సంక్షేమానికి గ్యారంటీ.. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు బడ్జెట్​లో పెద్దపీట

సంక్షేమానికి గ్యారంటీ.. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు బడ్జెట్​లో పెద్దపీట

హామీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం తన తొలి బడ్జెట్​ను ముందుకు తెచ్చింది. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తమది గ్యారంటీ అని ప్రకటించింది. అభయహస్తంలోని ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేసింది. ‘కొందరి కోసం మాత్రమే అందరు’ అనే నిరంకుశ విధానాలు ఇక ఉండవని, ‘అందరి కోసం మనందరం’ అనే స్ఫూర్తితో తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరుస్తామని తెలిపింది. గత పాలకులు అప్పజెప్పిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని, అక్రమాలపై విచారణ జరిపిస్తామని వెల్లడించింది. తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయమని తెలిపింది. ఇచ్చిన మాట ప్రకారం జాబ్​ క్యాలెండర్​ అమలు చేస్తామని, నిరుద్యోగుల కలలు సాకారం చేస్తామని చెప్పింది. 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఓటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడ్జెట్​ను శనివారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకునేలా కేటాయింపులు చేశారు. సంక్షేమ శాఖలకు నిధులు పెంచారు. విద్య, పంచాయతీరాజ్, విద్యుత్, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టినప్పటికీ ఆరు గ్యారంటీలకు తగిన నిధులను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వ బడ్జెట్ల మాదిరి నేల విడిచి సాము చేయకుండా ఓ పద్ధతి ప్రకారం కేటాయింపులు చేస్తున్నామని, వాస్తవ పద్దును రూపొందించామని తెలిపింది. మొత్తం రూ.2,75,891 కోట్ల ఈ బడ్జెట్​లో ఆరు గ్యారంటీల అమలుకే రూ. 53,196 కోట్లను అంటే.. 26 శాతం నిధులు వినియోగించనుంది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువవికాసం హామీల అమలుకు విధివిధానాలు రూపొందించుకున్న తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్​లో మళ్లీ తగిన మేర కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అన్నింటి రూ.40,080 కోట్లు కేటాయించింది. విద్యుత్​ రంగానికి, సాగునీటి శాఖకు, విద్యాశాఖకు ఇంతకుముందు కంటే నిధుల కేటాయింపులు ఎక్కువ చేసింది. వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్ల నుంచి ఉపాధి కల్పించే సబ్సిడీ స్కీములకు  బడ్జెట్​లో ప్రయారిటీ ఇచ్చింది. ఎస్సీ సంక్షేమం కింద రూ.21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం కింద రూ.13,013 కోట్లు చూపించింది. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్​ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. 

నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటం ఆడిందని, ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తమదని ప్రకటించింది. 

ఏప్రిల్​ నుంచి చేయూత పెన్షన్లు

గ్యారంటీలు ఏ శాఖ కింద అమలవుతున్నాయో ఆయా శాఖలకు నిధులు పెరిగాయి. మొన్నటి దాకా ఆసరా కింద ఇచ్చిన పెన్షన్లు ఏప్రిల్​ నుంచి చేయూత కింద పెన్షన్ల అమౌంట్​ను పెంచి అందించనున్నారు. వృద్ధులు, గీత కార్మికులు, డయాలిసిస్, పైలేరియా, ఎయిడ్స్​ బాధితులు, బీడీ కార్మికులు, బీడీ టేకేదార్లు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులకు రూ.4 వేల పెన్షన్​.. దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్​ను అందించనున్నట్లు బడ్జెట్​లో ప్రభుత్వం ప్రకటించింది. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్​అందించేందుకు రూ.2418 కోట్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రూ.7,740 కోట్లు బడ్జెట్​లో  కేటాయించింది. విద్యా రంగానికి 21,389 కోట్లు ప్రతిపాదించింది. మహాలక్ష్మీ స్కీం కింద ఆర్టీసీకి ప్రతినెలా రూ.300 కోట్లు చెల్లించేలా నిధులు పెట్టింది. ‘ధరణి.. కొంతమందికి భరణంగా, మరికొంత మందికి ఆభరణంగా.. చాలా మందికి భారంగా మారింది” అని, ధరణి పేరిట గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది తిప్పలు పడ్డారని, ధరణి సమస్యలను పరిష్కరించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. ‘‘కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే గత ప్రభుత్వ విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాల అవకతవకలపై విచారణ జరిపిస్తమని ప్రజలకు మాట ఇచ్చినం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది” అని వెల్లడించింది.

తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాల కోసం ఆత్మార్పణ చేశారో.. వారి ఆశయాలను సాధించేందుకు, వారి కలలను సాకారం చేసేందుకు ఏమాత్రం వెనుకాడం. ఇది మనస్సాక్షిగా చెప్తున్న మాట. ముఖ్యమంత్రి, నా సహచర మంత్రివర్గ సభ్యుల మాట. గత పాలకుల నిర్వాకంతో మన ధనిక రాష్ట్రానికి కూడా ఆర్థిక కష్టాలు వచ్చినయ్​. పూట గడవడం కష్టం అనేంత స్థాయికి ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన్రు. అయినా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ ప్రజాప్రభుత్వం ఎంతటి సాహసాన్నయినా చేస్తుంది.. ఎంతటి కష్టాన్నయినా భరిస్తుంది. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుపకంచెలు తొలగించడంతో మొదలైన ప్రజాపాలనను మరింత పటిష్టంగా ముందుకు సాగిస్తం.    
 

- బడ్జెట్​ స్పీచ్​లో భట్టి విక్రమార్క