు గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోవడం దగ్గర నుంచి రేషన్​ కార్డుల మంజూరు చేసే అంశం వరకు అన్నింటిని సంప్రదింపుల తరువాతే మొదలుపెడుతూ వచ్చింది. కొన్నింటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఎక్స్​పర్ట్స్​ నుంచి సూచనలతో ముందుకు వెళ్తుండగా.. మరికొన్నింటికి కేబినెట్ సబ్​ కమిటీలు వేసి స్టడీ రిపోర్ట్​ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నది.  

ఆరు గ్యారంటీల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్​గా సబ్​ కమిటీని ఏర్పాటు చేసి.. అప్లికేషన్లు తీసుకున్నది. రైతు భరోసా నిబంధనల కోసం కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్​లో సమస్యల పరిష్కారానికి కూడా కమిటీని వేసింది. ఆర్​ఓఆర్​ డ్రాఫ్ట్​ బిల్లుపై అఖిలపక్షం నుంచి సూచనలు తీసుకున్నది. వైద్య, విద్యకు సంబంధించిన అంశాల్లో కోదండరాం, ఆకునూరి మురళి వంటి వాళ్ల సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. 

పథకాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్​, రూ.500కు గ్యాస్​ సిలిండర్​ వంటివి అమలుకు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందేలా చూస్తున్నది. ఈ నెల 11న ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల స్కీంను కూడా ప్రజాపాలన అప్లికేషన్ల ఆధారంగా గ్రామాల్లో నిజమైన అర్హులను అధికారులు గుర్తించి.. పథకాన్ని అందించేలా విధివిధానాలు రూపొందిస్తున్నారు. మున్మందు అమలు చేయనున్న పథకాలు, సబ్సిడీ స్కీములకు కూడా ఆఫీసర్ల లిస్ట్​తోనే ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. 

ఐఏఎస్​ల నుంచి ఫీడ్​బ్యాక్​

ఆలిండియా సర్వీస్​ అధికారులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సీఎం రేవంత్​రెడ్డి.. పాలసీలకు సంబంధించి ఐడియాలతో రావాలని అన్ని శాఖల హెచ్​వోడీలకు సూచించారు.  దీంతో పథకాలను క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికలతో అమలు చేసేందుకు వీలవుతుందని ఐఏఎస్​లు చెప్తున్నారు. 

అదే సమయంలో  శాఖల్లో స్కీములు పైనా, తమ నివేదికలపైనా ఫీడ్​ బ్యాక్​ తీసుకోవడంపై అధికారులు సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో  మంచి విషయం చెప్పినా పరిగణనలోకి తీసుకునే సంప్రదాయం ఉండేది కాదన్న ఆరోపణలు ఉన్నాయి.  పైగా ఆ డిపార్ట్​మెంట్​ బాధ్యతల నుంచి ఆఫీసర్లను తప్పించిన సందర్భాలు ఉన్నాయి.  

రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సెక్రటేరియెట్​ నిర్మాణం, దళితబంధు లాంటి స్కీముల్లో లోటుపాట్లను ఎత్తిచూపిన అధికారులను శాఖలు మార్చారని అధికారుల్లో టాక్​ ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం  ప్లాగ్​ షిప్​ ప్రోగ్రామ్స్​పై  ఐఏఎస్​ల నుంచి సలహాలు తీసుకుంటున్నది.