కరోనా కేసులపై హైకోర్టుకు సర్కార్ తప్పుడు లెక్కలు

కరోనా కేసులపై హైకోర్టుకు సర్కార్ తప్పుడు లెక్కలు
  • రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటుపై సర్కార్ తప్పుడు లెక్కలు 
  • పాజిటివిటీ రేటు 15% దాటగా, 5 శాతమన్నా దాటలేదని అఫిడవిట్ 
  • అందుకే ఆంక్షలు పెడ్తలేమంటూ బుకాయింపు 
  • కరోనా మరణాల విషయంలో అడ్డంగా బుక్కయినా మారని తీరు 

హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు, పాజిటివిటీ రేటు విషయంలో రాష్ట్ర సర్కార్ మళ్లీ అబద్ధాలు చెప్పింది. హైకోర్టుకు కూడా తప్పుడు లెక్కలే ఇచ్చింది. రాష్ట్రంలో ఈనెల 18 నుంచి 24 వరకు 3.38 శాతమే పాజిటివిటీ నమోదైందని ఈనెల 25న హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌‌‌‌లో పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ 7% లోపే పాజిటివిటీ రేటు నమోదైనట్టు చూపింది. కరోనా కట్టడికి ఆంక్షలు ఎందుకు విధించడం లేదని ఆ రోజు జరిగిన విచారణలో హైకోర్టు ప్రశ్నించగా... ‘‘పాజిటివిటీ రేటు 10 % దాటిన జిల్లాల్లోనే నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాలని కేంద్రం సూచించింది. రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 10% దాటలేదు” అని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. నిజానికి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదైంది. ఉదాహరణకు ఈనెల 18 నుంచి 24 వరకు హైదరాబాద్‌‌‌‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 5% లోపలే పాజిటివిటీ రేటు నమోదైనట్టు అఫిడవిట్‌‌‌‌లో పేర్కొన్నారు. అయితే ఆ వారంలో హైదరాబాద్‌‌‌‌లో  15.21%, రంగారెడ్డిలో 25.89%, మేడ్చల్‌‌లో 21.93% మేర పాజిటివిటీ రేటు నమోదైంది. ఫస్ట్ వేవ్ నుంచి రాష్ట్ర సర్కార్ ఇలాగే తప్పుడు లెక్కలు చెప్తోంది. దీంతో కరోనా వేవ్ ట్రెండ్, కేసులు తగ్గేది, పెరిగేది ప్రజలకు తెలియడం లేదు. 

కరోనా మరణాలు 4 వేలేనట... 

కరోనా మరణాల విషయంలోనూ సర్కార్ అబద్ధాలు చెప్తోంది. తప్పుడు లెక్కలపై మీడియా, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. ప్రభుత్వాన్ని అవమానిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగింది. తాము చూపిస్తున్న లెక్కలన్నీ సరైనవేనని బుకాయిస్తూ వచ్చింది. కరోనా మృతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి రావడంతో, బాధిత కుటుంబాల నుంచి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 4,081 మందే చనిపోయారని ప్రభుత్వం చెబుతుండగా, నష్ట పరిహారం కోసం 30 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 16,500 అప్లికేషన్లకు అధికారులు అప్రూవల్ ఇచ్చారు. అంటే, ఇవన్నీ కరోనా మరణాలేనని గుర్తించారు. మిగిలిన అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌‌‌ జరుగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ లెక్కలన్నీ రాష్ట్ర సర్కార్ బయటపెట్టాల్సి వచ్చింది. ములుగు జిల్లాలో కరోనాతో ఏడుగురు మాత్రమే చనిపోయినట్టు సర్కార్ లెక్కలు చెబుతుండగా, నష్ట పరిహారం కోసం 273 అప్లికేషన్లు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో సర్కార్ లెక్క 296 ఉండగా.. 2,158 అప్లికేషన్లు వచ్చాయి. ప్రతి జిల్లాలోనూ ఇలాగే మరణాలను తక్కువగా చూపించారు. దీనిపై ప్రభుత్వ ప్రతినిధులను పలు సందర్భాల్లో మీడియా ప్రశ్నించగా.. అవన్నీ కరోనా మరణాలు కాకపోయినా, మానవతా దృక్పథంతో పరిహారం ఇస్తున్నామని వితండవాదం చేస్తున్నారు. కానీ, తప్పుడు లెక్కలు చూపడం మాత్రం మానుకోవడం లేదు.