బాకీలు సర్కారువీ.. భారం ప్రజలపై

బాకీలు సర్కారువీ.. భారం ప్రజలపై
  • సదరన్​కు 44వేల కోట్లు, నార్తర్న్​కు రూ.20వేల కోట్లు
  • 2014 నాటికి బకాయి 1200 కోట్లే
  • రాష్ట్రంలో 30 % కరెంటు వాడుకుంటున్న ప్రభుత్వ సంస్థలు
  • ఎనిమిదిన్నరేండ్లుగా రూపాయి చెల్లించకపోవడంతో నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: వేల కోట్ల బాకీలు చెల్లించకుండా డిస్కంలను రాష్ట్ర సర్కార్ నట్టేట ముంచుతున్నది. రాష్ట్రంలో సరఫరా అయ్యే కరెంటులో 30% వాడుకుంటున్న ప్రభుత్వ సంస్థలు బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 64 వేల కోట్ల రూపాయలు బాకీలు చెల్లించపోవడంతో రెండు డిస్కంలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో అవసరాలకు తగినంత విద్యుత్​ ఉత్పత్తి లేకపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టి కరెంటు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం డిస్కంలు రూ.వేలకోట్లు అప్పులు తీసుకుంటున్నాయి. ఆఖరుకు ఉద్యోగుల జీతాల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి లోపాలు బయటపడకుండా ఉండేందుకే డిస్కంలు లెక్కలు బయటపెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్‌‌ కేంద్రంగా ఉన్న సదరన్ తెలంగాణ విద్యుత్‌‌ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)కు రాష్ట్ర విభజన నాటికి సర్కారు శాఖల బాకీలు దాదాపు రూ.820 కోట్లు మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారిపోయింది. సదరన్‌‌ డిస్కంలో 2014–15 నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బాకీలు దాదాపు రూ.62 వేల కోట్లకు చేరినట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా కేవలం రూ.18వేల కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇంకా ప్రభుత్వ శాఖల నుంచి రూ.44 వేల కోట్లకు పైగా పాత బాకీలు రావల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద పలువురు కోరినా దరఖాస్తులు తిరస్కరిస్తూ వస్తోంది. డిస్కం లెక్కలు బయటపెడితే సర్కారు బండారం బయటపడుతుందనే ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నార్తర్న్‌‌లో సర్కారు బాకీ రూ.20,478 కోట్లు

రాష్ట్ర విభజన (2014 జూన్ 2) నాటికి వరంగల్‌‌ కేంద్రంగా ఉన్న నార్తర్న్‌‌ డిస్కం (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ప్రభుత్వ శాఖల బాకీలు రూ.418.74 కోట్లు. బిల్లులు కట్టక పేరుకుపోవడంతో 2022 జూన్ నాటికి బాకీలు మొత్తం రూ.28,797.11 కోట్లకు పెరిగాయి. దీనిలో సర్కారు రూ.8,318.35 కోట్లు మాత్రమే ఉత్తర తెలంగాణ డిస్కంకు చెల్లించింది. మిగిలిన రూ.20,478.76 కోట్ల బాకీ ఇంకా చెల్లించకుండా అట్లనే పెండింగ్‌‌ లో ఉన్నది.

ఈఆర్​సీ మొక్కుబడి ఆదేశాలు

విద్యుత్‌‌ సంస్థలు టెక్నికల్‌‌గా ఏఆర్ఆర్‌‌ రిపోర్టులో ఒక్క సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల బాకీలు మాత్రమే వెల్లడిస్తున్నాయి. పాత బాకీల వివరాలు బయట పెట్టడం లేదు. ఈఆర్‌‌సీ బహిరంగ విచారణల్లో ఇదే అంశాన్ని నిపుణులు ప్రస్తావించినా ఫలితం లేకుండా పోతుంది. ఈఆర్‌‌సీ మొక్కుబడిగా సర్కారు బాకీలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. దీంతో సర్కారు డిస్కంలకు అతిపెద్ద డిఫాల్టర్‌‌ గా మారిపోయింది. ఆ ఆర్థిక భారమంతా తిరిగి ప్రజలపైనే పడుతున్నది.

