తెలంగాణ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు.. పేదలు కోరిన సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి

తెలంగాణ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు.. పేదలు కోరిన సమాచారాన్ని ఉచితంగా ఇవ్వాలి

సమాచార హక్కు చట్టం భారత పౌరులకు సమాచారం పొందే ప్రాథమిక హక్కును చట్టబద్ధం చేసింది.  తద్వారా వారు ప్రభుత్వ పనితీరును  సమీక్షించే అవకాశం కల్పించింది. ఇటీవల ఈ చట్టం మౌలిక సూత్రాన్ని మరింత పటిష్టపరుస్తూ, తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఉచితంగా అందించాలనే చట్టంలోని నిర్దిష్ట నిబంధనను ఉల్లంఘించడాన్ని హైకోర్టు తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు సమాచార హక్కు చట్టం ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడమే కాకుండా, దాని అమలులో ఇప్పటికీ నెలకొని ఉన్న లోపాలను స్పష్టంగా వెలికితీసింది.

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట గ్రామానికి చెందిన దరఖాస్తుదారుడు, తన గ్రామంలో 'ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం' కింద ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై అనుమానం వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తులకు ఇళ్లు మంజూరయ్యాయని, నిజమైన లబ్ధిదారులు ఈ పథకానికి దూరమయ్యారని ఆయన విశ్వసించారు. సంబంధిత రికార్డులు, లబ్ధిదారుల జాబితా, అర్హత ప్రమాణాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదిగా పరిగణించడమైనది. ఇది సమాజానికి జవాబుదారీతనం కోరుతూ ఒక పౌరుడు తీసుకున్న సాహసోపేతమైన చర్య. అయితే, సమాచారాన్ని అందించడానికి బదులుగా, ప్రజా సమాచార అధికారి దరఖాస్తుదారు కోరిన పత్రాల కాపీల కోసం రూ.6,000కు పైగా రుసుము చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 7(5) కు స్పష్టమైన ఉల్లంఘన. ఈ నిబంధన చాలా నిర్దిష్టంగా ‘దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఏ వ్యక్తి నుంచి కూడా సమాచారాన్ని పొందేందుకు రుసుము వసూలు చేయరాదు’ అని పేర్కొంటోంది. ఈ ప్రాథమిక నిబంధనను అధికారులు విస్మరించారు. దరఖాస్తుదారు ఈ నిరాకరణను సవాలు చేస్తూ చట్టబద్ధంగా తన అప్పీళ్లను దాఖలు చేశారు. మొదట, ఆయన తొలి అప్పిలేట్ అధికారిని ఆశ్రయించారు, ఆ తర్వాత రాష్ట్ర అత్యున్నత సంస్థ అయిన తెలంగాణ సమాచార కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. కానీ, ఈ రెండు సంస్థలూ ఈ కేసులోని చట్టపరమైన అంశాలను విస్మరించి, దరఖాస్తుదారు అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించాయి. విధిలేని పరిస్థితుల్లో, తన హక్కును కాపాడుకోవడానికి, దరఖాస్తుదారుడు చివరి ఆశ్రయంగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయక తప్పలేదు.

కేంద్ర చట్టం వర్సెస్ రాష్ట్ర ఉత్తర్వు
ఈ కేసులో ప్రధానంగా, కేంద్ర చట్టమైన సమాచారహక్కు చట్టం 2005,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 454 మధ్య తలెత్తిన వైరుధ్యాన్ని హైకోర్టు పరిష్కరించింది. ఈ జీఓ సమాచార రుసుములను నిర్ధారించినప్పటికీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత సమాచారం గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఈ నేపథ్యంలో,  న్యాయస్థానం 'ప్రొవిజనల్ లెజిస్లేషన్'  'డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ'  వంటి న్యాయ సిద్ధాంతాలను పరిగణనలోకి తీసుకుని,  కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ఉన్నతమైనది.

ఒకవేళ రాష్ట్ర ఉత్తర్వు కేంద్ర చట్టంతో విభేదిస్తే, కేంద్ర చట్టానికే ప్రాధాన్యత ఉంటుందని తీర్పు వెలువరించింది. ఈ వివాదాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం భారత రాజ్యాంగ సూత్రాలను అనుసరించి ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది.  కేంద్ర చట్టం ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నిలబడదని కోర్టు స్పష్టం చేసింది. జీఓ నెం. 454 సమాచార హక్కు చట్టం, 2005లోని సెక్షన్ 7(5) ను అధిగమించలేదని పేర్కొంది. దరఖాస్తుదారుడికి ఉచిత సమాచారం ఇవ్వకపోవడం చట్టం ఉద్దేశాన్ని, దాని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పు ద్వారా కోర్టు దరఖాస్తుదారుడికి ఉచితంగా సమాచారాన్ని అందించాలని ప్రజా సమాచార అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

తీర్పు ప్రభావాలు
ఈ తీర్పు కేవలం ఒక కేసును పరిష్కరించడమే కాకుండా ఇది ఒక చట్టపరమైన ప్రామాణికంగా నిలుస్తోంది. ఇది సమాచార హక్కు చట్టం  నిజమైన లక్ష్యాన్ని.. అంటే పేదలు కూడా సమాచారాన్ని పొందే హక్కును కలిగి ఉన్నారని ధృవీకరిస్తోంది. ఈ తీర్పు ద్వారా భవిష్యత్తులో  ఎలాంటి చట్టపరమైన ఉల్లంఘనలు జరగకుండా నిరోధించవచ్చు. ఇది పారదర్శకత, జవాబుదారీతనం కోసం జరిగిన ఒక ముఖ్యమైన న్యాయపోరాటంలో సాధించిన విజయం. ప్రభుత్వ అధికారులు తమ నిబంధనలను కేంద్ర చట్టాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ తీర్పు గుర్తు చేసింది.   ఈ తీర్పు ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకునే నిరుపేదల నుంచి ఇకపై అక్రమ రుసుములను వసూలు చేయలేవు.   ఈ నిర్ణయం అధికారులకు చట్టాన్ని సరైనపద్ధతిలో అమలు చేయడంలో ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.

సమాచారంపై ప్రజలకు హక్కు
 ప్రజలు ముఖ్యంగా పేదలు తమ హక్కులను వినియోగించుకోవడానికి  ఈ తీర్పు మరింత ప్రోత్సాహం అందిస్తోంది. ఇకపై, ప్రభుత్వ కార్యాలయాలు ఈ చట్టాన్ని మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ తీర్పు సమాచార హక్కు చట్టం నిజమైన లక్ష్యాన్ని, సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని నిలబెడుతుంది. తెలంగాణ హైకోర్టు తీర్పు సమాచార హక్కు చట్టం  ప్రాధాన్యతను, పారదర్శక పాలన ఆవశ్యకతను మరోసారి నిరూపించింది. 

ఇది కేవలం ఒక న్యాయ విజయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే ఒక గొప్ప అడుగు.  ఈ తీర్పుతో ప్రభుత్వ అధికారులు తమ నిబంధనలను కేంద్ర చట్టాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాచారంపై ప్రజలకు పూర్తి హక్కు ఉందని,  ఆ సమాచారం దొరకనంతవరకు ప్రజల భాగస్వామ్యం సాధ్యం కాదని ఈ తీర్పు గుర్తు చేసింది. 

 డా. కట్కూరి, సోషల్​ ఎనలిస్ట్ & న్యాయ నిపుణుడు