గుండెపోట్లు రాష్ట్రంలోనే ఎక్కువ

గుండెపోట్లు రాష్ట్రంలోనే ఎక్కువ

దేశంలో హార్ట్, లంగ్స్ సంబంధిత మరణాలు మన దగ్గరే అధికం
ఏజ్​తో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్  
సీపీఆర్ చేస్తే.. పది మందిలో ఐదుగురిని కాపాడొచ్చు  
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో లక్ష మందికి సీపీఆర్ ట్రైనింగ్
రాష్ట్రంలో ఈ రెండు సమస్యలతో మృతి చెందినవారు 96,982
రాష్ట్రంలో మొత్తం డెత్స్​లో హార్ట్, లంగ్స్ మరణాలు
జాతీయ స్థాయిలో సగటు మరణాలు 32%
మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ రిపోర్ట్-2022

హైదరాబాద్, వెలుగు : దేశంలో గుండె, ఊపిరితిత్తుల సంబంధ మరణాలు తెలంగాణలోనే అత్యధికంగా సంభవిస్తున్నాయి. ప్రధానంగా వయసుతో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్ సీఏ) వస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్​ డెత్ (ఎంసీసీడీ) నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా 96,982 మంది చనిపోయారు. రిపోర్ట్ అయిన మొత్తం మరణాల్లో ఇవే 57% ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. జాతీయ స్థాయిలో రిపోర్ట్ అయిన మొత్తం మరణాల్లో గుండె, ఊపిరితిత్తుల సమస్యల వల్ల సంభవించిన డెత్స్ 32% మాత్రమేనని తేలింది. ఈ లెక్కలు కూడా మెడికల్ సర్టిఫికేషన్ డెత్ రిపోర్ట్​లో కారణం పేర్కొనడంతోనే బయటకు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. అసలు రిపోర్ట్ చేయకుండా ఉన్నవి.. హాస్పిటల్ వరకు రాకుండా చనిపోతున్న వారి సంఖ్య ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెప్తున్నారు.

సీపీఆర్​తో సగం మంది బతుకుతరు 

కార్డియో వాస్కులార్ మోర్టాలిటీ రిపోర్ట్ ప్రకారం.. దేశంలో రోజూ వెయ్యి మంది హాస్పిటల్ బయటే సడెన్ కార్డియాక్ అరెస్ట్ కు గురవుతున్నారు. ఎస్ సీఏకు గురైన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. అయితే, ఎస్ సీఏకు గురైన వ్యక్తులకు పక్కనున్న వాళ్లు వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రిససిటేషన్) చేసి, హాస్పిటల్ కు తరలిస్తే.. అక్కడ ఆటోమెటిక్ ఎక్స్ టర్నల్ డీఫైబ్రిలేటర్ ను వాడితే ప్రతి10 మందిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడుతున్నారు. అయితే, ప్రతి 10 ఎస్ సీఏ కేసుల్లో ఏడు ఇంటి దగ్గరే సంభవిస్తున్నాయి. మరోవైపు దేశంలో 98% మందికి సీపీఆర్ ఎలా చేయాలో తెలియదు. 2019లో కేవలం 7% మంది పక్కనున్న వాళ్లు మాత్రమే ఎమర్జెన్సీలో హెల్ప్ చేయగలిగారు.

రోజుకు సగటున 700 గుండె చికిత్సలు 

రాష్ట్రంలో గుండె సంబంధిత చికిత్సలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ యావరేజ్​గా 700 మంది వివిధ రకాల హార్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. స్టంట్లు, బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ మార్పిడి, గుండె రంధ్రం పూడిక ఆపరేషన్లు జరుగుతున్నాయి. తక్కువ స్థాయిలో కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్లకు మెడిసిన్, సింగిల్ స్టంట్ వేస్తున్నారు. తీవ్రత మరీ అధికంగా ఉన్నోళ్లకు సర్జరీలు చేస్తున్నారు. శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా జనం గుండె సంబంధిత పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్‌ భారత్‌ రిపోర్ట్ ప్రకారం 2021లో దేశంలో 4.69 లక్షల గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. 21–30 ఏళ్ల వయసులో గుండె చికిత్సలు చేయించుకున్న వారిలో 8 శాతం మంది సింగిల్‌ స్టెంట్లు, 2 శాతం మంది డబుల్‌ స్టెంట్లు వేయించుకున్నారు. అంటే స్టెంట్లు వేయించుకున్నవారు 10 శాతం ఉన్నారు. ఇప్పుడు అది15 శాతం దాటినట్లు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటుతో ఏటా10 లక్షల నుంచి15 లక్షల మంది చనిపోతున్నారు.

త్వరలో లక్ష మందికి సీపీఆర్ ట్రెయినింగ్

హెల్త్​ వర్కర్లతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ లో 60 వేల మందికి, ఎన్జీఓలకు, ఇతరులకు మొత్తం లక్ష మందికి త్వరలోనే సీపీఆర్​చేయడంపై ట్రైనింగ్ ఇచ్చేలా హెల్త్​ డిపార్ట్​మెంట్ ప్రణాళిక వేసింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రెయినర్స్​ను పంపనున్నారు. ఇలా రోజుకు 300 మందికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంతో పాటు గుండెపోటు వస్తే వెంటనే ట్రీట్మెంట్ అందించేందుకు అవసరమైన ఆటోమెటిక్ ఎక్స్​టర్నల్ డీఫైబ్రిలేటర్స్ ను 636 పీహెచ్​సీలు, 236 యూపీహెచ్ సీలు, ఇతర హెల్త్ సెంటర్లలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.18.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

జన్యుపరమైన సమస్యలూ కారణం

ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా యువకులు సైతం సడెన్ కార్డియాక్ అరెస్ట్​తో కుప్పకూలుతున్నారు. జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఇందుకు ప్రధాన కారణం. గుండెపోటు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. మితిమీరిన ఎక్సైజ్ తోనూ గుండెపోటు వస్తుంది. గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ లోపం వల్ల కూడా సడెన్ డెత్స్ అవుతున్నాయి. ఎవరైనా సడెన్ గా కుప్పకూలితే సీపీఆర్ చేసి, దగ్గరలోని హాస్పిటల్​కు తరలిస్తే కాపాడొచ్చు.  

-  డాక్టర్ సాయి సుధాకర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, వెల్​నెస్ హాస్పిటల్స్​