కొందరి అకౌంట్లలో రూపాయీ పడలే

కొందరి అకౌంట్లలో రూపాయీ పడలే
  • దళితబంధు పైసలేవీ
  • యూనిట్ల గ్రౌండింగ్ కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
  • తొలి విడతలో 9 వేల మందికిపైగా ఖాతాల్లో రూ.లక్షన్నరలోపే జమ
  • మిగతా ఫండ్స్ రిలీజ్ చేయని సర్కారు
  • కొందరి అకౌంట్లలో రూపాయీ పడలే
  • షాపులు, షెడ్లకు కిరాయి 
  • కట్టలేక లబ్ధిదారుల అవస్థలు
  • ప్రజావాణిలో కలెక్టర్ల వద్ద నిరసనలు
  • రూ.550 కోట్లు ఇస్తేనే 
  • మొదటి విడత గ్రౌండింగ్ పూర్తి
  • రెండో విడతకు మరో రూ. 6 వేల కోట్లు అవసరం

వెలుగు, నెట్​వర్క్​: ‘‘దళితబంధు కింద లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి రూ.పది లక్షలు వేస్తం.. వాటితో మీకు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు’’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు, ఫీల్డ్​లెవల్‌‌లో వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. సర్కారు నుంచి సరిపడా ఫండ్స్ రాకపోవడంతో దళితుల ఖాతాల్లో ఒకేసారి పది లక్షలు వేయడం లేదు. అకౌంట్లలో రూ.లక్ష నుంచి లక్షన్నర లోపే పడుతుండగా, ఆ పైసలతో యూనిట్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయలేక, లబ్ధిదారులకు సమాధానం చెప్పలేక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల ఎంపిక చేసిన లబ్ధిదారుల అకౌంట్లలో ఒక్క రూపాయీ పడలేదు. లబ్ధిదారుల అకౌంట్లలో పైసలు పడాలంటే రెంటల్ అగ్రిమెంట్లు ఉండాలని అధికారులు షరతు పెట్టారు. దీంతో పలువురు పెద్దమొత్తంలో డిపాజిట్లు కట్టి షాపులు అద్దెకు తీసుకున్నారు. కానీ సర్కారు నుంచి ఫండ్స్ రాకపోవడంతో నెలనెలా అప్పులు తెచ్చి షాపుల కిరాయిలు కడ్తున్నారు. డెయిరీ, గొర్రెల యూనిట్ల కోసం అప్లై చేసుకున్న లబ్ధిదారులు షెడ్లు నిర్మించుకొని, చుట్టూ మేత గడ్డి కూడా పెంచుతున్నారు. ఇటీవలి వానలకు గడ్డి నిలువెత్తు పెరిగినా బర్రెలు, గొర్రెలు రాకపోవడంతో ప్రజావాణికి వచ్చి కలెక్టర్లను అడుగుతున్నారు.

రాష్ట్ర సర్కారు గతేడాది హుజూరాబాద్‌‌‌‌ ఉప ఎన్నికల సందర్భంగా దళితబంధు స్కీం ప్రకటించింది. మొదటి విడతలో హుజూరాబాద్‌‌‌‌తో పాటు మరో నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో, 118 నియోజకవర్గాలకు 100 మంది చొప్పున కలిపి 40 వేల మందికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఇప్పటిదాకా అధికారికంగా 31 వేల యూనిట్ల గ్రౌండింగ్‌‌‌‌ పూర్తయింది. మిగిలిన 9 వేల యూనిట్లకు సంబంధించి లబ్ధిదారుల అకౌంట్లలో కొందరికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర లోపే జమచేయగా, ఇంకొందరికి పైసా కూడా పడలేదు. దళితబంధు కింద ఎక్కువ మంది ట్రాక్టర్లు, ట్రాన్స్​పోర్ట్ వెహికల్స్‌‌‌‌తో పాటు డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లు, కిరాణా, మెడికల్​షాపులు, సర్వీస్, సప్లై పాయింట్లు పెట్టుకున్నారు. అకౌంట్లలో లక్ష, లక్షన్నర పడగానే ఆఫీసర్ల సూచనలతో డెయిరీ, పౌల్ట్రీ లాంటి యూనిట్ల లబ్ధిదారులు షెడ్లు వేసుకోగా, కిరాణా, మెడికల్​షాపులు, సర్వీస్, సప్లై పాయింట్లకు శాంక్షన్ పొందిన వారు షాపులను అద్దెకు తీసుకున్నారు. వీటి కోసం అప్పులు తెచ్చి మరీ డిపాజిట్లు కట్టారు. ఖాళీ షాపులకు ప్రతి నెల జేబులోంచి కిరాయిలు​కడ్తున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున దళితబంధు అమలుచేసేందుకు ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. కానీ నిధుల లేమితో ఈ లక్ష్యాన్ని 500 మందికి కుదించింది. 2021 -–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ. 550 కోట్లు పైగా నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇవికాక నియోజకవర్గానికి 500 మంది చొప్పున అంటే మరో రూ. 6 వేల కోట్లు అవసరం. ఈ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్లే జిల్లాల్లో యూనిట్ల గ్రౌండింగ్ ​ఆగిపోతున్నది.

