కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం

కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం

చరిత్ర

సలేశ్వరం క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో బయట పడిన ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. ఈ శాసనాలు క్రీ.శ. 260 సంవత్సరంలో వేయించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. వీటిలో 'చుళదమ్మగిరి' గురించి ప్రస్తావించారు. శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ భిక్షవుల కోసం ఇక్ష్వాకులు చుళదమ్మగిరిపై అరామాలు కట్టించారు. అయితే ఆనాటి 'చుళదమ్మగిరే' ఈనాటి 'సలేశ్వరం' అని చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇక్ష్వాకుల కాలపు కట్టడాలు కూడా ఉన్నాయి. ఆనాటి బౌద్ధ క్షేత్రమే 6-7 శతాబ్దాల్లో శైవ క్షేత్రంగా మార్పు చెందిందంటారు. ఇక్కడ విష్ణుకుండినులు కూడా కొన్ని నిర్మాణాలు చేశారు. అవి క్రీ.శ. 360--------- 370 మధ్య కాలానికి చెందినవి. 

గర్భగుడి ముఖ ద్వారంపై విష్ణు కుండినుల చిహ్నంగా గుర్తించిన 'పూలకుండి' ప్రతిమ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇది విష్ణుకుండినుల కాలంలోనే పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు. 13వ శతాబ్దం నాటి 'మల్లికార్జున పండితారాధ్య చరిత్ర' గ్రంథంలో  ఈ క్షేత్ర విశేషాలను" పాల్కురికి సోమనాథుడు వివరించారు. 17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉత్సవాలు మాత్రం సుమారు ఎనిమిది వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఆలయం ముందుభాగంలో కుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల వీరభద్రుని విగ్రహం ఉంది. దాని నాలుగు చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. కుడి చేతుల్లో గొడ్డలి, కత్తి, ఎడమ చేతుల్లో ఢమరుకం, మరో ఆయుధం పట్టుకుని ఉన్నాడు. ఇక్కడే వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఎడమ వైపున గంగమ్మ విగ్రహం ఉంది. ఈ విగ్రహాలు అన్నీ పురాతనమైనవే. వీటి ముందు రోలు ఉంది. ఇది స్థిర నివాసాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి ఎడమవైపున బ్రహ్మీలిపిలో చెక్కిన ఒక శాసనం ఉంది. కుడివైపున మరో ప్రాచీన తెలుగు శాసనం ఉంది. ఈ రెండింటినీ చరిత్రకారులు విష్ణు కుండినుల శాసనాలుగా గుర్తించారు.

నిజాం విడిది గృహం

నల్లమల అడవుల్లో ప్రకృతి అందాలను చూసి నిజాం రాజు మురిసిపోయాడు. దాంతో అక్కడ వేసవి విడిది కేంద్రాన్ని కట్టించుకున్నాడు. అంతకుముందు ఆ ప్రాంతాన్ని 'పుల్ల చెలమల' అని పిలిచేవాళ్లు. ఆ తరువాత ఫరాహాబాద్(అందమైన ప్రదేశం) అంటున్నారు. ఈ ప్రాంతంలోనే 1973లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

గుండంలో స్నానం..

సలేశ్వరం గుండంలో నీళ్లు చాలా చల్లగా, స్వచ్ఛంగా ఉంటాయి. ఈ గుండాన్ని శంఖుతీర్థం అని పిలుస్తారు. అడవిలో అనేక వనమూలికలు, ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ వచ్చే ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. శంఖుతీర్థంలో స్నానం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు భక్తులు. గుడిలో ప్రతి ఆకును పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చక్కెరతో పూజిస్తారు. లింగమయ్యస్వామికి, గంగమ్మకు భక్తులు వెండి వస్తువులు చేయించి మొక్కులు చెల్లించుకుంటారు. నాగదోషం ఉన్నవాళ్లు వెండి నాగుపామును ఇస్తారు. చెంచులు ఇప్పపువ్వును నైవేద్యంగా సమర్పిస్తారు.

జాతర

సలేశ్వరం జాతర.. సంవత్సరానికి ఒకేసారి ఐదు రోజులు జరుగుతుంది. ఈ ఐదు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలోకి భక్తులను అనుమతిస్తారు. మిగతా రోజుల్లో ఈప్రాంతానికి వెళ్లే సాహసం ఎవరూ చెయ్యరు. ఎందుకంటే ఈ అడవిలో క్రూర జంతువులు సంచరిస్తుంటాయి. జాతర జరిగినన్ని రోజులు కొండ కోనల్లో నడిచే భక్తులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు భోజన, తాగునీటి వసతి కల్పిస్తున్నాయి. జాతరకు వచ్చేటప్పుడు భక్తులు 'వస్తున్నం.. వస్తున్నం.. లింగమయ్యో' అంటారు.. వెళ్లేటప్పుడు 'పొయ్యొస్తం పొయ్యొస్తం లింగమయ్యో' అంటారు.

చెంచులే పూజారులు

సలేశ్వరం గుహలో వెలిసిన స్వామివారికి చెంచులే పూజలు చేస్తారు. కుక్కలను వెంటబెట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ చెంచులు ఈ ప్రాంతానికి వచ్చారట. అప్పుడు ఆ కుక్కలే గుహలోని స్వామివారిని చెంచులకు చూపించాయి. దాంతో అప్పటి నుంచి వాళ్లే స్వామి వారికి పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ ఆలయంలో చెంచులే పూజారులుగా ఉన్నారు.

ప్లాస్టిక్ నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా సలేశ్వరంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నారు. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వాళ్లు ఉపయోగించే ప్లాస్టిక్ అడవిలో వదిలి వెళ్తే జంతువులు తిని చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్లాస్టిక్ నిషేధాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు దీనిపై అవగాహన కల్పించేందుకు మార్గమధ్యంలో బ్యానర్లును ఏర్పాటు చేశారు.