పూర్తికాని పాలమూరు ప్రాజెక్టు పనులు .. తొమ్మిది మోటార్లకు ఒక్కటే రెడీ

పూర్తికాని పాలమూరు ప్రాజెక్టు పనులు  .. తొమ్మిది మోటార్లకు ఒక్కటే రెడీ
  • పూర్తికాని పాలమూరు ప్రాజెక్టు పనులు  
  • ఆరు రిజర్వాయర్లలో ఒక్కటే 90% పూర్తి  
  • కాలువలు, టన్నెల్ వర్క్స్ పెండింగ్  
  • కొన్ని పనులకు ఇంకా టెండర్లే పిలవలే 

నాగర్​కర్నూల్/మహబూబ్​నగర్, వెలుగు :  పనులు పూర్తి కాకముందే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. నార్లాపూర్ లో తొమ్మిది మోటార్లకు ఒక్కటే రెడీ అయింది. నార్లాపూర్​ ఇన్​ టేక్​ వద్ద ఆ ఒక్క మోటార్ నే ఆన్ చేసి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తున్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో నిర్మిస్తున్న నార్లాపూర్​రిజర్వాయర్​పనులు ఇంకా 30శాతం పెండింగ్​లో ఉన్నాయి.  శ్రీశైలం బ్యాక్​వాటర్ ఆధారంగా నార్లాపూర్​పంప్​హౌస్​నుంచి నీటిని ఎత్తిపోయాలి. ఇక్కడ తొమ్మిది మోటార్లు (ఒక్కొక్కటి 145 మెగావాట్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఒక్కటే సిద్ధం చేశారు. ఈ మోటారునే ఈ నెల16న సీఎం కేసీఆర్ ఆన్ చేయనున్నారు.

మోటార్ ఆన్​చేసిన తర్వాత రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి నీటిని లిఫ్ట్​ చేస్తారు. అక్కడి నుంచి మెయిన్​ కెనాల్ ద్వారా ఏదులకు నీటిని తరలించాల్సి ఉంది. కానీ, మధ్యలో మెయిన్​ కాలువ పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఏదుల వద్ద లిఫ్ట్​, పంప్​హౌస్​ పనులు దాదాపు పూర్తి కాగా.. పునరావాసం పనులు పెండింగ్​లో ఉన్నాయి. ఏదుల నుంచి వట్టెం మెయిన్ కెనాల్, వట్టెం రిజర్వాయర్, పంప్​హౌస్, కర్వెన మెయిన్​కెనాల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కర్వెన నుంచి ఉదండాపూర్​ రిజర్వాయర్ వరకు 18 కిలోమీటర్ల మేర అండర్​ టన్నెల్​ పనులు చేయాల్సి ఉండగా, కొంత దూరం మాత్రమే పూర్తి చేశారు.

ఈ రిజర్వాయర్ కింద 16వ ప్యాకేజీలో పంప్​హౌస్​ పనులు పెండింగ్​లో ఉన్నాయి. 17, 18వ ప్యాకేజీలలో ఇప్పటి వరకు కట్టపనులు 15 శాతమే పూర్తయ్యాయి. 18వ ప్యాకేజీలో రెండున్నర కిలోమీటర్ల మేర చేయాల్సిన కట్ట పనులు నెలన్నర కింద ప్రారంభించారు. 18వ ప్యాకేజీలో నిర్మించాల్సిన మెయిన్​ కెనాల్స్​ను ఇటీవల ప్రారంభించారు. 400 కేవీ టవర్​ లైన్స్, సబ్​స్టేషన్లు, స్విచ్​యార్డ్​ పనులు అన్నీ స్కీంల వద్ద 40 శాతానికి మించి జరగలేదు.  లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ పనులకు టెండర్లు పిలవాల్సి ఉండగా పక్కకు పెట్టారు. మరో మూడు ప్యాకేజీల పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. 

8 ఏండ్లలో 60 శాతం పనులు.. 

2019లో సవరించిన అంచనాలను పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్ట్​పనులను ఐదేళ్లలోపు పూర్తి చేయడానికి ఏడాదికి రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్న అంచనాకు వచ్చారు. గతంలో రూ.35,200 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వగా, అదనంగా మరో రూ. 16,856.31 కోట్లు పెంచారు. పవర్​ ఫైనాన్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ నుంచి తీసుకున్న రుణాన్ని పెరిగిన అంచనా వ్యయంలో కలిపి రూ.52,056.31 కోట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్పట్లో జారీ చేసిన జీఓ- 321లో స్పష్టంగా పేర్కొన్నారు . అయితే, అంచనా వ్య యం పెరుగుతుంటే బడ్జెట్​కేటాయింపులు, నిధుల విడుదల తగ్గడంతో ఎనిమిదేండ్లు దాటినా 60 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 

నిర్వాసితులకు పరిహారం చెల్లించలే.. 

భూసేకరణ పరిహారం చెల్లింపులు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు పెండింగ్​లో ఉన్నాయి.​ నార్లాపూర్, ఉదండాపూర్​ రిజర్వాయర్ల కింద దాదాపు 650 ఎకరాల భూసేకరణ మిగిలిపోయింది. ఈ భూములకు సంబంధించి దాదాపు 120 మంది రైతులు 2013 చట్టం ప్రకారం కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్​ చేస్తున్నారు. నార్లాపూర్​కింద అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండాల్లో 110 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. వీరికి ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీని వర్తింపజేయలేదు. ఉదండాపూర్ కింద వల్లూరు, ఉదండాపూర్, రేగడివట్టితండా, మాటుబండతండా, గొల్లోనిదొద్దడి తండా, తుమ్మలబండ తండా,

సాధుగుడిసెల తండాల్లో మూడు వేల మందికి పైగానే నిర్వాసితులను గుర్తించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం భూసేకరణ చేసినా, ప్లాట్లు చేసి ఇళ్లను కట్టివ్వలేదు. స్వయంగా కేసీఆర్​స్విచ్ ఆన్​చేస్తే నీళ్లు పోయనున్న నార్లాపూర్​రిజర్వాయర్​కింద ముంపు బాధితులు ఇప్పటికీ ఖాళీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పాలమూరు స్కీంను ప్రారంభిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.