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి

సిద్దిపేట జిల్లాలో దళితబంధు కింద 65 మంది డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకుని షెడ్లు నిర్మించుకున్నారు. కానీ ఇందులో ఎవరికీ పశువులు అందలేదు. కరీంనగర్ జిల్లాలో పైలట్​ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,286 యూనిట్లకు.. ఇంకా1,836 గ్రౌండింగ్ కావాల్సి ఉంది. యాదాద్రి  జిల్లాలో 338 మందికి దళిత బంధు మంజూరు కాగా.. 50 యూనిట్లు గ్రౌండింగ్​ చేయలేదు. డెయిరీ యూనిట్లు ఎంచుకున్న 20 మంది షెడ్లు నిర్మించుకున్నా పశువులను పంపిణీ చేయలేదు. పెద్దపల్లి జిల్లాలో 268 మందికి  దళిత బంధు మంజూరుకాగా.. 148 యూనిట్లే గ్రౌండింగ్ అయ్యాయి. వివిధ షాపులు ఎంపిక చేసుకున్న 84 మందికి నెలనెలా రెంట్లు మీదపడ్తున్నాయి. డెయిరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న 12 మంది.. పశువుల కోసం ఎదురుచూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నిజాంసాగర్ మండలంలో 1,298 మందిని ఎంపిక చేయగా, డెయిరీ యూనిట్లు ఎంచుకున్న వారిలో 400 మంది పశువుల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలంలో డెయిరీ యూనిట్లు తీసుకున్న 369 మందిలో చాలా మంది సొంత డబ్బులు పెట్టి షెడ్లు కట్టించుకున్నారు. ఇందుకు దాదాపు ఒక్కొక్కరూ రూ.1.50 లక్ష వరకు ఖర్చు చేశామని, షెడ్లు వేసుకుని 3 నెలలు దాటినా ఇంతవరకు బర్రెలు పంపిణీ చేయలేదని వాపోతున్నారు. తమ అకౌంట్లలో రూ.1.45 లక్షలు చొప్పున జమ అయినా.. రశీదులు తేస్తే షెడ్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులకు అప్రూవల్ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీసర్లు తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,462 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. కేవలం 1,052 యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన యూనిట్ల గ్రౌండింగ్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడ 571 మంది బర్రెల యూనిట్లు సెలక్ట్ చేసుకోగా 101 మందికి తొలి విడత పంపిణీ చేశారు. మిగిలినవాళ్లంతా గడ్డి పెంచి, షెడ్లు వేసుకొని యూనిట్ల కోసం 
ఎదురుచూస్తున్నారు.

షెడ్డు సుట్టూ గడ్డి పెరిగె.. గొర్లు రాకపాయె

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేటలో గొర్ల కోసం దళితబంధు లబ్ధిదారు చల్లూరి సత్తయ్య వేసుకున్న షెడ్డు ఇది. మూడు నెలల కిందట ఈయనకు దళితబంధు మంజూరైంది. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.లక్షా 32 వేలు మాత్రమే జమ చేశారు. అధికారుల సూచన మేరకు ఈ డబ్బుతో షెడ్డు ఏర్పాటు చేసుకున్నాడు. మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి మిగతా డబ్బు రాలేదు. అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. షెడ్డు సుట్టూ గడ్డి పెరిగిపోయిందని, పైసలు ఎప్పుడు పడ్తాయో, గొర్లు ఎప్పుడు ఇస్తారోనని సత్తయ్య ఆందోళన చెందుతున్నాడు.

కిరాయి పైసలకు కష్టమైతంది

దళితబంధు కింద చెప్పుల షాప్ కోసం దరఖాస్తు చేసుకున్న. కొటేషన్ ఇచ్చి మూడు నెలలు ఐతాంది. ఆఫీసర్లు చెప్పిన్రని జమ్మికుంటలోని కొత్తపల్లిలో షట్టర్ రూమ్ కిరాయి తీసుకున్న. ఇప్పటి వరకు పైసలు రాలే. షట్టర్​ ఓనర్ కిరాయికి ఆగుత లేడు. ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి యాష్టకొస్తాంది. 
-
శనిగరపు నర్సమ్మ, కనగర్తి, కరీంనగర్ జిల్లా

ఎప్పుడిస్తరో.. ఏమో..

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేశారు. జూపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల చిన్న యాదయ్య, అంకిల్ల నారాయణ అనే ఇద్దరు డయిరీ యూనిట్ పెట్టుకున్నారు. రూ.1.50 లక్షలు పెట్టి షెడ్ వేసుకున్నారు. కానీ వీరి బ్యాంక్ అకౌంట్‌‌‌‌లో రూ.1.45 లక్షలు మాత్రమే పడ్డాయి. మిగిలిన పైసలు ఇవ్వకపోవడంతో బర్రెలు కొనలేకపోతున్నారు. మూడు నెలల నుంచి జిల్లా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడపడం తప్ప ఎప్పుడిస్తారో తెలియడం లేదని అంకిల్ల చిన్న యాదయ్య వాపోయాడు. 

మళ్లీ నౌకరీకి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన దుప్పల్లి విజయ్.. హైదరాబాద్‌‌‌‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. దళితబంధు స్కీమ్ కింద ఎంపిక కావడం, కంప్యూటర్ మీద అవగాహన ఉండడంతో జాబ్ బంద్ పెట్టి.. ఊరిలో సీఎస్ సీ (కామన్ సర్వీస్ సెంటర్) పెట్టుకునేందుకు అప్లయ్ చేసుకున్నాడు. ఊల్లోనే ఓ షాప్‌‌‌‌ను అద్దెకు తీసుకొని, రెంటల్ అగ్రిమెంట్ పూర్తి చేసి ఆఫీసర్లకు అందించాడు. మొదటి విడతలో మే 17న రూ.1.5 లక్షలను అకౌంట్‌‌‌‌లో జమచేశారు. ఐదు నెలలు గడిచినా మిగిలిన అమౌంట్ రాకపోవడంతో నెలనెలా అద్దె కట్టలేక విజయ్​షాప్ ఖాళీ చేశాడు. గత నెల హైదరాబాద్ వెళ్లి తిరిగి పాత జాబ్‌‌‌‌లోనే జాయిన్ అయ్యాడు.