బిల్లులు కట్టని ప్రభుత్వ సంస్థలు

వినియోగదారుడు ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే డిస్కంలు కనెక్షన్ కట్ చేసి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలు, డిపార్ట్‌‌మెంట్‌‌లు ఇష్టం వచ్చినట్టు కరెంటు వాడుకొని ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా డిఫాల్టర్‌‌గా మారుతున్నా అడిగే ధైర్యం చేయడం లేదు. ఆ నష్టాలను కూడా ఏటా జనాలపై బాదుతున్నారు. రాష్ట్రంలోని రెండు డిస్కంలకు ప్రభుత్వ శాఖల నుంచి దాదాపు రూ.64,478.75 కోట్ల బాకీలు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బాకీలు గవర్నమెంట్‌‌ చెల్లిస్తే డిస్కంలకు నష్టాలు ఉండవు. రాష్ట్రంలో వాడే కరెంటులో 30% సర్కారు సంస్థలు, సంక్షేమ పథకాలకు వాడుకుంటోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇరిగేషన్, వాటర్ వర్క్స్, హెల్త్, ఎడ్యుకేషన్ సహా పలు శాఖలు ఉన్నాయి. 27.62 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌‌, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌‌, 250 యూనిట్ల వరకు హెయిర్‌‌ కటింగ్‌‌ సెలూన్‌‌లకు, రజకులకు ఉచిత విద్యుత్‌‌ అందిస్తున్నారు. పౌల్ట్రీ, పవర్‌‌ లూమ్స్‌‌, స్పిన్నింగ్‌‌ మిల్లులకు యూనిట్‌‌కు రూ.2 సబ్సిడీతో కరెంటు అందిస్తోంది. వీటి కోసం సర్కారు చెల్లిస్తున్న దానికి, వాస్తవ కరెంటు వాడకానికి మధ్య భారీ తేడా ఉంటోంది. అంచనా వేసి డబ్బు ఇవ్వడమే తప్ప, కనెక్షన్లు, వాడకానికి తగ్గట్టు లెక్కగట్టి సబ్సిడీ పైసలు ఇవ్వట్లేదు. ఎక్కడా పక్కా లెక్కలు లేవు. దీనిపై ప్రభుత్వాన్ని విద్యుత్‌‌ సంస్థల పెద్దలు అడిగే ధైర్యం చేయడం లేదు. దీంతో వేల కోట్ల బాకీలు పేరుకుపోతుండంతో ప్రజలే ఆర్థిక దోపిడీకి గురవుతున్నారు.

నార్తర్న్‌‌ డిస్కం పరిధిలోని సర్కారు సంస్థల బాకీలు(రూ.కోట్లలో)

(2013-14 నుంచి 2022 జూన్ వరకు)

ప్రభుత్వ శాఖ బాకీల మొత్తం
మైనర్ పంచాయతీ–3,882.86
మేజర్ పంచాయతీ–1,491.95
మున్సిపాల్టీలు–717.62
కార్పొరేషన్లు–212 .23
ఇరిగేషన్ అండ్ కమాండ్​ ఏరియా డెవలప్​మెంట్–5,186.42
హెచ్ఎమ్ఎబ్ల్యూఎస్–1,392.84
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం–15,462.49
హెూం శాఖ–81.01
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్–73.52
 రెవెన్యూ విభాగం–78.36
 హయ్యర్ ఎడ్యుకేషన్–31.58
 సోషల్ వెల్ఫేర్–10.79
 బీసీ వెల్ఫేర్–2.97
 స్కూల్ ఎడ్యుకేషన్–134.15
 ట్రైబల్ వెల్ఫేర్–32.49
 పశుసంవర్ధక శాఖ–3.55
పర్యాటక శాఖ–0.70
మార్కెట్ కమిటీ–1.58
మొత్తం–28797.11
ప్రభుత్వం చెల్లించింది–8,318.35
ఇంకా చెల్లించాల్సింది–20,478.76