
- ఏటా 80 నుంచి 100 శాతం నిండుతున్న ఇంజనీరింగ్ సీట్లు
- గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీలకు డిమాండ్..
- రూరల్ ఏరియాల్లో కాలేజీలను పట్టించుకోని రాష్ట్ర సర్కార్
- ప్రతి సంవత్సరం 50% లోపే అడ్మిషన్లు..
- జీతాలకు మేనేజ్‌మెంట్ల అవస్థలు
- కొత్తగా వచ్చే సీట్లూ సిటీ చుట్టూ ఉన్న కాలేజీలకే!
హైదరాబాద్, వెలుగు: లీడర్లకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లోని సీట్లన్నీ ఫుల్ అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు చుట్టుపక్కల చాలా వరకు అధికార పార్టీకి చెందిన నేతల కాలేజీలే ఉండగా.. వాటిలో ఏటా 80 శాతం నుంచి 100 శాతం దాకా సీట్లు నిండుతున్నాయి. కానీ రూరల్ ఏరియాల్లోని కాలేజీల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొన్నేళ్లుగా సగం సీట్లు కూడా నిండటం లేదు. దీంతో నిర్వహణ భారమై, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక.. న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన కాలేజీలు కూడా మూతబడుతున్నాయి. ఇందుకు సర్కారు తీరే కారణం. జిల్లాల్లో ఉన్న ప్రైవేటు కాలేజీలను నిర్లక్ష్యం చేస్తూ.. కేవలం గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కలున్న కాలేజీలను ప్రోత్సహిస్తోంది. కొత్త కోర్సులిచ్చినా, కొత్తగా సీట్లు పెంచినా సిటీ శివార్లలోని కాలేజీలకే ప్రాధాన్యం ఇస్తోంది.
మూత దశకు రూరల్ కాలేజీలు
రాష్ట్రంలో 2021–22 అకడమిక్ ఇయర్‌లో 175 ఇంజనీరింగ్ కాలేజీలుండగా.. అందులో 158 ప్రైవేటువి, 15 సర్కారు వర్సిటీ కాలేజీలు, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 79,790 కన్వీనర్ కోటా సీట్లున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టూ వంద దాకా కాలేజీలుండగా, మిగిలినవి జిల్లాల్లో ఉన్నాయి. పేరున్న పెద్ద కాలేజీలన్నీ సిటీ చుట్టుపక్కలే ఉన్నాయి. తెలంగాణ వచ్చాక కొత్త కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదు. రూరల్ కాలేజీలను పట్టించుకోవడం లేదు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల కాలేజీల్లోనే స్టూడెంట్లు చేరాల్సిన పరిస్థితి. ఇక్కడ కూడా కేవలం సీఎస్ఈ, ఈసీఈ కోర్సులతో పాటు కొత్తగా వచ్చిన ఏఐ, మిషన్ లెర్నింగ్ తదితర కోర్సులకే మేనేజ్‌మెంట్లు ప్రిఫరెన్స్ ఇస్తూ.. మిగిలిన మెకానికల్, సివిల్ తదితర కోర్సులను పట్టించుకోవడం లేదు. ఏటా హైదరాబాద్ పరిసర కాలేజీల్లో 80 నుంచి వంద శాతం సీట్లు నిండుతుండగా, రూరల్ ఏరియాల్లో 40 నుంచి 60 శాతమే సీట్లు ఫుల్ అవుతున్నాయి. దీంతో రూరల్ ఏరియాల్లో సిబ్బందికి జీతాలివ్వలేకపోతున్నామని మేనేజ్‌మెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అంతా వాళ్ల రాజ్యమే
గ్రేటర్ చుట్టుపక్కలున్న కాలేజీల్లో అధికార పార్టీ లీడర్లవి ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఎప్పటికప్పుడు సీట్లను పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఓ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు అధికార టీఆర్ఎస్‌లోని లీడర్ల కాలేజీల్లో సీట్ల భర్తీ 80% నుంచి వంద శాతం ఉంటుంది. ఇటీవల కొత్త కోర్సుల్లో 4,404 సీట్లు పెరిగితే.. వాటిలో నాలుగో వంతు సీట్లు కేవలం ఓ మంత్రి, ఆయన బంధువులకు చెందిన కాలేజీలకే వెళ్లాయి. ముందు సీట్ల పెంపును సర్కారు వ్యతిరేకించడంతో మేనేజ్‌మెంట్లు హైకోర్టును ఆశ్రయించాయి. మేనేజ్‌మెంట్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై జేఎన్టీయూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే.. సర్కారు మాత్రం మేనేజ్‌మెంట్లు కోరిన సీట్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. కాగా, మేనేజ్‌మెంట్లను బట్టి అధికారులు, సర్కారు చర్యలు తీసుకుంటున్నదనే విమర్శలున్నాయి. కొంపల్లి సమీపంలోని దూలపల్లిలో ఓ మంత్రి కాలేజీ ఏకంగా బోగస్ సర్టిఫికెట్లు పెట్టి న్యాక్ గుర్తింపు కోసం అప్లై చేసింది. దీన్ని న్యాక్ అధికారులు గుర్తించి కాలేజీని ఐదేండ్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ లీడర్ కాలేజీ.. క్వశ్చన్ బ్యాంక్ పేరుతో ఏకంగా పేపర్లు లీక్ చేసింది. అయినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఏడేండ్లలో 93 కాలేజీల మూత
రాష్ట్రంలో గత ఏడేండ్లలో 93 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. వీటిలో మెజార్టీవి రూరల్ ఏరియాలోనివే. 2015–16లో 268 కాలేజీలుంటే, ఇప్పడు 175కి తగ్గిపోయాయి. గతంలో హైదరాబాద్ తర్వాత నల్గొండలో అత్యధికంగా 50 వరకు కాలేజీలుండగా.. ఇప్పుడు 11 మిగిలాయి. ఉమ్మడి మహబూబ్నగర్లో గతంలో 11 ఉంటే.. ఇప్పడురెండే ఉన్నాయి. పరిస్థితి ఇలానే రెండు మూడేండ్లు ఉంటే రూరల్ ఏరియాల్లోని దాదాపు 30 కాలేజీలు మూతపడే అవకాశముందని చెప్తున్నారు. సిటీలోని కాలేజీలకు కొత్త సీట్లపై సీలింగ్ పెట్టి, రూరల్ కాలేజీల్లో సీట్లకు డిమాండ్ పెరిగేలా సర్కారు చర్యలు తీసుకోవాలని జిల్లాల్లోని సంస్థల మేనేజ్‌మెంట్లు కోరుతున్నాయి.
ఉద్యోగాలు పోతున్నయ్
లీడర్లు తమ కాలేజీల్లో సీట్లు పెంచుకుని.. చిన్న కాలేజీలను లేకుండా చేస్తున్నరు. దీంతో చాలా కాలేజీలు, బ్రాంచులు మూతపడుతున్నయి. వందల మంది సిబ్బంది రోడ్డున పడుతున్నరు. అన్ని వసతులున్న కాలేజీలను కాపాడాల్సిన బాధ్యత సర్కారు, వర్సిటీ అధికారులదే.
- సంతోశ్ కుమార్, టీఎస్టీసీఈఏ ప్రెసిడెంట్