
యాదాద్రి, వెలుగు : చేనేత కార్మికులకు సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రైతుల రుణాలు మాఫీ చేసినట్టుగానే చేనేత కార్మికులు తీసుకున్న రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేసింది. రుణమాఫీకి అర్హత పొందిన కార్మికుల వివరాలను స్టేట్ కమిటీకి జిల్లా కమిటీ పంపించింది.
యాదాద్రిలో 43 సొసైటీలు..
జిల్లాలో 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు మెంబర్లుగా ఉన్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2010 నుంచి 2017 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కార్మికులు మళ్లీ రుణాలు తీసుకున్నారు. అయితే వారి రుణాలను మళ్లీ మాఫీ చేస్తామని చెప్పిన అప్పటి బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీని అమలు చేస్తున్న సమయంలోనే చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
రూ.19.24 కోట్లు రుణమాఫీ..
హయ్యర్ ఆఫీసర్ల ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు రుణాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. దీంతోపాటు తీసుకున్న రుణాలు చెల్లించిన వారి వివరాలను కూడా సేకరించారు. డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని 39 బ్యాంకుల్లో చేనేత కార్మికులు వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్నారు. 1162 మంది కార్మికులు రూ. వ్యక్తిగతంగా లక్షలోపు రూ. 6 కోట్లు తీసుకోగా, రూ.లక్షకు పైగా 1,537 మంది కార్మికులు రూ.24 కోట్లు రుణాలు తీసుకున్నారు.
మొత్తంగా 2,689 మంది కార్మికులు కలిసి రూ.30 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే వీరిలో కొందరు కార్మికులు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించారు. ప్రభుత్వ ఆదేశాలతో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశమై రుణాలు తీసుకున్న వారిలో 2,380 మందిని అర్హులుగా గుర్తించారు. వీరు తీసుకున్న మొత్తంలో రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిలో గతంలో రుణం చెల్లించిన వారు కూడా ఉన్నారని ఆఫీసర్లు తెలిపారు. మొత్తంగా చేనేత కార్మికులకు రూ.19.24 కోట్లను మాఫీ చేస్తున్నట్టు జిల్లా కమిటీ ప్రకటించింది.