పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ .. అందుబాటులో ఎన్నికల సామగ్రి

పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ .. అందుబాటులో ఎన్నికల సామగ్రి
  • వార్డుల వారీగా ఓటరు లిస్టు, బ్యాలెట్​ పేపర్లు సిద్ధం

మహబూబ్​నగర్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  రానున్న జూన్​ లేదా జులైలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది.  అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనుకున్నా..  ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు.  ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసుకున్నారు.  వాస్తవానికి గతేడాది లేదా..  ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా..  అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి.  ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం ముగిసి కూడా దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఒకటి, రెండు నెలల్లో కచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే చాన్స్​ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నామినేషన్​ ఫారాల నుంచి అన్ని పేపర్లు సిద్ధం 

పంచాయతీ ఎలక్షన్​లకు సంబంధించిన ఆఫీసర్లు అన్ని రకాల పేపర్లను సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో బ్యాలెట్​ పేపర్ల ముద్రణకు సంబంధించిన టెండర్లు పిలవగా.. టెండర్​ దక్కించుకున్న ప్రింటింగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  నిర్వాహకులు ముద్రణ పూర్తి చేశారు. ప్రస్తుతం ముంద్రించిన బ్యాలెట్​ పేపర్లను ఆఫీసర్లు భద్రపరిచారు. ఎన్నికల షెడ్యూల్​ వచ్చాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్​ స్టేషన్​ల వారీగా వీటిని డిస్ర్టిబ్యూషన్​ చేయనున్నారు. ఎలక్షన్​కు సంబంధించిన మెటీరియల్​  రెడీగా ఉంచారు. వార్డుల వారీగా పోలింగ్​స్టేషన్​ల జాబితా ఫైనల్​ అయిపోయింది. ఫైనల్​ ఓటరు జాబితా పంచాయతీ బోర్డులపై అతికించారు. 

నోడల్​ ఆఫీసర్ల నియామకం పూర్తి

గత మార్చి లేదా ఏప్రిల్​లో పంచాయతీ ఎన్నికలు జరిగే చాన్స్​ ఉన్నట్లు ప్రచారం జరగడంతో జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలకు నోడల్​ ఆఫీసర్ల నియామకాన్ని ఫిబ్రవరిలోనే పూర్తి చేశారు.  మ్యాన్ పవర్ మేనేజ్​మెంట్, బ్యాలెట్ బాక్స్ మేనేజ్​మెంట్, రవాణా, శిక్షణ, సామగ్రి మేనేజ్​మెంట్​, ఎంసీఎంసీ మేనేజ్​మెంట్​, ఎక్స్పెండీచర్ అకౌంట్స్,  ఎక్స్పెండీచర్ మానిటరింగ్ మేనేజ్​మెంట్​, ఎన్నికల పరిశీలకులు, బ్యాలెట్ పేపర్ మేనేజ్​మెంట్​, మీడియా మేనేజ్​మెంట్​, హెల్ప్ లైన్ గ్రీవెన్స్, రిపోర్ట్స్ రిటన్స్ మేనేజ్​మెంట్​ అని 12 విభాగాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగానికో ఒక్కో జిల్లా ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు.  ఇందులో డీపీవో, డీపీఆర్​వో, డీటీవో, డీఈవో, డీఆర్​డీవో తదితరులు
 ఉన్నారు.

ఎన్నికలకు సిద్ధం..

 ఇటీవల గ్రామ పంచాయతీలకు పెండింగ్​ బిల్లులను క్లియర్​ చేయగా.. మరికొన్ని బిల్లులను త్వరలో క్లియర్​ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్​ రెడ్డి వన్​ టు వన్​గా మాట్లాడుతుండడం  ఇందుకు బలం చేకూరుస్తున్నది. జూన్​ 2వ తేదీ నుంచి రాజీవ్​ యువ వికాసం స్కీం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద ఆర్థిక సాయం అందించడం.. అదే రోజు నుంచి భూ భారతి స్కీంను రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనుండటం భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 ఇటీవల కుల గణన సర్వే పూర్తి 

 ఇప్పటికే జీపీలలో ఓటరు జాబితాను అతికించారు. పంచాయతీ సిబ్బంది వార్డుల వారీగా ఓటరు జాబితాను తీస్తున్నారు. అయితే రిజర్వేషన్​ ఆధారంగా ఓటరు జాబితాను రెడీ చేయాలని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రిజర్వేషన్​ ఆధారంగా వార్డుల వారీగా లిస్టును తయారు ద్వారా ఆ పంచాయతీని ఏ కేటగిరీకి రిజర్వ్​ చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.