ఫసల్ బీమాపై ఆశలు

 ఫసల్ బీమాపై ఆశలు
  • ఈ ఏడాది అమలు చేసే యోచనలో ప్రభుత్వం
  • పథకాన్ని నాలుగేండ్ల క్రితమే నిలిపేసిన గత బీఆర్ఎస్ సర్కార్
  • జిల్లాలో ప్రతి ఏటా వానాకాలంలో వేల ఎకరాల్లో పంట నష్టం
  • పరిహారం అందక.. పెట్టుబడికి డబ్బుల్లేక రైతులపై ఆర్థిక భారం
  • కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో రైతుల్లో హర్షం 

ఆదిలాబాద్, వెలుగు : అధిక వర్షాలు, వరదలతో ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ రైతులు మాత్రం పంట నష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదు. 2016 నుంచి 2020 వరకు రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత నిలిపేసింది. ఫలితంగా ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టం జరిగినా బీఆర్​ఎస్​ సర్కారు పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ​ప్రభుత్వం మాత్రం ఈసారి ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. 

పంట బీమాను అమలు చేసి రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. దీంతో పంట పరిహారంపై ఈసారి రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం వంటి వాటిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతాన్ని, రైతులు 5 శాతం ప్రీమియం చెల్లిస్తారు. కానీ ఈసారి మొత్తం ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు నిర్ణయించింది.  

వేల ఎకరాల్లో నష్టం.. పెట్టుబడి కష్టం..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. కానీ పంట నష్టం జరిగితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వక.. అటు కేంద్రం నుంచి వచ్చే పరిహారం వర్తించకపోవడంతో రైతుల మీద అప్పులు, పెట్టుబడి భారం పెరిగిపోతోంది. గత నాలుగేళ్ల నుంచి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి అధికారులు నివేదికలు పంపుతున్నారే తప్ప ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి నిధులు విడుదల కాలేదు. అకాల వర్షాలతో రైతులు గత మూడేండ్లుగా నష్టాలు చవిచూస్తున్నారు.

 గతేడాది దాదాపు 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఫసల్ బీమా పథకం నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో పంటలకు బీమా అనేది లేకుండా పోయింది. అధికారులు నష్టాన్ని నివేదించడమే తప్ప ప్రభుత్వం నుంచి సాయం మాత్రం అందలేదు. విత్తనాల దశ మొదలుకొని మొలకెత్తే వరకు రైతులు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతారు. ఎకరా పత్తికి రూ.25 వేలు ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మొలక దశలో వర్షాల కారణంగా విత్తనాలు మొలకెత్తకపోవడం.. పంట ఎదుగుదల సమయంలో, పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులు ప్రతి ఏటా నష్టపోతున్నారు. దిగుబడి లేక, చేసిన అప్పులు పెరిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బీమాతో రైతుకు ధీమా..

రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పథకం అమలు కోసం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించే క్రాప్ బుకింగ్ పరిగణలోకి తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాస్థాయి వ్యవసాయ శాఖ అధికారులకు పంటల బీమాపై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. రైతులకు ఎలాంటి భారం పడకుండా బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు, బీమా కంపెనీల ఎంపిక, ప్రీమియం నిర్ధారించడం, నిధుల కేటాయింపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక గ్రామంలో ఏ పంట ఎక్కువగా సాగవుతోంది, ఎంత విస్తీర్ణం, వాతావర పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి వంటి వివరాలు తీసుకొని విధివిధానాలు రూపొందించనుంది. 

పంట వివరాలు సిద్ధం చేస్తున్నాం

జిల్లాలో క్రాప్ బుకింగ్ ద్వారా పంట వివరాలు సేకరిస్తున్నాం. ఫసల్ బీమా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేశాం. ఇప్పటికే అన్ని క్లస్టర్ల వ్యవసాయ అధికారులకు బీమాకు సంబంధించిన విధివిధానాలపై శిక్షణ కూడా ఇప్పించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నివేదిక పంపిస్తాం.

పుల్లయ్య, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి