ఇవాళ్టి నుంచి బండ్లకు టీజీ రిజిస్ట్రేషన్

ఇవాళ్టి నుంచి బండ్లకు టీజీ రిజిస్ట్రేషన్
  •  గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కింది
  • ఆర్టీసీలో 3వేల కొత్త ఉద్యోగులను నియమిస్తామని వెల్లడి
  • ఇయ్యాల్టి నుంచి బండ్లకు టీజీతో రిజిస్ట్రేషన్ 

హనుమకొండ/ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: టీజీ అన్న పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందని.. ఉద్యమం టైమ్​లో ఏపీ పేరుతో ఉన్న బండ్ల నెంబర్ ప్లేట్లన్ని టీజీగా మార్చుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత టీజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం జూన్ 2న గెజిట్ ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని టీఎస్ గా మార్చిందన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు.

 ఇయ్యాల్టి నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి బండి ఇక టీజీ పేరుతోనే రిజిస్ట్రేషన్ అవుతుందని అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి, కాంగ్రెస్ ప్రభుత్వం టీజీగా మార్చాల్సిందిగా కేబినెట్​తో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా టీఎస్ స్థానంలో టీజీగా మారుస్తూ గెజిట్ విడుదల చేసినట్లు వెల్లడించారు. ఇది పార్టీ పరంగానో, వ్యక్తిగతంగానో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ఇదివరకు నెంబర్లు బుక్ చేసిన వాళ్లకు 15 రోజుల్లో తగిన విధంగా మార్పులు చేస్తామని, ఇన్నాళ్లు టీఎస్​తో రిజిస్ట్రేషన్ జరిగిన బండ్ల నెంబర్లు మాత్రం అలాగే ఉంటాయన్నారు.

 తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. గత ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని నిర్వీర్యం చేసిందని, జీవోలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తరువాత ఆర్టీసీ కళకళలాడుతోందని, రూపాయి నష్టం లేకుండా సంస్థ నడుస్తోందన్నారు. అందుకు అనుగుణంగా కొత్తగా మూడు వేల మంది ఉద్యోగులను నియమించి ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్నారు.

వర్షాలు లేకనే నీళ్లకు ఇబ్బంది

గత సెప్టెంబర్ నెలలో సరైన వర్షాలు పడలేదని, అందుకే నీళ్లకు ఇబ్బంది అవుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు మాత్రం కాంగ్రెస్ తోనే కరువు వచ్చిందన్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని, వర్షాలు లేనప్పుడు ఎవరైనా ఏమీ చేయలేరన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూస్తానన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పొన్నం అన్నారు. కోటి మంది మహిళలకు వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాలను ఇప్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజల్లో పూర్తి స్థాయి విశ్వాసం సంపాదించామని, ఆ భరోసాతో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించి, క్లీన్ స్వీప్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్​కు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, నిర్వాసితులపై గత ప్రభుత్వం పోలీస్​బలం ప్రయోగించినట్లు కాకుండా.. చర్చించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్కతుర్తి ప్రాంతానికి ఎస్సారెస్పీతో పాటు దేవాదుల నీటిని అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్​, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.