
పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' (OG) సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. మరో సారి మూవీ మేకర్స్ కు కోర్ట్ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా అక్టోబర్ 9 వరకు పొడిగించబడతాయని తెలిపింది. సినిమా టికెట్ రేట్ల పెంపును అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
ఈ వాదనల నేపథ్యంలో, టికెట్ ధరలను ఎందుకు పెంచాలనుకుందో, అందుకు గల పూర్తి కారణాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాల విషయంలో నిర్మాతల పెట్టుబడి రికవరీకి, వసూళ్లకు ఈ టికెట్ ధరల పెంపు కీలకం కాబట్టి, ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుసుకోవాలని హైకోర్టు కోరింది.
►ALSO READ | Rishab Shetty 'కాంతార: చాప్టర్ 1' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. హాట్ కేకుల్లా టికెట్లు సెల్ ..!
కోర్టులో 'ఓజీ' యూనిట్ వాదనలు
'ఓజీ' సినిమా యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వినిపించిన వాదనలు ఆసక్తికరంగా మారాయి. సినిమా టికెట్ రేట్ల పెంపుపై అభ్యంతరం కేవలం కొందరికే ఉందని ఆయన తెలిపారు. సినిమా టికెట్ ధరల నియంత్రణపై ప్రభుత్వాల జోక్యాన్ని ప్రశ్నిస్తూ, ఇతర రంగాల్లో ధరల స్వేచ్ఛను ఉదహరించారు. "ఐపీఎల్ మ్యాచ్ టికెట్ ధర రూ.1,500 ఉన్నప్పుడు, పిటిషనర్లు దాన్ని రూ.200కే ఇవ్వమని కోర్టుకు ఎందుకు రారు? కేవలం సినిమా టికెట్ ధరలపై మాత్రమే ఇలాంటి పిటిషన్‌లు వేయడం సరైంది కాదని వాదించారు.
సినిమా యూనిట్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయగా, కనీసం రు.100, రూ.150 పెంచుకునేందుకు మాత్రమే ఉత్తర్వులు వచ్చాయి. ఈ పెంచిన ధర కూడా కష్టమే అనుకుంటే, పిటిషనర్లు సాధారణ రేట్ ఉన్నప్పుడే సినిమా చూడవచ్చు. మొదటి రోజు తమకు నచ్చిన ధరకే సినిమా చూడాలి అనుకుంటే ఎలా?" అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే 'ఓజీ' సినిమాను ఢిల్లీలో చూడాలంటే టికెట్ ధర 1,500 వరకు ఉంటుంది. అప్పుడు ఇక్కడ అభ్యంతరం వ్యక్తం చేయడం దేనికి? అని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఓజీ తరుపున న్యాయవాది వాదనలతో ఏకీభవించని కోర్టు.. సెప్టెంబర్ 24న సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా అక్టోబర్ 9 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సినిమా టికెట్ రేట్ల పెంపును అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. 'ఓజీ' వంటి భారీ అంచనాలు ఉన్న సినిమా వసూళ్లపై కోర్టు నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్టోబర్ 9న జరగబోయే విచారణలో ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి.